శక్తి ప్రధానమైన సినిమాల గురించి చెప్పుకున్నపుడు చెప్పాను – హీరో అనగానే కండబలం చూపాలి అని. కానీ కండబలానికి కూడా హద్దు వుంటుందని అందరికీ తెలుసు. ఒక్క బాణాకర్ర చేతపట్టి పదిమందిని కొట్టినట్టు చూపిస్తే ఒప్పుకుంటారు గానీ బొత్తిగా వందమందిని కొట్టినట్టు చూపిస్తే జనం నమ్మరు .. గేలి చేస్తారు. పైగా సేనాపతి వద్దకు డైరక్టుగా వెళ్లి కత్తి దూస్తానంటే ద్వారపాలకులు పట్టుకు తంతారనీ తెలుసు. అందువల్ల మారువేషమో, మరో వేషమో వేసి సేనాపతిని మోసగించాడంటే నమ్ముతారు. నమ్మడంతో బాటు బోల్డంత వినోదం పొందుతారు. 'పాతాళభైరవి'లో రామారావు మారువేషాలు వేయలేదు కానీ, రాను రాను జానపదాల్లో మారువేషాలనేవి తప్పనిసరి వ్యవహారం అయిపోయాయి. మారువేషం అనేది ప్రేక్షకుణ్ని ఎక్సయిట్ చేస్తుంది.
ఇక్కడ ఒకటి గమనించాలి. హీరో మారువేషం వేశాడని ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. కానీ విలన్‌కి తెలియదు. అందువల్ల ప్రేక్షకుడు విలన్కంటె పై స్థానంలో వున్నట్టు ఫీలై, తనే విలన్ని జయించినంత సంతోష పడిపోతాడు. అతనికి ఆ ఆనందం దక్కాలంటే హీరో మారువేషంలో వున్నాడని అతను గుర్తుపట్టే లెవెల్లోనే మారువేషం వేసుకోవాలి. మారువేషం కదాని మొహం అంతా మీసం, గడ్డం కప్పేసి పైన ముసుగు తొడుక్కుని వచ్చేస్తే ప్రేక్షకుడికి ఎక్సయిట్మెంట్ పోతుంది. అందుకని మారువేషం అంటే మరీ గుర్తు పట్టలేనట్టంతగా కాకుండా ఓ వంకర మీసమో, ఓ చిరుగడ్డమో, కళ్లకు గంతలో తగిలించి వస్తే చాలు. అది కూడా మధ్యలో కాస్త పీకేసి హీరోగారు ప్రేక్షకుడి కేసి చూసి కన్ను కొట్టాలి. అప్పుడే ప్రేక్షకుడు కేరింతలు కొడతాడు. ఆడియన్స్‌తో డైరక్టు కాంటాక్టంటే యిదే! ఇది గ్రహించకుండా చాలామంది విమర్శిస్తారు – 'అదే మారువేషమండీ? ఓ బుంగమీసం పెట్టుకొస్తే కన్నతల్లి కూడా గుర్తుపట్టలేనట్టు చూపిస్తారు. నాన్సెన్స్' అని. అలా అనేవాళ్లు సినిమా గ్రామర్‌ను విస్మరిస్తున్నారని అర్థం.
