మనం గతాన్ని మార్చలేం. కాలప్రవాహాన్ని ఆపలేం. వెళ్లిపోయిన క్షణాన్ని వెనక్కి తీసుకురాలేం. ''ఒకే నదిలో రెండుసార్లు కాలిడలేవు'' అంటాడు గ్రీకు తత్త్వవేత్త జీనో. అదేమిటి, గట్టెక్కి మళ్లీ దిగవచ్చు కదా అనుకోవద్దు. నువ్వు గట్టెక్కి మళ్లీ దిగేలోగా పాత నీరు వెళ్లిపోయింది. పాత క్షణం వెళ్లిపోయింది. ఇది కొత్తనీరు. పొర్లిపోయిన పాల గురించి పొర్లిపొర్లి ఏడ్చినా ఒక్క చుక్క మళ్లా రాదు. పరీక్ష సరిగ్గా రాయకపోతే, ఇంటర్వ్యూ సరిగ్గా చేయకపోతే, రైలు సమయానికి ఎక్కకపోతే.. జారిపోయిన అవకాశం మళ్లీ రానే రాదు. అయినా వాటి గురించి తలచుకుని బాధపడతాం. బాధపడకూడదా, గతం గురించి జ్ఞాపకం ఏమీ లేకుండా తుడిచివేసుకోవాలా?
సింపుల్‌గా చెప్పాలంటే – గతంలో జరిగిన సంఘటన చెప్పిన పాఠాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ సంఘటన గురించి మథన పడడం మానేయాలి. భార్య పుట్టినరోజుని గుర్తు పెట్టుకుని, పుట్టిన సంవత్సరాన్ని మర్చిపోతే జీవితం ఎంత సుఖంగా గడుస్తుందో యీ ఫార్ములా అమలు చేస్తే అంత ఆనందం కలుగుతుంది. వేదిక మీద మాట్లాడే అవకాశం వచ్చింది మీకు. ఫంబుల్ అయ్యారు, సరిగ్గా మాట్లాడలేకపోయారు. జనం అదోలా చూశారు. ఉపన్యాసం ముగిశాక ఎవరూ చప్పట్లు కొట్టలేదు. ఎందుకిలా జరిగింది అని సమీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
పాయింట్లు కాగితం మీద రాసుకుని జేబులో పెట్టుకోవాల్సింది, ఇంట్లో రిహార్సల్ వేసుకుని వెళ్లాల్సింది, వేదిక మీద ఉన్నవారి పేర్లు చెప్పడానికి యిన్విటేషన్ కార్డు చేతిలో పెట్టుకోవాల్సింది, అంత సుదీర్ఘంగా మాట్లాడకుండా ఉండాల్సింది.. యిలాటి పాయింట్లు తట్టినపుడు అన్నీ రాసుకుని చూసుకుని, మళ్లీ సారి అవకాశం వచ్చినపుడు యీ చెక్లిస్టుతో సరిచూసుకోవాలి. అంతటితో ఆగకుండా 'అసలు ఆ సభకు వక్తగా ఎందుకు సమ్మతించాలి? సమ్మితించితి బో.. నేనేల అవేళ వెళ్లవలె? వెళ్లితి బో.. వేదిక నెందుకు ఎక్కవలె..' వంటి '..బో,..బో' డైలాగులు ఎన్ని చెప్పుకున్నా ఆ సభలో పోయిన గౌరవం తిరిగి రాదు. దాన్ని మెదడులోంచి తుడిచివేయడం శ్రేయస్కరం.
షేర్‌మార్కెట్ బహు చమత్కారి. అప్పటిదాకా ధర పెరుగుతున్న షేరు మీరు కొన్న మర్నాటి నుంచి తగ్గనారంభిస్తుంది. మీరు విసుగెత్తి అమ్మేసిన షేరు అమ్మిన మరుక్షణం నుంచీ పెరగనారంభిస్తుంది. ఛ, అమ్మకుండా ఉండాల్సింది, కొనకుండా ఉండాల్సింది అంటూ కూర్చుంటే వ్యగ్రతే తప్ప మరేమీ మిగలదు. ఈ క్రీడలో యిదొక భాగం. అదృష్టానికి తప్ప నైపుణ్యానికి పెద్దగా తావు లేదు, మనకింతే ప్రాప్తం – అనుకుని సర్దుకోవాలి తప్ప తలపట్టుకుని కూర్చోకూడదు. బండి నడుపుతున్నారు, యాక్సిడెంటు అయింది.
