ప్రాజెక్ట్-కె సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇలా రిలీజైందో లేదో అలా ట్రోలింగ్ మొదలైంది. ఐరన్ మేన్ ఫొటోకు ప్రభాస్ ముఖం తగిలించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. అదనంగా ప్రభాస్ హెయిర్ స్టయిల్ పై కూడా కామెంట్స్ పడ్డాయి.
ఊహించని విధంగా ట్రోలింగ్ రావడంతో.. నిన్న రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ ను వైజయంతీ మూవీస్ సంస్థ డిలీట్ చేసింది. చాలామందికి ఈ విషయం తెలియదు కూడా. రాత్రికిరాత్రి ఆ పోస్టర్ ను డిలీట్ చేసి, ఆ స్థానంలో మరో పోస్టర్ ను పెట్టింది. అయితే ఈసారి కూడా ట్రోలింగ్ తప్పలేదు.
రెండోసారి పోస్ట్ చేసిన ఫస్ట్ లుక్ లో కూడా మార్పులేం లేవు. కేవలం బ్యాక్ గ్రౌండ్ ను మాత్రమే తొలిగించారు. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆ మాత్రం దానికి ఉన్నది డిలీట్ చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరికొంతమంది సెటైరిక్ గా రెండోది కూడా డిలీట్ చేయాలని కోరుతున్నారు.
ప్రాజెక్ట్-కె యూనివర్స్ బయటపడుతుందనే ఉద్దేశంతో మొదటి ఫస్ట్ లుక్ ను డిలీట్ చేశారు. మరో గ్రహంలో ప్రభాస్ ఫైట్ చేస్తున్నట్టు ఫస్ట్ లుక్ ఉందనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర నిన్ననే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ ఛాయలు కనిపించకుండా బ్యాక్ గ్రౌండ్ తొలిగించారు. ఓ ప్లెయిన్ స్టిల్ ను మాత్రం రిలీజ్ చేశారు.
అయితే ఈ పనేదో వెంటనే చేసుంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 15వేల రీట్వీట్లు. 4 గంటల్లో 2 మిలియన్ కు పైగా రీచ్, 40వేలకు పైగా లైక్స్ వచ్చిన తర్వాత ఆ ఫొటోను డిలీట్ చేయడంలో అర్థం లేదంటున్నారు.
మొత్తమ్మీద ప్రాజెక్టు-కెలో ప్రభాస్ ఫస్ట్ లుక్ కు సంబంధించి మార్పులైతే జరిగాయి. సినిమా నేపథ్యం బయటపడుతుందనే ఉద్దేశంతో మొదటి పిక్ ను డిలీట్ చేశారా.. లేక ట్రోలింగ్ వల్ల వెనక్కి తగ్గారా అనే విషయం తేలాల్సి ఉంది. అంతా కామిక్-కాన్ పై దృష్టిపెట్టిన టైమ్ లో ఈ డిలీట్ కార్యక్రమం జరిగిపోయింది. గ్లింప్స్ వచ్చేవరకు ఈ విమర్శల వాన ఇలా కొనసాగుతూనే ఉంటుంది.