ఆర్థిక కష్టాల్లో ‘క్వీన్’

హిందీలో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమాను సౌత్ లో ఒకేసారి 4భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది క్వీన్ రీమేక్. మను కుమారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు…

హిందీలో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమాను సౌత్ లో ఒకేసారి 4భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది క్వీన్ రీమేక్. మను కుమారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు బడ్జెట్ తడిసిమోపెడైందట.

తెలుగు, మలయాళ భాషల్లో క్వీన్ రీమేక్ కు నీలకంఠ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తమిళ, కన్నడ భాషల్లో ఇదే రీమేక్ ను రమేష్ అరవింద్ తెరకెక్కిస్తున్నాడు. దర్శకులు కామన్ గా ఉన్నప్పటికీ.. లొకేషన్ ఒకటే అయినప్పటికీ.. నాలుగు భాషల్లో సినిమాకు నాలుగు యూనిట్లు కావాల్సిందే. పైగా 4భాషల్లో నలుగురు హీరోయిన్లు. దీనికి తోడు ఎక్కువ భాగం షూటింగ్ ఫ్రాన్స్ దేశంలో. 

ఇంకేముంది.. పేపర్ పై రాసుకున్న బడ్జెట్ ఒకటైతే.. లొకేషన్ లో లెక్కతేలిన బడ్జెట్ దానికి రెండింతలైందట. దీంతో నిర్మాత సందిగ్దంలో పడినట్టు తెలుస్తోంది. 4భాషల్లో సినిమాను ఒకేసారి స్టార్ట్ చేయడం ఒక తప్పయితే.. కనీసం 2భాషలకు ఒక హీరోయిన్ ను కామన్ గా పెట్టుకోకపోవడం మరో తప్పు. అందుకే ఖర్చును తగ్గించుకునేందుకు ఏదో ఒక రీమేక్ ను ఆపేయాలని భావిస్తున్నాడట నిర్మాత. 

తెలుగు క్వీన్ రీమేక్ లో తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ వెర్షన్ లో కాజల్, కన్నడ రీమేక్ లో పరుల్ యాదవ్, మలయాళం వెర్షన్ లో మంజిమా మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నాలుగు ప్రాజెక్టుల్లో ఏదో ఒకటి, ఏ క్షణానైనా ఆగిపోవచ్చనే రూమర్లు వినిపిస్తున్నాయి.