ఇప్పణ్నుంచి బ్రేక్ బాగు చేయించుకోకుండా బండి ఎక్కకూడదు అని తీర్మానించుకోవాలి తప్ప జరిగిన యాక్సిడెంటు గురించి 'అలా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది?' అని వర్రీ అవుతూ కూర్చుంటే మళ్లీ బండి నడిపేందుకు చేతులు రావు. 'పదేళ్లగా నడుపుతున్నాను. వేలాదిసార్లు యిదే రోడ్డు మీద సురక్షితంగా వెళ్లాను. ఖర్మ కాలి ఆ రోజు ప్రమాదం జరిగింది. రోజూ అలాగే జరుగుతుందని భయపడడం అనవసరం. 'లా ఆఫ్ ఏవరేజ్' ప్రకారం చూస్తే యింకో పదేళ్లదాకా యాక్సిడెంటు కాకూడదు. బండి సరిగ్గా పెట్టుకుంటే అదీ కాకపోవచ్చు.' అనుకుని ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలి. చెక్కను చిత్రిక పట్టగలవు, కానీ చిత్రీని చిత్రిక పట్టాలని ప్రయత్నిస్తే లాభం ఉండదు. టైము వేస్టు. చెక్క రూపం మారిపోయింది. కాలం కరిగిపోయింది.
బంధుమిత్రులతో, భాగస్వాములతో, ఆఫీసులో సహోద్యోగులతో గొడవలు వస్తాయి. గతంలో వాడికి యింత చేశాను, అంత చేశాను అనుకుంటూ కూర్చోవడం వేస్టు. ముందుకు సాగాలంతే. ఇటీవలే ఓ ఉదంతం విన్నాను. ఓ వ్యాపారస్తుడి వద్ద ఉన్న మంచి పనివాణ్ని మరో వ్యాపారస్తుడు ఎక్కువ జీతం మీద గుంజుకున్నాడు. ఈ వ్యాపారస్తుడు పనివాణ్ని పిలిచి 'నీ కింత చేశాను, అంత చేశాను, నా వద్ద పనిమానేసి ఎలా వెళతావు?' అని పోట్లాడాడు.
పనివాడు 'మీరూరికే చేశారా? నేనెంత అంకితభావంతో రాత్రనక, పగలనక చేశాను? ఈ రోజు మీకంటె ఆయన ఎక్కువ యిస్తానన్నాడు, వెళ్లిపోయాను' అని జవాబిచ్చాడు. ఆ ధిక్కారాన్ని తట్టుకోలేక యీ వ్యాపారస్తుడు బిగ్గరగా అరిచరిచి, గుండెపోటు తెచ్చుకుని కుప్పకూలాడు, మర్నాడు పోయాడు. పనివాడి కోసం ప్రాణం పోయిందన్నమాట. వీడు పోతే మరొకడికి తర్ఫీదు యిచ్చుకుంటా ననుకోలేదు. గతంలో నేను ఎంతో చేశాను, కృతఘ్నుడు, వెళ్లిపోయాడు అనే చింత ఆయనను దహించివేసింది.
గతాన్ని కొందరు సులభంగా విడవలేరు. ఒక సన్యాసి తన శిష్యుడితో సహా ఏరు దాటబోతున్నాడు. ఒకమ్మాయి వచ్చి నాకు నీళ్లంటే భయం అని వేడుకుంది. సన్యాసి ఆ అమ్మాయిని భుజాలపై ఎక్కించుకుని, నది అవతలి గట్టుపై దిగవిడిచాడు. సన్యాసి ఆడవారిని ముట్టుకోవడమేమిటి? అని శిష్యుడి మథన. గంట సేపు తర్జనభర్జన పడి గురువుగార్నే అడిగేశాడు. ఆయన చిరునవ్వు నవ్వి 'నేను ఆ అమ్మాయిని దింపేసి గంటయింది. నువ్వింకా దింపుకోలేదు.' అన్నాడు. గతాన్ని పట్టుకుని వేళ్లాడుతూంటే యిలాగే ఉంటుంది. గతంలో నేను హీరోని కదాని బిగుసుకుని కూర్చుంటే దెబ్బ తింటారు. బిగుసుకోకుండా కారెక్టరు వేషాలు అంగీకరించినవారు విజ్ఞులు. గతాన్ని పక్కకు పెట్టి విలన్ వేయడానికి ఒప్పుకున్నారు కాబట్టే జగపతిబాబుకు వేషాలే కాదు, అవార్డులూ వస్తున్నాయి.
''మేరా నామ్ జోకర్'' (1970) ఫ్లాపయే నాటికి రాజ్ కపూర్‌కు 46 ఏళ్లే! అతని సహచరులు దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ హీరో వేషాలు వేస్తూనే ఉన్నారు. మనం మాత్రం హీరోగా యిక చెల్లం అనుకున్నాడు, కారెక్టరు వేషాలు వేసుకుంటూ, డైరక్షన్ చేసుకుంటూ పోయాడు. ''గుమ్రాహ్'' సినిమాలో హీరోగా వేసేనాటికి సుభాష్ ఘాయ్‌కి 31 ఏళ్లు. సినిమా ఆడలేదు. ఇక యాక్టింగ్ సరదా పక్కన పెట్టి, డైరక్టరై పోయాడు. 16 సినిమాలు తీసాడు. విశ్వనాథ్ గారు డైరక్టరుగా కెరియర్ ముగుస్తూనే కారెక్టరు యాక్టరు అయిపోయారు. 'నా తరహా సినిమాలు ఎందుకు ఆడటం లేదు?' అని వర్రీ అవుతూ ఉండిపోలేదు.
