ఒకసారి పాము నోట్లో పడితే అంతే సంగతులు. మళ్లీ నిచ్చెన ఎక్కడానికి నానా ప్రయత్నాలు చేయాలి. దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి అలాగే వుంది. ఆగడు కొట్టిన దెబ్బ ఇంతా అంతా కాదు. దాంతో రామ్ చరణ్ తో సినిమా ఓకె చేయించుకోవడానికి కిందా మీదా పడ్డాడు. ఆఖరికి తాను బంధాలు తెంపేసుకున్న కోన వెంకట్ తో చేతులు కలపకతప్పలేదు.
ప్రకాష్ రాజ్ ను కృష్ణవంశీకి కలిపి పుణ్యం కట్టుకున్న రామ్ చరణ్ ఈసారి ఈ ఇద్దరినీ జత చేసాడు. అంతవరకు బాగానే వుంది. కోన వచ్చి, శ్రీను వైట్ల చెప్పిన స్టోరీ విని, సెకండాఫ్ బాగాలేదని పెదవి విరిచేసినట్లు బోగట్టా. దాంతో పంచాయతీ మెగాస్టార్ కోర్టులోకి వెళ్లిందట. ఆయన అంతా విని, అసలు మొత్తం కథ తీసి పక్కన పెట్టండి..కొత్తగా ఏదన్నా ఆలోచించండి అని తీర్పు చెప్పేసారు.
దాంతో ఏముంది..మళ్లీ సిటింగ్ లు, కథ అల్లడాలు..ఇప్పుడు కోన బాపట్ల వెళ్లారు..రాగానే కథ అల్లిక మొదలవుతుంది. అన్నట్లు ఇప్పుడు టాలీవుడ్ కోన హవా బాగానే నడుస్తోందని వినికిడి. నిత్యం అరడజనుకు పైగా డైరక్టర్లతో కోన ఆఫీసు కళకళ లాడుతోదని వినికిడి. ఇదంతా గీతాంజలి, లౌక్యం తెచ్చిన క్రేజ్ అనుకోవాలి.