ఉపాసన – మెగా బ్రాండ్‌ అంబాసిడర్‌

ఉపాసన కామినేని కాస్తా, ఉపాసన కొణిదెల అయ్యింది. సినీ నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన, అపోలో ఆసుపత్రికి సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న విషయం విదితమే. ఆ ఆసుపత్రి బాధ్యతలే కాదు, మెగాస్టార్‌ చిరంజీవి,…

ఉపాసన కామినేని కాస్తా, ఉపాసన కొణిదెల అయ్యింది. సినీ నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన, అపోలో ఆసుపత్రికి సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న విషయం విదితమే. ఆ ఆసుపత్రి బాధ్యతలే కాదు, మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తరఫున 'బ్రాండ్‌ అంబాసిడర్‌'గా కూడా ఉపాసన వ్యవహరిస్తున్నట్టున్నారు. 

సుకుమార్‌ దర్శకత్వంలో చరణ్‌ నటిస్తున్న 'రంగస్థలం' సినిమాకి సంబంధించిన విశేషాల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో ఉపాసన పంచుకుంటోన్న విషయం విదితమే. సినిమా విశేషాలు మాత్రమే కాదు, కుటుంబ విశేషాల్నీ అభిమానులతో పంచుకుంటూ మెగా అభిమానులకి ఉపాసన దగ్గరయ్యింది. 

చరణ్‌కి ఇష్టమైన పెంపుడు జంతువులు, చరణ్‌కి ఇష్టమైన ఆహారం.. ఇలా ఒకటేమిటి, చరణ్‌కి సంబంధించి బోల్డన్ని విశేషాల్ని ఉపాసన సోషల్‌ మీడియాలో అభిమానులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తోంది. 'మిస్టర్‌ సి' అంటూ చరణ్‌ని సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేసే బాధ్యతని భుజానికెత్తుకున్నట్టుంది ఉపాసన. మరోపక్క, 'మామయ్య' మెగాస్టార్‌ చిరంజీవి కొత్త సినిమా 'సైరా నరసింహారెడ్డి' ప్రమోషన్‌పై ఉపాసన స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిందిప్పుడు. 

చరణ్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌ వున్నా, అదంత యాక్టివ్‌గా కన్పించదు. మెగాస్టార్‌ తరఫున అలాంటిదేమీ లేదు కూడా.! మెగా కాంపౌండ్‌ విషయానికొస్తే, పవన్‌కళ్యాణ్‌ సహా దాదాపు అందరూ (నాగబాబు మినహా) సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గానే వున్నారు. అందుకేనేమో ఇటు భర్త చరణ్‌తోపాటు, అటు మామయ్య చిరంజీవి ప్రమోషన్‌ బాధ్యతల్ని పూర్తిగా ఉపాసన తీసుకున్నట్లే కన్పిస్తోంది.