రివ్యూ: గ్యాంగ్
రేటింగ్: 2.75/5
బ్యానర్: స్టూడియో గ్రీన్
తారాగణం: సూర్య, కీర్తి సురేష్, రమ్యకృష్ణ, కార్తీక్, సెంథిల్, ఆర్జె బాలాజీ, సత్యన్, ఆనంద్ రాజ్, నిరోషా తదితరులు
కూర్పు: ఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: దినేష్ కృష్ణన్
సమర్పణ: యు.వి. క్రియేషన్స్
నిర్మాత: కె.ఈ. జ్ఞానవేల్‌రాజా
కథనం, దర్శకత్వం: విఘ్నేష్ శివన్
విడుదల తేదీ: జనవరి 12, 2018
అయిదేళ్ల క్రితం వచ్చిన హిందీ చిత్రం 'స్పెషల్ చబ్బీస్'కి అఫీషియల్ తమిళ రీమేక్ ఇది. దర్శకుడు నీరజ్ పాండే, అక్షయ్‌కుమార్ బృందం కలిసి దానిని నిజంగా ఒక స్పెషల్ చిత్రంగా తీర్చిదిద్దారు. 1987 ఒపెరా హౌస్ దోపిడీ ఆధారంగా నీరజ్ పాండే తీసిన 'స్పెషల్ 26' ఆకర్షణీయమైన పాత్రలతో, ఉత్కంఠభరిత కథనంతో విశేషంగా ఆకట్టుకుంది. తమిళ దర్శకుడు ఆ చిత్రం ఇతివృత్తాన్ని, కొన్ని సంఘటనలని మాత్రం తీసుకుని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథనంలో చాలా మార్పు చేర్పులు చేసాడు.
'స్పెషల్ 26' ఫాన్స్‌ని ఈ కామెడీ 'గ్యాంగ్' అంతగా మెప్పించకపోవచ్చు కానీ ఒరిజినల్ చూడని వారికి మాత్రం ఈ చిత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఓ మోసగాళ్ల బృందం చేసే ఘరానా మోసాలు, వారి ప్లాన్స్, వాటిని అమలు చేసే పద్ధతి 'గ్యాంగ్'ని మిగిలిన మసాలా సినిమాల నుంచి సెపరేట్ చేసి స్పెషల్‌గా నిలబెడతాయి.
కొంతమంది వ్యక్తులు కలిసి సిబిఐ ఆఫీసర్స్, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్‌గా నమ్మించి బడా వ్యాపారస్థులకి బురిడీ కొట్టించే వైనం ఎక్సయిటింగ్ పాయింటే. రియల్ ఇన్సిడెంట్‌కి నాటకీయత జోడించి నీరజ్ పాండే ఒక పకడ్బందీ క్రైమ్ థ్రిల్లర్‌ని తీర్చిదిద్దాడు. సీరియస్‌గా సాగే ఒరిజినల్‌కి భిన్నంగా 'గ్యాంగ్' చిత్రాన్ని కాస్త హ్యూమరస్‌గా, కమర్షియల్ కోణంలో డీల్ చేసాడు దర్శకుడు విఘ్నేష్ శివన్.
ఈ మార్పుల వల్ల అక్కడక్కడా హాస్యం పండినా కానీ ప్లాట్ డైల్యూట్ అయిపోయింది. మోసగాళ్లకి ఖచ్చితంగా ఒక నేపథ్యం వుండాలని, వాళ్లు అలా మారడానికి ఏదో బలమైన కారణం వుండాలన్నట్టు చూపించడం మరీ రొటీన్ అనిపిస్తుంది. 'మోసం' చేసే కథానాయకుడిని 'హీరో'గానే చూపించాలనేది పాతకాలం థియరీ. నేటి తరం ప్రేక్షకులు హీరోలోని ఆ నెగెటివ్ కోణాన్ని యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ వున్నవాళ్లే.
ఇంకా 'జెంటిల్‌మేన్' కాలం నాటి సోషల్ కాజ్, పర్సనల్ లాస్ తదితర కారణాల వల్ల హీరోలు మోసాలని మార్గంగా ఎంచుకున్నారని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వనవసరం లేదు. పైగా ఈ యాంగిల్ వల్ల ఒరిజినల్లోని థ్రిల్లింగ్ చివరి ఘట్టాన్ని కుదించి కమర్షియల్ క్లయిమాక్స్‌కి చోటివ్వాల్సి వచ్చింది. దీని వల్ల ఈ చిత్రానికి మాస్ అప్పీల్ పెరుగుతుందేమో కానీ ఉత్కంఠకి గురి చేసే థ్రిల్ ఫ్యాక్టర్ మిస్ అయిపోయింది.
