2014, 15, 16 నందీ అవార్డులు వచ్చిన వాళ్లకు ముందుగా అభినందనలు చెప్పి వివాదాల గురించి చర్చలోకి వెళదాం. నందే కాదు, ఏ అవార్డు ప్రకటించినా వీళ్లకు అనవసరం, రావల్సిన వాళ్లకు రాలేదు అనడం సహజం. జాతీయ అవార్డుల విషయంలో అయితే కేంద్రం తెలుగువారిపై సవతితల్లి ప్రేమ చూపించిందని వాపోతాం. ఇవి తెలుగువాళ్లే తెలుగువాళ్లకు యిచ్చే అవార్డులు. వీటిల్లో కూడా యింతకు ముందు ఎన్నడూ యింత రగడ కాలేదు. మామూలుగా అయితే సినిమా వాళ్లు పిరికివాళ్లు.
మోస్ట్ వల్నరబుల్. తెరమీదే సాహసం ప్రదర్శిస్తారు. నిజజీవితంలో అధికారంలో ఉన్నవారితో పేచీలు పడరు. ఎందుకంటే ప్రభుత్వం తలచుకుంటే వాళ్లను నానారకాలుగా వేధించగలదు. అందుకని నిర్మాతలు బయటపడరు. హీరోల విషయంలో కూడా మొహమాటాలుంటాయి. అందువలన ఫాన్స్ అసోసియేషన్స్‌ల ద్వారా కాసిన్ని స్టేటుమెంట్లు యిప్పించి ఊరుకుంటారు. అదైనా ఫ్యాన్స్‌ను తృప్తి పరచడానికే.
ఈసారి మాత్రం నిర్మాతలు టీవీల కెక్కి చర్చలు పెట్టేస్తున్నారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎపి ప్రభుత్వం అల్లరిపాలు అవుతోంది. నిజానికి పద్మ అవార్డులు వచ్చినపుడు కూడా ఆంధ్రలో అస్మదీయులకే కట్టబెట్టారని కామెంట్లు వచ్చాయి. ప్రభుత్వం అలాటి వ్యాఖ్యలు పట్టించుకోలేదు. పద్మ అవార్డుల విషయంలో ఫలానా వాళ్ల కంటె ఫలానా వాళ్లు మెరుగు అని అనడానికి జనాలకు వాళ్ల రంగాల గురించి, సాధించిన విజయాల గురించి అవగాహన లేదు.
సినిమా అంటే అందరికీ తెలిసున్నది, ఏ సినిమా ఎలా ఉందో, ఎలా ఆడిందో గణాంకాలతో సహా అందరికీ తెలుసు. దాంతో వీటి మీద విరుచుకు పడ్డారు. ఎవరేమనుకున్నా మాకేమనుకుని నిర్భయంగా, బ్లేటెంట్‌గా, మొరటుగా వ్యవహరిస్తున్న బాబు సర్కార్ యిరుకున పడింది. వాళ్ల తరఫున మాట్లాడుతున్న టిడిపి నాయకులందరూ డిఫెన్సివ్‌గానే మాట్లాడుతున్నారు. మరీ ఎక్కువ ప్రశ్నలు వస్తే వైయస్సార్ హయాంలో మాత్రం అన్యాయాలు జరగలేదా అంటున్నారు. అప్పుడు జరిగాయి కాబట్టి యిప్పుడూ చేసే హక్కు మాకు దఖలు పడిందన్న అర్థం వస్తోంది.
