భరత్ అనే నేను, మహర్షి సినిమాల్లో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ చూసి కాస్త నిరుత్సాహపడ్డారు ఆడియన్స్. అలాంటి వాళ్లంతా అనీల్ రావిపూడి తీసిన సరిలేరు నీకెవ్వరు చూసి కాస్త సంతోషించారు. ఇప్పుడా సంతోషాన్ని రెట్టింపు చేసేలా రిలీజైంది సర్కారువారి పాట ట్రయిలర్. కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ ట్రయిలర్ లో వింటేజ్ మహేష్ బాబును చూపించారు.
కామెడీ టైమింగ్, యాక్షన్ మోడ్, డైలాగ్ డెలివరీ, లుక్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ లో మహేష్ ను కొత్తగా ప్రజెంట్ చేస్తూ వచ్చింది సర్కారువారి పాట ట్రయిలర్. ట్రయిలర్ ఎలా ఉందనే విషయాన్ని పక్కనపెడితే.. మహేష్ లో ఉత్సాహం, ఆ జోష్ చూస్తే మాత్రం ఎవరికైనా ముచ్చటేస్తుంది.
“ఈమధ్య ఆడియన్స్ ఆడియన్స్ నా నుంచి ఓ షేడ్ మిస్సయ్యారు. రాబోయే సినిమాలతో అది అందిస్తాను” అంటూ సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్ లో మహేష్ చెప్పుకొచ్చాడు. ఈ ట్రయిలర్ చూస్తే అప్పుడు మహేష్ చెప్పిన మాట గుర్తొస్తుంది.
ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. “అమ్మాయిల్ని, అప్పిచ్చేవాళ్లను ప్యాంపర్ చేయాలి. నేను విన్నాను.. నేను ఉన్నాను. ఏటి సేసేస్తావ్. అప్పు అనేది ఆడపిల్ల లాంటిది.. ఇక్కడ ఎవ్వరూ బాధ్యతున్న ఆడపిల్ల తండ్రిగా బిహేవ్ చేయడం లేదు” లాంటి డైలాగ్స్ బాగా పేలాయి. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు మహేష్ తో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా చెప్పించారు.
ట్రయిలర్ చూస్తుంటే.. దూకుడు తర్వాత మరోసారి మహేష్-వెన్నెల కిషోర్ కాంబో మంచి కామెడీ పండించేలా కనిపిస్తోంది. పరశురామ్ రాసుకున్న డైలాగ్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మే 12న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తోంది సర్కారువారి పాట.