మూలాలు మరిచిపోని వారే మనుషులవుతారు. పుట్టగానే ధనవంతులు కాకపోయి వుండొచ్చు. తెలివితో ఐశ్వర్యాన్ని, పదవు లను పొందిన వాళ్లు ఎందరో. డబ్బు, ఇతర ఆస్తులు, పదవులు సమకూర్చుకుని, వివిధ రంగాల్లో ప్రముఖులుగా చెలామణి అవుతున్న వారి గురించి స్ఫూర్తిదాయక కథనాలు వింటుంటారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న వాళ్లనే సమాజం గుర్తుంచుకుం టుంది. వారికి విలువ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ కార్మిక దినాన్ని పురస్కరించుకుని తెలంగాణ కార్మికశాఖ మంత్రి తన గత జీవితాన్ని గుర్తు చేసుకోవడం విశేషం.
“40 ఏళ్ల క్రితం నేను పూలు, పాలు అమ్మాను. ఇప్పుడు నా కళాశాలలు దేశంలోనే టాప్-10లో ఉన్నాయి. నా కష్టార్జితంతోనే ఇన్ని కళాశాలలు, సంస్థలు స్థాపించాను. మనం ఎంత కష్టపడితే అంత గొప్పవాళ్లమవుతాం. సండే, మండే లేకుండా కష్టపడుతున్నా కాబట్టే ఈ స్థానంలో నేనున్నా” అని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.
రాజకీయంగా మల్లారెడ్డిపై ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా, విద్యా సంస్థల పరంగా ఆయన ఇంజనీరింగ్ కాలేజీకి మంచి పేరుంది. తన సంస్థల కోసం భూఆక్రమణలకు పాల్పడ్డారని ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్, మల్లారెడ్డి మధ్య మాటల తూటలు పేలాయి. ఇద్దరు సవాళ్లు విసురుకున్నారు.
రాజకీయంగా ఇవన్నీ సర్వసాధారణమే. మే డే నాడు మల్లారెడ్డి గత జీవితంలోకి జారుకోవడం చర్చనీయాంశమైంది.