సంక్రాంతికి మహేష్ ‘నేనొక్కడినే’ రిలీజ్ అవుతోంది కానీ, అతను ఒక్కడే అయితే రాడని ఇంతకుముందే రిపోర్ట్ చేశాం. అందుకు తగ్గట్టే పలువురు సంక్రాంతి రిలీజ్‌ని టార్గెట్ చేస్తున్నారు. సంక్రాంతికి మంచి రికార్డ్ ఉన్న పూరి జగన్నాథ్ తన తాజా చిత్రం ‘హార్ట్ ఎటాక్’ని కూడా కలిసి వచ్చిన కాలంలోనే విడుదల చేయాలని డిసైడయ్యాడు.
దేశముదురు, బిజినెస్‌మేన్‌తో సంక్రాంతికి హిట్స్ కొట్టిన పూరి జగన్నాథ్ దానిని రిపీట్ చేయాలని చూస్తున్నాడు. అయితే మహేష్‌బాబుకి సంక్రాంతికి ఇంకా మంచి రికార్డ్ ఉంది. ఒక్కడు, బిజినెస్‌మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్తో తన తండ్రిలానే ‘సంక్రాంతి హీరో’ అనిపించుకున్నాడు. ‘నేనొక్కడినే’తో సంక్రాంతికి హ్యాట్రిక్ పూర్తి చేస్తాడని అంచనాలున్నాయి.
అయితే మహేష్ సినిమా ఉన్నా కానీ సంక్రాంతి బరిలోంచి తప్పుకోవాలని చాలా మంది అనుకోవడం లేదు. తప్పకుండా రెండు, మూడు సినిమాలకి చోటు ఉంటుంది కాబట్టి ఆ సీజన్‌ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి డిసెంబర్ అంటున్నారు కానీ చరణ్ ఎవడు కూడా అప్పుడే రిలీజ్ కావచ్చునని కూడా వినిపిస్తోంది.