సెలబ్రిటీ అంటే సెలబ్రిటీనే. అందునా మహేష్ బాబు లాంటి హీరో అంటే మన జనాలకు మహా సరదా వుంటుంది. ఇప్పుడు అదే క్యాష్ చేసుకుంటున్నారట 'తానా' జనాలు. 'తానా' అంటే తెలిసిందేగా అమెరికాలో ఓ తెలుగు జనాల సంఘం. ఈ సంఘ సమావేశాలకు రమ్మని మహేష్ ను ఆహ్వానించారు. అయితే మహేష్ లాంటి సూపర్ స్టార్ వట్టినే వస్తాడా? కొటిన్నరకు ఒప్పందం కుదిరింది అని వినికిడి.
అయితే అది మహేష్ తీసుకుంటాడా, లేదా దేనికన్నా ఛారిటీ కి ఇస్తాడా అన్నది వేరే సంగతి. ఇప్పడు తానా జనాలకు ఆ కోటిన్నర ఎలా రికవరీ అవుతుంది. అందుకే మహేష్ తో ఫొటో దిగాలంటే ఇంత..మహేష్ తో డిన్నర్ చేయాలంటే ఇంత, మహేష్ తో వెన్యూ వరకు ట్రావెల్ చేయాలంటే ఇంత అని రేట్లు ఫిక్స్ చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ వైనం ఈ నోటా, ఆ నోటా యుఎస్ లోని తెలుగు జనాల్లో వ్యాపించింది. వారిలో మహేష్ అభిమానులు ఈ వైనాన్ని నమ్రత దృష్టికి తెచ్చి, మహేష్ ఇమేజ్ ను ఇలా బజార్లోపెట్టారని, ఎట్టిపరిస్థితుల్లోనూ రావద్దని కోరారట. ఆ వైనం సంగతి ఎలా వున్నా కోటిన్నర సంగతి బయటకు వచ్చిందని మహేష్ కాస్త ఇబ్బంది పడ్డాడట.
కాంట్రావర్సీలు అంటే దూరంగా వుండే మహేష్ ఇప్పుడు తాను తానాకు రాను కాక రాను అంటున్నాడట. దీనికి బుజ్జగింపులు, సిఫార్సులు నడుస్తున్నాయట. మొత్తానికి మన జనాలు అమెరికాలో దేన్నైనా అమ్మేసేలా వున్నారు. ఓవర్ సీస్ మార్కెట్ అలాంటిది.