రివ్యూ: బాలకృష్ణుడు
రేటింగ్: 1.5/5
బ్యానర్: శరశ్చంద్రిక మోషన్ పిక్చర్స్, మాయాబజార్ మూవీస్
తారాగణం: రోహిత్ నారా, రెజీనా, రమ్యకృష్ణ, అజయ్, పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, కోట శ్రీనివాసరావు, వెన్నెల కిషోర్ తదితరులు
కథ, మాటలు: కొలుసు రాజా
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: విజయ్ సి. కుమార్
నిర్మాతలు: బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీ, వినోద్ నందమూరి
కథనం, దర్శకత్వం: పవన్ మల్లెల
విడుదల తేదీ: నవంబర్ 24, 2017
'మంచి ఫ్యాక్షన్ సినిమా చూసి చాలా కాలమైంది' అని ఇందులో ఒక డైలాగుంది. ఇదే మాట చెప్పి ఈ కథకి హీరో, నిర్మాతల నుంచి కథకుడు, దర్శకుడు గ్రీన్ సిగ్నల్ పొందారేమో అనే డౌటొస్తుంది. ఏనాడో అవుట్‌డేటెడ్ అయిపోయిన ఫ్యాక్షన్ నేపథ్యానికి బూజు దులిపి తెరకెక్కించిన 'బాలకృష్ణుడు' చిత్రం ఆసారతం అదే ప్రశ్న మదిని తొలుస్తుంటుంది? 'అసలెందుకు తీసారీ సినిమా?' అంటూ!
పాత చింతకాయ కథలతో సినిమాలు తీయడమనేది మన తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తేమీ కాదు. నూటికి డెబ్బయ్ సినిమాలు అలాంటి కథలతోనే రూపొందుతుంటాయి. కాకపోతే కొత్తదనానికి పెద్ద పీట వేసి, తను చేసే ప్రతి సినిమాలోను ఎంతో కొంత వైవిధ్యం వుండాలని తపించే రోహిత్ నుంచి ఇలాంటి నాసి రకం మూస సినిమా రావడమే ఆశ్చర్యమనిపిస్తుంది.
ఇంతవరకు పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా చేయలేదు కనుక పాటలు, ఫైట్లు గట్రా చేయాలని సరదా పుట్టిందో, లేక వెరైటీ సినిమాలతోను కోరుకున్న రిజల్ట్స్ రావడం లేదని రోహిత్‌కి చిరాకొచ్చిందో కానీ, కారణమేదైనా అది ప్రేక్షకుల నెత్తి మీదకి వచ్చింది. రమ్యకృష్ణ, అజయ్‌ల ఫ్లాష్‌బ్యాక్‌తోనే చూసే ప్రేక్షకులనీ ఎన్నో ఏళ్ల పాటు వెనక్కి లాక్కుపోయే ఈ సినిమా కథ వర్తమానంలోకి వచ్చినా కానీ చూసే వారికి మాత్రం ఇంకా తొంభైల కాలం నాటి సినిమా చూస్తున్న అనుభూతే కలుగుతుంది.
చెప్పుకోతగ్గ కథ లేనప్పుడు అదనపు హంగులతో అయినా ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. కానీ 'బాలకృష్ణుడు' చిత్రానికి పని చేసిన ఏ ఒక్కరూ కూడా ఉత్సాహంగా పని చేసిన భావన కలగదు. పాటల సంగతి వదిలేసి కనీసం నేపథ్య సంగీతంలో అయినా మణిశర్మ ముద్ర కనిపించలేదు. ఫ్యాక్షన్ సినిమాలు అంతగా సక్సెస్ అవడంలో మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి వున్న ప్రాధాన్యత ఏంటనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి అతనే తన కెరీర్లోనే బ్యాడ్ స్కోర్ అనిపించేలా మోత మోగించి వదిలాడు.
తెరపై నటీనటుల్లోను ఏదో నిర్లిప్తత. నారా రోహిత్ అయితే తనకి డైలాగులు లేని టైమ్‌లో షూటింగ్ చూడ్డానికి వచ్చిన వాడిలా అసలు ఏమాత్రం రియాక్షన్ లేకుండా నిలబడిపోయిన సందర్భాలు చాలా వున్నాయి. పృధ్వీ తెర మీదకి వచ్చాక కామెడీ వుంటుందేమో అనే చిన్న ఆశ మిణుకుమంటుంది. కానీ ఆ పాత్ర కూడా శ్రీను వైట్ల పిప్పి చేసి వదిలేసిన 'మూర్తి' క్యారెక్టర్‌కి ఇంకో వెర్షన్ అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు. రమ్యకృష్ణ లాంటి నటి కూడా పట్టుచీరలు కట్టుకుని తిరుగుతూ స్క్రీన్ ప్రెజెన్స్‌కే తప్ప నటిగా ఈ చిత్రానికి దోహదపడిందేమీ లేదు. రెజీనా సంగతి సరేసరి. నటించడానికి స్కోప్ లేకపోవడంతో స్కిన్ షోకి పరిమితమైంది.
