మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కాలం శరవేగంగా పరుగెడుతోంది. రెండేళ్ల సమయం కళ్లు మూసి తెరిచే లోపు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేసవి ఎండలా వేడెక్కుతోంది. ఈ దఫా ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఈ ఎన్నికలు చావుబతుకుల సమస్య. ఒకవేళ ఏ మాత్రం అటూఇటూ అయినా టీడీపీ భవిష్యత్ గోవిందా. మరోవైపు చంద్రబాబు వయసు పైబడుతుండడం కూడా ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది.
టీడీపీలో చంద్రబాబు తర్వాత ముఖ్యమైన నాయకుడు నారా లోకేశ్. తండ్రి చాటు తనయుడిగానే పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే లోకేశ్‌పై మొదట్లోనే మొద్దబ్బాయి అనే ముద్ర పడడం, దాన్ని చెరిపేసుకోవడం ఈజీగా లేదు. రానున్న ఎన్నికలను లోకేశ్ సవాల్‌గా తీసుకున్నారు. దీంతో ప్రజల్లో ఉండేందుకు ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మహానాడు తర్వాత తాను ప్రజల్లోకి రానున్నట్టు లోకేశ్ తెలిపారు.
అప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తానని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో చేసింది, అలాగే ప్రస్తుత వైసీపీ పాలనలో ఏం చేశారో నేరుగా ప్రజలకే చూపుతానన్నారు. సీమలో తాగు సాగు నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. అందుకే చంద్రబాబు పట్టిసీమను తీసుకొచ్చారన్నారు. రూ.13 వేల కోట్లతో జలధారను తాను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చానని …కాని దాన్ని ఆపేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా వుండగా ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహించబోతున్నారు. దాదాపు లక్షమందికి పైగా పార్టీ శ్రేణులు హాజరయ్యే విధంగా చంద్రబాబు ప్లాన్ చేశారు. లోకేశ్ మాట ప్రకారం జూన్ నుంచి ప్రజాక్షేత్రంలో లోకేశ్ ఉండనున్నారు.
కనీసం అప్పటి నుంచైనా ఆయన ప్రజల్లో మమేకమవుతూ తాను గెలిచి, పార్టీని గెలిపించేందుకు ఏ మేరకు శ్రమిస్తారో కాలమే జవాబు చెప్పాల్సి వుంది. రానున్న ఎన్నికలు టీడీపీ భవిష్యత్ మాత్రమే కాదు, తనది కూడా అని గ్రహిస్తే లోకేశ్‌కే మంచిది.