బాహుబలి లీక్ పై ఫిర్యాదు?

బాహుబలి సినిమా వార్ సీన్ కు సంబంధించి పన్నెండు నిమషాల నిడివి గల విడియో ఫుటేజ్ లీక్ అయింది. నిజానికి ఒక విధంగా సినిమాకు మంచే చేసింది. సినిమా మీద వున్న అంచనాలను పూర్తిగా…

బాహుబలి సినిమా వార్ సీన్ కు సంబంధించి పన్నెండు నిమషాల నిడివి గల విడియో ఫుటేజ్ లీక్ అయింది. నిజానికి ఒక విధంగా సినిమాకు మంచే చేసింది. సినిమా మీద వున్న అంచనాలను పూర్తిగా రెట్టింపు చేసింది. వార్ సీన్ లో వాడిన ఆయధాలు, తదితర వ్యవహారాలు చాలా ఆసక్తికరంగా వున్నాయి కూడా. 

అయితే ఈ లీక్ ఎలా జరిగిందని చాలా వార్తలు వినిపించాయి. ఆదిలో యూనిట్ లో కీలకమైన వారు కావాలనే లీక్ చేసి వుంటారని, ఎలాగూ అంత క్వాలిటీ లేదు, పైగా టాకీ జోడించలేదు, గ్రాఫిక్స్ చేయాల్సి వుంది, దీనివల్ల సినిమాకు హైప్ వస్తుంది కానీ, నష్టం ఏమీ వుండదని. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తలువేరుగా వున్నాయి. 

యూనిట్ ఈ లీకేజీపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిందని, వారు రంగంలోకి దిగి, చురుగ్గా వ్యవహరించి, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని వినవస్తోంది. ఎంతవరకు నిజమన్నది ఇంకా నిర్థారణ కావాల్సి వుంది. ఆ వ్యక్తి, సినిమాకు పనిచేస్తున ఓ ఏనిమేషన్ కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి అని కూడా అంటున్నారు. మరో రోజు ఆగితే కానీ అసలు వ్యవహారం బయటకు రాదేమో?