మరో వారం రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి షష్టి పూర్తి పుట్టిన రోజు వస్తోంది. ఈ తేదీ నాటికి చిరంజీవి 150 వ సినిమా వ్యవహారాలు కొలిక్కి వస్తాయని, ఆ రోజకు కనీసం ప్రకటన అన్నా వుంటుందని అభిమానులు ఆశించారు. ఆ మేరకు ప్రయత్నాలు అయితే జరిగాయి. పూరి జగన్నాధ్ కు బాధ్యతలు అప్పగించారు. ఆయన తొలిసగం పూర్తి చేసారు. కానీ అంతలోనే ఆ ప్రాజెక్టు అటకెక్కినట్లు వార్తలు వినవచ్చాయి.
ఇటీవల కొత్త రూమర్ వినవచ్చింది. మురగదాస్-విజయ్ కాంబినేషన్ లోని కత్తి సినిమాను చిరు చేస్తారన్నది దాని సారాంశం. కానీ దానికి కొన్ని టెక్నికల్ అబ్జెక్షన్లు వచ్చాయని వినికిడి. మరో పక్క వివి వినాయక్ కూడా కథా చర్చలు జరిపారు. వాటి సారాంశం ఏమిటన్నది బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో అసలు 150 వ సినిమా కు ఈ నెల 22 న కొబ్బరి కాయ కొడతారా అన్నది అనుమానంగా వుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అటువంటిది ఉండకపోవచ్చని తెలుస్తోంది. అభిమానులకు ఏదో ఒకటి చెప్పవచ్చు కానీ, సినిమాకు కొబ్బరి కాయ కొట్టే పని అయితే వుండకపోవచ్చని తెలుస్తోంది.
బాహుబలి, శ్రీమంతుడు సినిమాల ఫలితాలు చూసాక చిరంజీవి జంకుతున్నారని వినికిడి. తను ప్రెస్టీజియస్ గా చేస్తే, ఆ సినిమా అన్ని రికార్డులు బ్రేక్ చేయాలి. పోనీ బాహుబలి లాంటి రేర్ సినిమా సంగతి పక్కన పెట్టినా, మరే రికార్డులు మిగల కూడదు. కానీ అంత సీన్ వుంటుందా అని కిందా మీదా అవుతున్నారు. పైగా సబ్జెక్ట్ కుదరడం లేదు. అందుకనే ఈ 150 వ సినిమా వ్యవహారాన్ని ఈ పుట్టిన రోజు వేడుకలకు స్కిప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.