విలియం హారిసన్ డెంప్సే అని ప్రఖ్యాత అమెరికన్ హెవీవెయిట్ బాక్సర్ ఉండేవాడు. 1919-1926 మధ్య ఛాంపియన్‌గా వెలిగాడు. 1926 సెప్టెంబరులో జీన్ టన్నీ అనే జూనియర్‌తో మ్యాచ్‌లో ఓడిపోయాడు. దానికి రికార్డు స్థాయిలో 1.20 లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. 10 రౌండ్లు అయ్యాక కూడా అతను తన కాళ్లమీదే నిలబడి ఉన్నాడు కానీ మొహమంతా ఉబ్బిపోయింది, కళ్లు మూతలు పడుతున్నాయి. సడన్‌గా తోచింది – 'నాకు వయసు మీరిపోయింది. నేనిక ఛాంపియన్ని కాదు' అని. వేదిక దిగి తన డ్రెస్సింగ్ రూము కేసి వెళుతూ ఉంటే తన అభిమానుల కళ్లల్లో నీళ్లు చూశాడు. డ్రెస్సింగ్ రూములో అతని భార్య ఉంది. ''హనీ, ఐ ఫర్గాట్ టు డక్'' (తల ఒంచి దెబ్బ తప్పించుకోవడం మర్చిపోయా) అన్నాడు.
అది ఫేమస్ కొటేషన్ అయిపోయింది. ఓటమి తర్వాత రిటైరవుదామా అనుకున్నాడు. కానీ యింకోసారి గట్టిగా ప్రయత్నిద్దామనుకుని సరిగ్గా ఏడాది తర్వాత టన్నీతో యింకో మ్యాచ్‌కి సిద్ధపడ్డాడు. ఈ మధ్యలో కుటుంబంలో విషాదం. అతని సోదరుడు తన భార్యను చంపి, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా 1927 జులైలో జాక్ షార్కీ అనే అతను ఓడించాడు. సెప్టెంబరులో జరిగిన డెంప్సే-టన్నీ మ్యాచ్‌కు టిక్కెట్ల రూపేణా 2 మిలియన్ డాలర్లు జమ అయింది. మాఫియా లీడరు అల్ కపోనె మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నిన్ను గెలిపిస్తా అని డెంప్సేకు ఆఫర్ యిచ్చాడట కానీ యితను నిరాకరించాడట. ఆట సందర్భంగా చాలా సాంకేతిక విషయాలు చర్చకు వచ్చాయి. ఏమైతేనేం, డెంప్సే ఓటమిని అంగీకరించి, పోటీల్లోంచి విరమించుకున్నాడు. మళ్లీ పోటీల్లో పాల్గొనే ప్రయత్నం చేయలేదు.
'నేను గతం గురించి పట్టించుకోను' అని పదేపదే అంటున్నావంటే నువ్వు నిజంగా పట్టించుకున్నావనే అర్థమంటాడు అతను. అలా ఆడివుండాల్సింది, యిలా పంచ్ యివ్వాల్సింది అనే పునరాలోచనే చేయలేదతను. తన ఖ్యాతిని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాడు. తన పేర మీద బ్రాడ్వేలో రెస్టారెంటు తెరిచాడు. కాలిఫోర్నియాలో మరో హోటల్లో వాటా తీసుకున్నాడు. ప్రైజ్ ఫైట్స్. బాక్సింగ్ ఎగ్జిబిషన్లు పెట్టి, కొన్ని ఉత్పత్తులకు మార్కెట్ ఎంబాసిడర్‌గా ఉంటూ, సినిమాల్లో నటిస్తూ డబ్బు గడించాడు. వచ్చినదానిలో కొంత దానం యిస్తూ దాతగా కూడా పేరుబడ్డాడు. 88 ఏళ్లు బతికి 1983లో పోయాడు. అంటే ఛాంపియన్‌గా 31 వ యేట రిటైరై తక్కిన 57 ఏళ్లు గతం గురించి చింతిస్తూ కూర్చోకుండా వేరేరకంగా ముందుకు సాగాడు. మనం కూడా గతం గతః అనుకుని, వర్తమానంలో బతకాలి. జరిగిపోయినదాన్ని రాపాడించకూడదు.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]