ఎమ్బీయస్‌: గోడ్సే-31 ”నైన్‌ అవర్స్‌ టు రామా”-1

గాంధీ హత్యపై స్టాన్లీ వోల్‌పర్ట్‌ రాసిన హిస్టారికల్‌ ఫిక్షన్‌ ''నైన్‌ అవర్స్‌ టు రామా'' నవల యిలా సాగుతుంది – Advertisement 1948, జనవరి 30 ఉదయం 8 గం|| నాథూ, ఆప్టే ఢిల్లీ…

గాంధీ హత్యపై స్టాన్లీ వోల్‌పర్ట్‌ రాసిన హిస్టారికల్‌ ఫిక్షన్‌ ''నైన్‌ అవర్స్‌ టు రామా'' నవల యిలా సాగుతుంది –

1948, జనవరి 30 ఉదయం 8 గం|| నాథూ, ఆప్టే ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్‌ రూములో బస చేసి వున్నారు. వాళ్లు పెట్టుకున్న కార్యక్రమం ఆ రోజు సాయంత్రం 5 గం||లకు. 4 గంటలకు గుప్తా భవన్‌కు వెళితే సరిపోతుంది. కానీ రిటైరింగు రూముకి గడువు మధ్యాహ్నం 12 గం||ల వరకే వుంది. తమ గురించి ఢిల్లీ పోలీసులు వెతుకుతున్నారని తెలుసు. జనవరి 20 నాటి విఫలయత్నంలో పట్టుబడి జైల్లో వున్న పహ్వా తమ పోలికలు, ఆనుపానులు అన్నీ చెప్పేసి వుంటాడు.  నాలుగు గంటలపాటు బయట తిరిగితే పోలీసుల కంటపడడం ఖాయం. మేనేజర్ని బతిమాలి ఇక్కడే ఎలాగైనా తలదాచుకోవాలి.. కనీసం మూడు గంటల వరకైనా! కానీ మేనేజరు చూస్తే కొరకరాని కొయ్యలా వున్నాడు. పొద్దున్నే వచ్చి 12 గంటల కల్లా ఖాళీ చేయాలని గుర్తు చేసి మరీ వెళ్లాడు. పై అధికారులెవరో చెకింగ్‌కు వస్తున్నారట, తనకి మాట వస్తుందట. లంచం యిచ్చినా వద్దన్నాడు. నాథూకి ఒళ్లు మండింది. ఆప్టేని వెళ్లి బియర్‌ పట్టుకురమ్మన్నాడు. 'మన నాయకుడు కాటక్‌ యివాళ నిన్ను తాగవద్దన్నాడుగా' అని గుర్తు చేశాడు ఆప్టే. 'నేను చెప్పినది చేయి చాలు' అని కసురుకున్నాడు నాథూ.

కాస్సేపటికి ఆప్టే బియరు సీసాలతో తిరిగి వచ్చాడు. 'నన్నెవరో వెంబడించారు. కష్టపడి వదిలించుకుని వచ్చాను' అన్నాడు. పోలీసులని తప్పించుకోవడం వాళ్లకు కొత్త కాదు. రైల్వే ట్రాక్స్‌ తవ్వేసినపుడు, బ్రిటిషువారి భవంతులు పేల్చడానికి బాంబులు వుపయోగించినపుడు పోలీసులు వాళ్లని వేటాడారు. కానీ ఎప్పుడూ దొరకలేదు. కాటక్‌ బ్రిటిషు సైనికులున్న సినిమా థియేటరులో బాంబు పెట్టినపుడు పదిమంది చచ్చిపోయారు, వందమంది గాయపడ్డారు. కానీ తమలో ఎవరైనా పట్టుబడ్డారా? లేదే! అలాటిది జనవరి 20 నాడు కాటక్‌ శిష్యుడు పహ్వా పట్టుబడిపోయాడు. అతను పనిచేసుకుని రాగలడని కాటక్‌, చేయలేడని నాథూ వాదించుకున్నారు. కాటక్‌ వినలేదు. ఇప్పుడేమైంది? తమ మొత్తం పథకమే దెబ్బతినేట్లుంది. మేనేజరుకి అనుమానం వస్తే బయట నుండి తలుపు గడియ పెట్టేసి పోలీసులను పిలవగలడు. అలా చూస్తే యిక్కణ్నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. 