పాతకాలంలో నంది అవార్డుల లిస్టు చూస్తే సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి సినిమాలకు, సందేశాత్మక, అభ్యుదయవాద, లో-బజెట్ సినిమాలకు యిస్తూండేవారని కనబడుతుంది. అవార్డు సినిమాలంటే, ఏవో మూడు నాలుగు తప్పిస్తే, చాలా భాగం మెదడుకు శ్రమ కలిగించి చూడవలసిన సినిమాలనే అర్థం స్థిరపడింది. అందువలన చాలా మంది నిర్మాతలు మాకు ప్రభుత్వ అవార్డులు అక్కరలేదు, బాక్సాఫీసు కలక్షన్లూ, విజయవంతమైన సినిమాలకు ప్రయివేటు సంస్థలు యిచ్చే అవార్డులూ చాలు అనసాగారు. పోనుపోను ప్రతీదీ రాజకీయం అయినట్లే అవార్డులనూ రాజకీయాలకు వాడుకోసాగారు. తమ పార్టీకి ఉపయోగపడతాడనుకున్న సినీ నటీనటులను వీటితో ఆకట్టుకునేవారు.
ప్రజలది గమనించి రాజకీయ కారణాల చేత పక్షపాతం చూపించారు అనేవారు. యిప్పుడు కులం రంగు కూడా పులిమారు. నిజానికి కులం ఫ్యాక్టర్ తీసుకురావడం దురదృష్టం. బహుమతులు పొందిన హీరోలను, విలన్లను, దర్శకులను చూసి గబుక్కున తీర్మానించేయడం పొరపాటు. తక్కిన సాంకేతిక నిపుణులు, నటీనటుల గురించి కూడా చూడాలిగా! దాదాపు 125 అవార్డులు యిచ్చారు, వారందరినీ కులాల వారీగా ఎవరైనా విభజన చేసి చూశారా? ఇలాటి ముద్ర వేయడం వలన టాలెంటుతో అవార్డులు వచ్చినవారు కూడా కించ పడతారు – 'నీ ప్రతిభ చూసి కాదు, ఫలానా కులం వాడిని కాబట్టి యిచ్చారు' అని తక్కినవారు అనుకుంటారేమోనని. కుల ప్రాతిపదిక అనడం కంటె ముఖ్యమైనవి అస్మదీయులకు యిచ్చారు, తస్మదీయులను దూరం పెట్టారు అనుకోవడం సబబు.
బాలకృష్ణ లెజెండ్‌కు అవార్డు యిప్పించుకున్నారనే కనబడుతోంది కానీ వర్మ వెక్కిరింతకు గురైన 2016 జ్యూరీ సభ్యుడు మద్దినేని రమేశ్‌బాబు డైరక్ట్ చేసిన బ్రోకర్2 లో పాటకు 2014 ఉత్తమ గీత రచయిత ఎవార్డు వచ్చింది. అలాగే 2016 జ్యూరీలో సభ్యుడిగా ఉన్న కంపల్లె రవిచంద్రన్‌కు 2015 ఉత్తమ విమర్శకుడిగా అవార్డు వచ్చింది. ఆ పాట కానీ, కంపల్లె కానీ గొప్పవాళ్లు కాదని నేననటం లేదు. ఔచిత్యభంగం జరిగిందని నా భావం. ఓపిగ్గా తీగలు లాగితే యిలాటి డొంకలు ఎన్ని బయటపడతాయో!
ఏ సినిమా, ఏ నటుడు అవార్డుకి అర్హుడు అనే విషయంలో ఒక్కోరిది ఒక్కో అభిప్రాయం. జ్యూరీ సభ్యుల్లోనే ఏకాభిప్రాయం ఏర్పడక వాదోపవాదాలు జరుగుతాయి. అంతకంటె ముందు మనం ఆలోచించవలసినది – ఈ అవార్డుల ద్వారా ప్రభుత్వం ఏం చెప్పదలచింది అని. పాప్యులర్ సినిమా ఎలాగూ ఆడుతుంది, సాంఘిక ప్రయోజనం ఉన్న సినిమాను ప్రభుత్వం అవార్డుల ద్వారా ప్రోత్సహిస్తుంది. అవార్డుల కోసం ఏ నిర్మాత సినిమా తీయడు. డబ్బులే ముఖ్యం. అది కూడా తప్పు కాదు. రూపాయిలంటే ప్రేక్షకులు అని అర్థం. కలక్షన్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ మందికి కళాసృష్టి చేరింది అని అర్థం.
