దాదాపు నూటా నలభైకోట్ల రూపాయల బడ్జెట్ తో ‘పద్మావతి’ సినిమాను రూపొందించాడు సంజయ్ లీలాభన్సాలీ. భన్సాలీ అంటే భారీతనం. ఇది దశాబ్దాలుగా నడుస్తున్న పరంపర. ‘సావరియా’ అంటే సాదాసీదా కథనాన్ని కళాఖండంగా చెక్కి.. కోట్ల రూపాయలు వెచ్చించి, తన భారీతనం ఎఫెక్ట్స్ తోనే ఆ డబ్బును వెనక్కు రాబట్టుకున్న ధీశాలీ ఇతడు.
ఒకవైపు దర్శకుడిగా, మరోవైపు నిర్మాతగా కొనసాగుతూ తన ఉనికిని చాటుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో పద్మావతితో 140కోట్లు తిరిగి రాబట్టుకోవడం పెద్దకథ ఏమీకాదు. అయితే ఈ సినిమాను ఇప్పటికే ఐదారు రాష్ట్రాలు నిషేధింశాయి. ఇంకా సెన్సార్ కాకుండానే ఎలా నిషేధిస్తారో తెలీదు. అయితే ఈ సినిమాను అడ్డం పెట్టుకుని.. హిందూమతాన్ని ఉద్దరిస్తున్నాం అని ప్రచారం పొందడానికి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తెగ తాపత్రాయపడుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో అంతిమంగా పద్మావతి కథ ఎక్కడకు తెములుతుందో ఎవరికీ తెలీదు. మరి ఈ భారీ సినిమా దేశంలో, విదేశాల్లో ఎక్కడా ఒక్క షో పడకుండా నిషేధానికి గురి అయినా.. భన్సాలీ మొత్తానికే నష్టపోయేది ఏమీ ఉండదని తెలుస్తోంది. ఈ సినిమాకు భారీఎత్తున ఇన్సూర్ చేయించారని సమాచారం.
ఎంత అంటే.. ఈ సినిమా ఏ కారణం చేత అయినా రిలీజ్ కాకపోయినా, సెట్స్ మొత్తం తగలబడిపోయి.. ఈ సినిమా పూర్తి చేయడం సాధ్యం కాకపోయినా.. ఇలా ఎలాగైనా.. ఈ సినిమా ద్వారా తమకు రూపాయి కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఏర్పడకపోతే… ఇన్సూరెన్స్ ను క్లైమ్ చేసుకోవచ్చని తెలుస్తోంది. 140కోట్ల బడ్జెట్ సినిమాకు సుమారు 80కోట్ల రూపాయల వరకూ ఇన్సూర్ చేయించారట. పద్మావతి ఏ కారణం చేత విడుదల ఆగినా ఆ మొత్తం అయితే భన్సాలీకి తిరిగి వస్తుందట. అయినప్పటికీ అరవైకోట్లు లాసేనేమో!