ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలు ఎంత బాగా జరుగుతున్నాయో అందరికీ అర్థమవుతూనే ఉంది. ప్రతిపక్షాల రాద్ధాంతం అనండి, వైరి వర్గం మీడియా ఓవర్ యాక్షన్ అనండి.. ఏపీలో పదో తరగతి పరీక్ష పత్రాలు బయటకొస్తున్న మాట వాస్తవమే. లేకపోతే దాదాపు 40 మంది ఉపాధ్యాయులను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకుంటారు. 30 మందిపై కేసులెందుకు పెడతారు. తప్పు ఎవరిదైనా నష్టపోయేది విద్యార్థులు, ఆందోళనతో తల్లడిల్లేది వాళ్ల తల్లిదండ్రులు.
తెలుగుతో మొదలు పెట్టి అన్ని పరీక్ష పేపర్లు నిమిషాల వ్యవధిలో సెల్ ఫోన్లలోకి వచ్చేస్తున్నాయి. మరి నిఘా ఎక్కడ, అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలేంటి..? ఈ విమర్శలను తట్టుకోడానికి ఇప్పుడు కొత్తగా 'నో ఫోన్ జోన్లు' అంటూ టెన్త్ పరీక్షా కేంద్రాలను నోటిఫై చేస్తామంటున్నారు. చివరకు చీఫ్ ఎగ్జామినర్ కూడా పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లకుండా స్ట్రిక్ట్ ఆర్డర్లు పాస్ చేసింది విద్యాశాఖ. చేతులు బాగా కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటోంది.
గతంలో విద్యార్థులు పరీక్ష హాల్ లోకి వెళ్లేటప్పుడు వారి జేబులు చెక్ చేసేవారు, ఆ తర్వాత చెవుల్లో ఇయర్ ఫోన్లు ఉన్నాయా.. ఇంకెక్కడైనా మైక్రో రిసీవర్లు పెట్టుకున్నారా అని క్షుణ్ణంగా వెదుకుతున్నారు. కానీ ఏపీ టెన్త్ పరీక్ష పేపర్ల వ్యవహారంలో విద్యార్థుల తప్పేం లేదని తేలింది. చేసేదంతా ఉపాధ్యాయులే, పేపర్ లీక్ చేసి కేసుల్లో ఇరుక్కున్నవారు కూడా ఉపాధ్యాయులే కావడం గమనార్హం.
ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చే డబ్బులకు ఆశపడి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు ఉపాధ్యాయులు. సింపుల్ గా క్వశ్చన్ పేపర్ సెల్ ఫోన్ లో ఫొటో తీసి, బయటకు పంపించేస్తున్నారు. అయితే టెక్నాలజీ సాయంతో ఆ పేపర్ ని సర్కులేట్ చేసింది ఎవరనే విషయాన్ని పోలీసులు ఈజీగా కనిపెడుతున్నారు. కానీ విద్యార్థుల్లో ఆందోళన అలాగే ఉంటోంది.
పేపర్ లీక్ అయిందా, లేదా, అసలు దాన్ని లీకేజీ అంటారా.. పోనీ పరీక్షలు జరిగినన్ని రోజులు ఆ మూడు ఛానెళ్లు చూడకుండా తల్లిదండ్రులు, పిల్లలు ఉండగలరా..?
ఇలాంటి సందర్భం లేని ప్రశ్నలన్నీ ఇప్పుడు వినిపిస్తున్నాయి. అమాత్యుల మాట ఎలా ఉందంటే.. కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగినట్టు ఉంది. ఇప్పటికైనా నో ఫోన్ జోన్లుగా పరీక్షా కేంద్రాలను మార్చాలనే నిర్ణయం మంచిదే.
తప్పంతా సెల్ ఫోన్లదే.. అయినా తప్పుతుందా..?
ఉపాధ్యాయులే సెల్ ఫోన్లలో పరీక్ష పత్రాలను ఫొటోలు తీసి బయటకు పంపుతున్నారనే విషయం రూఢీ అయింది. దీంతో ఎగ్జామినర్లతో సహా, చీఫ్ ఎగ్జామినర్ కూడా పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్ తేవడాన్ని నిషేధించింది విద్యా శాఖ. ఇయర్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తేవద్దని, తెస్తే సీజ్ చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
అయితే ఇప్పటికైనా ఈ లీకేజీ వ్యవహారం సద్దుమణుగుతుందా లేదా అనేది చూడాలి. నో ఫోన్ జోన్లు అనే కొత్త ప్రతిపాదన వచ్చిన తర్వాత కూడా ఇంకా పేపర్ బయటకొస్తుందంటే మాత్రం కచ్చితంగా మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అక్రమార్కులకు జీవితాంతం గుర్తుండిపోయే పాఠం చెప్పాల్సిందే.