హీరోయిన్ అమలాపాల్ చిక్కుల్లో పడింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. పన్ను ఎగవేసే ఉద్దేశంతో ఓ ఖరీదైన లగ్జరీ కారును పాండిచ్చేరిలో రిజిస్టర్ చేయించింది అమలాపాల్. కేరళతో పోలిస్తే కేంద్రపాలిత ప్రాంతం పాండీలో పన్నులు తక్కువ. అందుకే అక్కడే ఉంటున్నట్టు నివాస ధృవపత్రం పుట్టించి కారును రిజిస్టర్ చేయించింది.
కానీ ఈ విషయం మీడియాలో పొక్కడంతో కేసు పెద్దదైంది. విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీచేసినప్పటికీ అమలా పాల్ స్పందించలేదు. దీంతో ఆమె పరారీలో ఉందంటూ సెర్చ్ వారెంట్ జారీచేశారు. ఈ నేపథ్యంలో తిరువనంతపురం క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు లొంగిపోయింది అమలాపాల్.
కేరళ ప్రభుత్వాన్ని మోసగించిందనే కేసుతో పాటు ఫోర్జరీ కేసు అమలాపాల్ పై ఫైల్ అయింది. ఈ కేసు నాన్-బెయిలబుల్ సెక్షన్ కిందకి వస్తుంది. ఒకవేళ తప్పు చేసినట్టు రుజువైతే ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం కూడా ఉంది.
పాండిచ్చేరిలో తను రిజిస్టర్ చేయించిన కారును, తిరిగి కేరళలో కూడా రిజిస్టర్ చేయిస్తానని పోలీసులకు హామీ ఇచ్చింది అమలాపాల్. కేరళలో కట్టాల్సిన 20శాతం పన్నును కూడా కట్టేస్తానని తెలిపింది. అయితే పాండిచ్చేరిలో తప్పుడు నివాస ధృవపత్రాలు, ఇతర డాక్యుమెంట్లు సృష్టించిన కేసు మాత్రం ఆమెను వెంటాడే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఆమె కోర్టు మెట్లు ఎక్కక తప్పదు.