మరో 2రోజుల్లో రజనీకాంత్ పుట్టినరోజు వస్తోంది. సాధారణంగా సూపర్ స్టార్ బర్త్ డే అంటే ఎవరైనా అతడి కొత్త సినిమా హంగామా కోసం ఎదురుచూస్తారు. కానీ ఈసారి సినిమాలే కాదు, పొలిటికల్ గా కూడా అంతా రజనీకాంత్ వైపు చూస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే అటు సినిమాలు, ఇటు రాజకీయాల పరంగా ఎలాంటి సందడి కనిపించడం లేదు.
భారతీయ సినీచరిత్రలోనే భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోంది రజనీకాంత్ 2.0. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ చేశారు. టీజర్ ను జనవరిలో విడుదల చేస్తామంటున్నారు. మరి రజనీకాంత్ బర్త్ డేకు ఏంటి స్పెషల్?
దుబాయ్ లో జరిగిన ఆడియో ఫంక్షన్ లో ఓ పాటను రిలీజ్ చేయలేదు. వీలైతే అది విడుదల చేసే ఛాన్స్ ఉంది. లేకపోతే ఎప్పట్లానే కొన్ని స్టిల్స్ విడుదల చేసి చేతులు దులుపుకుంటారు. మరోవైపు రజనీకాంత్ నటిస్తున్న కాలా సినిమాపై కూడా అందరి దృష్టి ఉంది.
కాలా ఫస్ట్ లుక్ ఇప్పటికే అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. వీలైతే పుట్టినరోజు సందర్భంగా కాలా విడుదల తేదీని ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ రెండు సినిమాల హంగామా తప్ప, పుట్టినరోజు నాడు రజనీకాంత్ నుంచి పొలిటికల్ గా ఎలాంటి ప్రకటన వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.