ఆకట్టుకునే సంభాషణలు కానీ, దగ్గర్లో వున్న ఎగ్జిట్ డోర్ కోసం వెతుక్కోకుండా చేసే పాటలు కానీ, టికెట్‌కి అంత ఖర్చు పెట్టినందుకు, థియేటర్లో ఇంత సమయం గడిపినందుకు ఈ ఒక్క సీన్ చాలనిపించే సందర్భం కానీ ఒక్కటీ లేదిందులో. కథ, కథనాల మాట అటుంచి కనీసం కంటిన్యుటీ పరంగా అయినా కేర్ తీసుకోలేదు. రోహిత్‌ని అలా జులపాల విగ్గుతో పరిచయం చేయాల్సిన అవసరం ఏమిటనేది దర్శకుడే చెప్పాలి. పోనీ ఆ గెటప్ కాసేపు కొనసాగించారా అంటే అదీ లేదు. ఇంట్రడక్షన్ సీన్ అయిపోగానే రెగ్యులర్ హెయిర్ స్టయిల్‌కి మారిపోతాడు. ఆ మాత్రం దానికి అతనికి అలా ఏమాత్రం సూట్ కాని గెటప్ ఎందుకు వేసినట్టు? దానిని ఇంట్రడక్షన్ సీన్‌గా ఎందుకు పెట్టినట్టు?
మొదట్లో అంతా తెలంగాణా యాసలో మాట్లాడే రోహిత్ కాసేపటికి నెమ్మదిగా ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోతాడు. మధ్యలో ఒకసారి సీమ యాక్సెంట్ ట్రై చేసాడు కనుక అతను ఇలా యాసలు మార్చి మాట్లాడతాడని సరిపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో అయితే అసలు యాక్టర్లకి డైలాగ్ పేపర్ ఇచ్చారా లేక నోటికొచ్చింది మాట్లాడుకోమన్నారా అన్నట్టుగా వున్నాయి సంభాషణలు.
విలన్ ఓ అమ్మాయిని చంపాలనుకోవడం, ఆమెకి అండగా హీరో వుండడం, రౌడీలు ఆమెని చంపడానికి వచ్చినపుడు ఆమెని కాపాడుతూ హైవే ఎక్కడం… ఎన్ని సినిమాల్లో చూసి ఎరుగని సీన్లు ఇవి. బి. గోపాల్ సినిమాలు తీయడం ఆపేసి, శ్రీను వైట్ల మార్కు కామెడీకి కనీసం సూపర్‌స్టార్లు కూడా హెల్ప్ కాలేకపోవడం జరిగి ఏళ్లు గడుస్తోంది. మరిప్పుడు ఏ ధైర్యంతో, ఎలాంటి నమ్మకంతో ఈ బాలకృష్ణుడుని తలపెట్టారనేది అంతు చిక్కదు. ఇన్ని కోట్లు ఇలాంటి దండగమారి సినిమాలో పోయడం కంటే… కార్లో వెళుతూ రోహిత్ విసిరేసినట్టుగా రెండు వేల రూపాయల కట్టలు విసిరేస్తూ పోతే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుందేమో.
'తన రెండు గాజులూ అమ్ముకోవాల్సి వచ్చింది..' అంటూ సుదీర్ఘంగా సాగే రాహుల్ ద్రవిడ్ యాంటీ స్మోకింగ్ యాడ్ మరికాసేపు వుంటే బాగుండు అనిపించేంత నాసి రకంగా వున్న ఈ బాలకృష్ణుడు థియేటర్లలో ఎన్నాళ్లుంటాడో కానీ, ఈలోగా చూడ్డానికి వచ్చిన వారందరికీ అసహనం అర్ధం తెలిసేట్టు చేస్తాడు. రెండున్నర గంటలు గడవడం ఎంత కష్టమో లైవ్ డెమో ఇస్తాడు.
బాటమ్ లైన్: హే కృష్ణా!
– గణేష్ రావూరి