'స్పెషల్ చబ్బీస్'లోని మంచి పాయింట్స్‌ని యథాతథంగా ఫాలో అవడానికి ఇష్టపడని గ్యాంగ్ దర్శకుడు అందులోని బలహీనతలని మాత్రం తన కొత్త స్క్రీన్‌ప్లేతో కవర్ చేయలేకపోయాడు. మెయిన్ ప్లాట్‌లోకి హీరోయిన్ ట్రాక్ ఒరిజినల్లోను సరిగా ఇమడలేదు. ఇక్కడ కీర్తి సురేష్‌ని కూడా కాన్ వుమన్‌గా (మోసగత్తె) చూపించినప్పటికీ ఆమె పాత్రని అసలు కథలోకి విఘ్నేష్ పూర్తిగా ఇన్వాల్వ్ చేయలేకపోయాడు.
కీలక సమయాల్లో హీరోయిన్ కంప్లీట్‌గా కనిపించకుండా పోతుంది. అయితే ఈ గ్యాంగ్ చిత్రానికి ఆకర్షణ పెంచే కాస్టింగ్ సమీకరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అనుపమ్ ఖేర్ పాత్రని ఫిమేల్ క్యారెక్టర్‌గా మార్చి, దానికి రమ్యకృష్ణని ఎంచుకోవడం పెద్ద ప్లస్. అలాగే ఈ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్‌గా కార్తీక్ వుండడం తారాబలాన్ని మరింత పెంచింది.
ఎన్నో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసిన సూర్యకి ఇందులోని పాత్ర కేక్ వాక్. ఎలాంటి ప్రయోగాల జోలికి పోని నీట్ అండ్ హాండ్సమ్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. అతని నటనకి వంక పెట్టడానికంటూ ఏమీ లేదు. ముందే చెప్పినట్టు ఈ చిత్రానికి రమ్యకృష్ణ పెద్ద బలమయ్యారు. నటిగా తనలోని విలక్షణతని ఇందులోని ఝాన్సీరాణి పాత్ర చాటుతుంది. కార్తీక్ స్క్రీన్ ప్రెజెన్స్, పర్ఫార్మెన్స్ బాగున్నాయి. కీర్తి సురేష్‌ది లిమిటెడ్ రోల్. ఉన్నంతలో బాగానే చేసింది. సెంథిల్, శివశంకర్ తప్పిస్తే మిగిలిన తారాగణంలో దాదాపుగా అందరూ మనకి పెద్దగా పరిచయం లేని తమిళవారే.
ఎయిటీస్ కాలంలో జరిగే కథ కనుక అప్పటి కాలమానాన్ని ప్రతిబింబించే డీటెయిలింగ్పై దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. అయితే సినిమాటోగ్రఫీ మరీ కలర్ఫుల్గా వుండడం ఆ పీరియడ్ ఫీల్‌ని తగ్గించింది. ప్రొడక్షన్ డిజైన్ పరంగా ముప్పయ్యేళ్ల నాటి కాలాన్ని ప్రతిబింబించే విషయంలో ఇన్‌కన్సిస్టెన్సీ వుంది. అనిరుధ్ సంగీతం అలరిస్తుంది. 'చిటికె మీద చిటికె వేయరా' పాట బాణీతో పాటు చిత్రీకరణ కూడా అమితంగా ఆకట్టుకుంటుంది. తమిళ చిత్రాల్లో ఎక్కువ శాతం సాంకేతికంగా ఉన్నతంగా వుంటాయనేది తెలిసిందే. దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి కొన్ని మెరుపులు జోడించాడు, అలాగే కథకి అవసరం లేని కొన్ని హంగులు తీసుకొచ్చి ఫైనల్ ఇంపాక్ట్ తగ్గించాడు.
స్పెషల్ 26 కంటెంట్‌కి కట్టుబడి తీసిన సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయి కానీ ఎక్కడయితే వాణిజ్య విలువల కోసం తపించారో అక్కడే ఈ గ్యాంగ్ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. కొన్ని అనువాద చిత్రాలకి నేటివిటీ సమస్య తలెత్తదు కానీ ఈ చిత్రంలో తమిళ నేటివిటీ బాగా వుండడం తెలుగు వెర్షన్‌కి చిన్నపాటి ప్రతిబంధకమవుతుంది. అయితే ఇప్పటివరకు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో గ్యాంగ్ ఖచ్చితంగా చాలా బెటర్ మూవీ.
ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇవ్వడమే కాకుండా, వినోదాన్ని కూడా తగు పాళ్లలో అందించే ఈ చిత్రం మాస్ ప్రేక్షకుల కంటే అర్బన్ ఆడియన్స్‌కి ఎక్కువ కనక్ట్ అవుతుంది. ఒరిజినల్ చూడని వారు దీనికి కాస్త ఎక్కువ మార్కులే ఇచ్చే అవకాశముంది. కాకపోతే ఈ కథని కమర్షియల్ యాంగిల్లో కంటే రియలిస్టిక్‌గా, థ్రిల్లింగ్‌గా డీల్ చేస్తే మాత్రం ఈ గ్యాంగ్ ఇంకొంచెం ఎక్కువ స్కోర్ చేసి వుండేది. పండగ టైమ్‌లో, పక్కన వున్న నీరసమైన సినిమాలతో సక్సెస్ గీత దాటేయడానికి ఈ స్టఫ్ సరిపోవాలి మరి.
బాటమ్ లైన్: సరదా 'గ్యాంగ్'!
– గణేష్ రావూరి