ప్రభుత్వ మద్దతుతో టిక్కెట్టు ధర పెంచేసే సినిమాల విషయంలో యీ లెక్క తప్పుతుందనుకోండి. ఏ కళాకారుడికైనా, కళతో వ్యాపారం చేసేవాడికైనా కావలసినది సాధ్యమైనంత ఎక్కువమందిని చేరడం! దాని ముందు అవార్డులు దిగదుడుపే, ఎన్టీయార్ ''పిచ్చి పుల్లయ్య'' తర్వాత ''తోడుదొంగలు'' తీశారు. దానికి రాష్ట్రపతి ప్రశంసా పత్రం వచ్చింది. అయినా ఆయన యిక అలాటి సినిమాల జోలికి వెళ్లడం మానేసి పూర్తి వాణిజ్యపరంగా ''జయసింహ'' తీశాడు. ఒక పెట్టుబడిదారుడికి ఉండాల్సిన లెక్క అది.
కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది- 'ఇది మంచి సినిమా, ఇలాటి వాటికి మా మద్దతు ఉంటుంది' అని అవార్డుల ద్వారా ప్రభుత్వం తన వైఖరిని తెలియపరుస్తుంది. ప్రభుత్వమనేది తల్లిపాలకు, పౌష్టికాహారానికి ప్రచారం కల్పించాలి. జనాలకు మద్యం మీద మోజుంటుంది, వద్దన్నా వెళ్లి తాగుతారు. ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించనక్కరలేదు. వాళ్లు తాగే మద్యం నాణ్యమైనదో కాదో పర్యవేక్షిస్తే చాలు. అలాగే సినిమా విషయంలో ప్రజల్లోకి చొచ్చుకుని పోతున్న పాప్యులర్ సినిమా జనాలకు మంచి చేసేదో కాదో చూసుకుంటే చాలు. ఆ పని సెన్సార్ చేస్తుంది.
అందరూ చూసే వీలు లేదంటూ సెన్సారు వారు 'ఎ' సర్టిఫికెట్టు యిచ్చిన సినిమాకు ప్రభుత్వం వెన్నుతట్టి, అవార్డు యివ్వడం వింతగా ఉంటుంది. ''లెజెండ్'' సినిమా విషయంలో అదే జరిగింది, ఏకంగా 9 నందులు వచ్చాయి. నాకు ఆ సినిమాపై ఎలాటి వ్యతిరేకతా లేదు, జనం మెచ్చిన సినిమా అది, రికార్డు స్థాయిలో దీర్ఘకాలం ఆడింది. కానీ దానికి ప్రభుత్వ ప్రోత్సాహం అనవసరమనేదే నా భావన. ఉదాహరణకి 2017 అవార్డులలో బాలకృష్ణకు ''గౌతమీపుత్ర శాతకర్ణి''కి అవార్డు వస్తే సంతోషించాలి, గుప్పిటితో అసభ్యమైన చేష్టలు చూపిన ''పైసా వసూల్''కు వస్తే ఖేదపడాలి.
కమ్మర్షియల్ హీరో అయిఉండి ''శాతకర్ణి'' లాటి చారిత్రాత్మక సినిమాను అంగీకరించినందుకు బాలకృష్ణను ప్రోత్సహించాలి. మరి చారిత్రాత్మక సినిమాలో అదీ హీరోయిన్‌కి డిప్యూటీగా పాత్ర వేయడానికి, విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న యువహీరో అయి వుండి కూడా అల్లు అర్జున్ చూపిన షివల్రీని మరి ఎంత సత్కరించాలి? సహాయ నటుడిగా అప్లయి చేస్తే, ఆ అవార్డు యిస్తే యివ్వాలి లేదా పక్కన పెట్టేయాలి, అంతేకానీ కారెక్టరు యాక్టర్‌గా యివ్వడమేమిటి? ఎస్‌వి రంగారావు పేర ఉన్నా, నాగయ్య పేర ఉన్నా అవార్డు స్వభావం మారిపోదు కదా. ఇలాటి బుకాయింపులు జ్యూరీ విలువను తగ్గిస్తాయి. జీవిత ఏదైనా సినిమాలో హీరోయిన్ వేషం వేస్తే ఆవిడకు సూర్యకాంతం పేర అవార్డు యిచ్చి, సూర్యకాంతం మహానటి కాదా? అని అడిగితే ఎలా ఉంటుంది?