ఆప్టే బియరుతో బాటు గులాబ్‌జామ్‌లు కూడా తెచ్చాడు. అవి చుట్టిన పేపరుపై నాథూ దృష్టి పడింది. అది ముందురోజు పేపరు. టెన్నిస్‌ ఛాంపియన్‌ మగన్‌లాల్‌ మెహతా, అతని భార్య రాణి ఢిల్లీ వచ్చిన సందర్భంలో తీసిన ఫోటో చూస్తూనే అతని ఆలోచనలు రాణిపైకి పోయాయి. 1946 సెప్టెంబరులో పూనాలో బాబూరావు అనే పారిశ్రామికవేత్త యింట్లో పెళ్లిలో ఆమెను మొదటిసారి చూశాడు. తను విడిగా ఎక్కడో నిలబడితే ఆమె వచ్చి పలకరించింది – తనెవరో తెలియకపోయినా. తను ఆమెను చూడగానే ముగ్ధుడయ్యాడు. తర్వాత ఆప్టే వచ్చి తను నాథూరామ్‌ గోడ్సే అని చెప్పగానే 'మీరు నా అభిమాన పత్రికా సంపాదకులు. మీ పత్రిక రెగ్యులర్‌గా చదువుతాను' అంటూ పొగిడింది.  ఆమె శ్రీమంతురాలు. విద్యాధికురాలు. దేశమంతా ప్రఖ్యాతి గాంచిన టెన్నిస్‌ ప్లేయర్‌ భార్య. ఇంగ్లండ్‌లో కొంతకాలం వుంది. కానీ ఆమె జీవితంలో వెలితి వుంది. తనను చూడగానే మోహితురాలైంది. పత్రికాఫీసుకి వచ్చి కలిసి, కబుర్లు చెపుతూ వుండేది. కొన్ని రోజులకు బాబూరావు యింట్లో సంగీత కచ్చేరీ జరిగినపుడు యిద్దరూ మళ్లీ కలిశారు. ఆమె చిలిపిగా ప్రవర్తించింది, కవ్వించింది. మర్నాడు యిద్దరూ కలిసి కార్లో బొంబాయి వెళ్లారు. 'నా భర్తలో ఎంచడానికి లోపం ఏమీ లేదు, కానీ నా మనసు గెలుచుకున్నది నువ్వే' అని చెప్పిందామె. ఒక లక్ష్యానికి, సంస్థ ఆశయానికీ కట్టుబడ్డాడు కాబట్టి తనామెకు ఏమీ చెప్పలేకపోయాడు. కావాలని కలవడం తగ్గించాడు. 

''నాకు భయం వేస్తోంది, నాథూ, నన్ను దీన్లోంచి తప్పించేయ్‌'' అని ఆప్టే అనడంతో అతని ఆలోచనలు భగ్నమయ్యాయి. పథకం ప్రకారం నాథూ, ఆప్టే యిద్దరూ సాయంత్రం 4 గంటలకు గుప్తా భవన్‌కి వెళ్లి అక్కడ తోటమాలి క్వార్టర్సులో వేచి వుండాలి. తోటమాలితో ముందే చెప్పి వుంచారు. అక్కడ గంటసేపు ఆగాక,  5 గంటలకు గాంధీ ప్రార్థనకై వేదిక వద్దకు వస్తూండగా దారిలోనే యిద్దరూ ఎదుటపడి తుపాకీతో – గుళ్లన్నీ అయిపోయేదాకా – కాల్చేయాలి. అప్పుడు గాంధీ మరణం తథ్యం. ఇదీ వాళ్ల గురూజీ ఢోంఢో కనేట్కర్‌ చెప్పిన ప్రణాళిక. ఆ పని మీదనే యిద్దరూ ఢిల్లీ వచ్చారు. ఇప్పుడు ఆప్టే వణకసాగాడు. ''నా వల్ల కాదు, మనం కాటక్‌ వద్దకు వెళ్లి చెపుదాం, నా బదులు అతను నీతో వస్తాడు'' అనసాగాడు. ''అతను ముసలాడై పోయాడు'' అన్నాడు నాథూ. ''..పోనీ శంకర్‌?'' ''..అతను మరీ కుర్రాడు'' ''పోనీ పర్చూరే..?'' 

''..నువ్వు నాతో వస్తున్నావ్‌ అంతే..'' దృఢంగా చెప్పాడు నాథూ. 

''నాథూ, నాథూ చూడు నా చెయ్యి ఎలా వణుకుతోందో చూడు. నన్ను వదిలిస్తే మీ తమ్ముడి బాగోగులు నేను చూసుకుంటా. నా కున్నదంతా అతనికి యిచ్చేస్తా..'' బతిమాలసాగాడు ఆప్టే. ''గురూపదేశం మర్చిపోకు, భయపడకు. నా కంటె ముందే ఏదో ఒక టాక్సీలో ఎక్కడికైనా వెళ్లు. నేను తర్వాత వెళతాను. ఇద్దరం కలిసి తిరిగితే పట్టుబడతాం. సరిగ్గా నాలుగు గంటలకు గుప్తా భవన్‌ వద్ద కలుస్తున్నాం. అంతే'' అని నాథూ గట్టిగా చెప్పాడు.

తర్వాత యిద్దరూ తమతమ తుపాకీలను డబ్బు దాచుకునే బెల్టుల్లో దాచారు. పైన వదులుగా వున్న చొక్కా వేసేసుకోవడంతో ఎవరికీ అక్కడేమున్నదీ తెలియదు. ఆప్టే వెళ్లిపోయిన కొద్ది సేపటికి నాథూ ఎవరికీ చెప్పకుండా గబగబా బయటకు వెళ్లిపోయాడు. రిటైరింగ్‌ రూము మేనేజర్‌ వెనక్కాల నుంచి కేకలు వేయడంతో అతనికి భయం వేసింది. తీరా చూస్తే అతను గది తాళంచెవి కోసం అరుస్తున్నాడు. అక్కడే బల్లమీద వుంది చూస్కో అనేసి వేగంగా అడుగులు వేసుకుంటూ స్టేషన్‌ బయటకు వచ్చాడు. కనబడిన టాక్సీ ఎక్కాడు. ఎక్కడికి అని డ్రైవరు అడిగితే ముందు పోనీ, చెప్తా అన్నాడు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2015)

[email protected]

Click Here For Archives