యుక్తిప్రధానమైన సినిమాల్లో ఈ మారువేషాలకు అవకాశం అపారం. విలన్‌ను ఆటపట్టించడానికో, హీరోయిన్ మనసు తెలుసుకోవడానికో హీరో ఓ ముసలమ్మలాగానో, లేదా మునీశ్వరుడిలాగానో వచ్చి వాళ్లను మోసగిస్తాడు. ఒక్కోప్పుడు విలన్ కూడా మారువేషాన్ని గుర్తుపట్టేసినా తెలియనట్టుగా నటించి బంధింపచూస్తున్నాడని చూపిస్తారు. అప్పుడు హీరో ప్రమాదంలో పడతాడు. ఆ విషయం ప్రేక్షకుడికి తెలుస్తుంది కానీ హీరోకి తెలియదు. అలాటి సమయాల్లో ప్రేక్షకుడు ఆదుర్దా పడి, ఎక్సయిట్ అవుతాడు. 'చూసుకో, వాడు వెనక్కాలనుండి వస్తున్నాడు' అని కేకలేసి హీరోను హెచ్చరిస్తారు. బి,సి సెంటర్లలో సినిమాహాల్లో యిలాటి కేకలు సర్వ సహజం. ఓ సారి నేను ఒక పల్లెటూళ్లో టెంటు హాల్లో జానపద సినిమా చూస్తున్నాను. తెరమీద విలన్ సత్యనారాయణ హీరో కాంతారావును పట్టుకుని కొరడాతో చావగొట్టేస్తున్నాడు. హీరోతో మమేకమై పోయిన ఓ ప్రేక్షకుడు భరించలేకపోయాడు. అతను సినిమా అంతకుముందే చూసినట్టున్నాడు. కథ తెలుసు. అయినా వుండబట్టలేక పోయాడు. 'ఒరే సత్తిగా, నీ పనుందిరా ఆఖర్న' అని విలన్ సత్యనారాయణను గట్టిగా కేకేసి హెచ్చరించాడు.
ప్రేక్షకుడిని అంత యిదిగా యిన్వాల్వ్ చేయగల శక్తి కలిగినవి – జానపద సినిమాలు! ఇప్పుడు సైఫై సినిమాల పేరుతో మారువేషాలు వేసుకుని వస్తున్నవి జానపద సినిమాలు కావా? హాలీవుడ్ వాళ్లు తీసే స్టార్‌వార్స్ కాదు, లార్డ్ ఆఫ్ రింగ్స్ కాదు, మరోటి కాదు అన్నీ విఠలాచార్య మార్కు జానపదాలు కావూ!? ముగ్గురు నలుగురు శక్తిమంతులు కలవడం, ఆపదల్లో వున్న అమ్మాయిని రక్షించడం – ఇదేగా థీమ్! అంతెందుకు సూపర్ డూపర్ హిట్ 'క్రిష్' ఏమిటి? అపారమైన భుజబలం, అతీత శక్తులు, ఆపదలో వున్న జనమును రక్షించుట – ఇదేగా! క్రిష్ మాస్క్ తొడుక్కుంటే క్రిష్లాగే ఎగరగలమని నమ్మిన ఓ కుర్రాడు ఆ మధ్య ఐదంతస్తుల బిల్డింగు మీదనుండి ఉరికి కాళ్లు విరక్కొట్టుకున్నాడు. జానపద సినిమాలు చూసి చీపురుపుల్లల కత్తులతో యుద్దాలు చేసుకుని పిల్లలు కళ్లు పొడుచుకున్న రోజులున్నాయి. అదీ జానపదాల పవర్!
మారువేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. మనలో ప్రతివాడికీ మనలా కాకుండా వేరేవాడిలా వుండాలన్న కోరిక వుంటుంది. అది ఈ మారువేషాల సన్నివేశాల ద్వారా తీరుతుంది – హీరో, హీరోయిన్లతో మనను మనం ఐడెంటిఫై చేసుకుంటాం కాబట్టి! ఈ సినిమాల్లో యువరాజుగారు సామాన్యుడిలా మారువేషం వేసుకుని ప్రజల్లో కలిసిపోతే ఎక్సయిట్ అయిపోతాం. తన ప్రేయసి ఐన ఓ సామాన్య యువతి తన ఐశ్వర్యాన్ని ప్రేమిస్తోందా. లేక తనను మామూలు మనిషిగా భావించి ప్రేమిస్తోందా తెలుసుకోవాలని అతని కెంత ఉత్సుకత వుంటుందో, మనకూ అంతే వుంటుంది. అలాగే సామాన్యుడు మహారాజులా వేషం వేసుకుని కోటలోకి వెళ్లిపోతే ఎక్సయిట్ అయిపోతాం. వెళ్లి అక్కడ ధనమదాంధతతో కుళ్లిపోతున్న వారికి బుద్ధి చెప్పి, మా సామాన్య జనంజోలికి వచ్చావంటే ఖబడ్దార్ అని అనేసి వస్తే మరీ సంతోషం.
అనేక సినిమాల్లో చూపించిన అంశమేమిటంటే – విదేశం నుండి రాయబారులు వస్తూ వుంటారు. హీరోగారి మనుష్యులు వారిని దారిలో కట్టిపడేసి వారి వేషాల్లో, వారి పత్రాలతో వీళ్లు రాజుగారి కొలువులోకి వచ్చేస్తారు. ఆ దేశంవాళ్లు ఎలా వుంటారో ఇక్కడివారెవరికీ తెలియదు కాబట్టి వీళ్ల ఆటలు సాగుతాయి. వీటిల్లో హీరోయిన్ మొగాడి వేషం వేసుకుని వచ్చేయడం కద్దు. ఒక్కోప్పుడు యువరాణి, ఆమె చెలికత్తె యోధానుయోధుల్లా వేషం వేసుకుని, తలపాగా చుట్టేసి దేశాటనకు బయలు దేరేస్తూ వుంటారు. ఆడలక్షణాలు ప్రస్ఫుటంగా తెలుస్తూనే వుంటాయి. అయినా ఇంత మేధావి ఐన హీరోగారు అవేమీ గమనించడు. మగాడు అనుకునే 'రా, మిత్రమా' అంటూ వాటేసుకుంటూ వుంటాడు. ఇవతల ప్రేక్షకుల్లోంచి ఈలలు, కేకలు. ఈ మారువేషాల్లో కాంతారావు, రామారావు ఘనులు. రామారావుగారికైతే మారువేషం వహా యిష్టం, ఎలాగోలా కథలో యిరికించమనేవారనుకుంటాను. ఆ పిచ్చి ఎంతవరకు వెళ్లిందంటే చివరకు సాంఘికాల్లో కూడా మారువేషాల్లేందే ఒప్పుకునేవారు కారు. 'విచిత్ర కుటుంబం' అనే సినిమా వుంది. సినిమా అంతా రామారావు హుందాగానే నటించారు. కానీ చివరిలో విలన్ ఆట కట్టించడానికి ఓ మారువేషం వేశారు. ఇవన్నీ ఎందుకంటే – ఇందాకా చెప్పాను కదా, ప్రేక్షకులకు కిక్ ఇవ్వడానికన్నమాట!
యుక్తిలో భాగంగా మారువేషాల గురించి చెప్పుకున్నాం కదా! ఇవి బయటవాళ్ల దగ్గిర వేయడం అనేక సినిమాల్లో చూశాం కదా! కానీ 'గుణసుందరి కథ'లో భార్య దగ్గరే భర్త మారువేషం వేస్తాడు. తను అందగాడూ, రాజకుమారుడూ ఐ వుండి, కావాలని కురూపిగా భార్య వద్ద నటిస్తాడు. అందగాడిగా భార్య వద్దకు వచ్చి ఊరిస్తాడు, పరాయి పురుషుణ్ని ఆదరిస్తుందా లేదా? చూడడానికి. శక్తిప్రధానమైన జానపద చిత్రాల గురించి చెప్పుకున్నపుడు చెప్పాను కదా – ప్రతి హీరోకి ఓ అపురూపమైన వస్తువును – పువ్వో, ఫలమో – సాధించే లక్ష్యం వుంటుందని, దాన్ని భుజబలంతో, సాహసంతో సాధిస్తాడని చెప్పాను కదా! ఈ సినిమాలో హీరో అర్భకుడు. శారీరకంగా బలహీనుడు. అందువల్ల దాన్ని యుక్తితో సాధిస్తాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2015)