ఇలా చేస్తే యికపై ఏ యంగ్ హీరో ఐనా కేమియో రోల్ వేయడానికి ముందుకు వస్తాడా? ఆ ఏడాది సహాయ నటుడు పోసానిట, కారెక్టరు నటుడు అల్లు అర్జున్‌ట! ''మనం'' సినిమాలో నాగచైతన్య సహాయనటుడట! నిజానికి అది మల్టీస్టారర్. మల్టీస్టారర్‌లు రావాలని, హీరోలు అహంకారాలు చంపుకుని, యితరులతో కలిసి సినిమాలు వేయాలని అందరూ అంటూ ఉంటారు. వేస్తే యిదిగో యిలా రాంగ్ బ్రాండింగ్ చేస్తారు, దాంతో సోలో సినిమాలే సో బెటరు అనుకుంటారు హీరోలు. ''రుద్రమదేవి'' కోసం అనూష్క హీరోలతో పోటీ పడి శ్రమకు ఓర్చి కత్తియుద్ధాలు చేసి, ఏనుగెక్కి నటిస్తే ఎవార్డు యివ్వకుండా ''సైజు జీరో''కి యిచ్చి క్రూయల్ జోక్ వేశారు.
హిస్టారికల్ సినిమా కోసం యింత అవస్థ ఎందుకు? హాయిగా మామూలు సినిమాలో డాన్సులు చేసుకుంటూ బతికేస్తే చాలుగా అనుకోరూ హీరోయిన్లు! ''సైజు జీరో'' పాత్ర కోసం ఒళ్లు పెంచి, అది తగ్గక అవస్థ పడుతున్న అనూష్క అంకితభావానికి ఆ అవార్డు యిచ్చారనే వాదనా వినిపిస్తున్నారు. ''అభయ్'' సినిమా కోసం ఒళ్లు పెంచి ఆ తర్వాత తగ్గక కమల్ హాసన్ కూడా తంటాలు పడుతున్నాడు. అందువలన ''అభయ్''కి కూడా అవార్డు యిచ్చి ఉండేవారా? ''రుద్రమదేవి'' షూటింగులో బాబా సెహగల్ ఏనుగు కారణంగా కాలు విరక్కొట్టుకున్నాడు. పాపం అని అతనికీ ఓ అవార్డిస్తారా?
రఘుపతి వెంకయ్య ఎవార్డు దాదా ఫాల్కే ఎవార్డు వంటిది. లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్‌లా కెరియర్ ముగింపు దశలో ఉన్నవారికి యిస్తూంటారు. 2014, 2015 లకు అవార్డులు పొందిన కృష్ణంరాజు, పబ్లిసిటీ ఆర్టిస్టు ఈశ్వర్ అలాటి వారే. వారి సరసనే చిరంజీవికి యివ్వడమేమిటి? ఆయన యింకా రన్నింగ్‌లోనే ఉన్నాడు కదా! అలాగే బిఎన్ రెడ్డి అవార్డు కూడా వెటరన్స్‌కు యివ్వకుండా రన్నింగ్‌లో ఉన్నవారికి యిచ్చేశారు. కుటుంబగాథా చిత్రాలకు కూడా దర్శకత్వం చేశాడు కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఓకే అనుకున్నా, రాజమౌళికి యివ్వడమూ ఆశ్చర్యకరమే. అన్నిటికంటె ఆశ్చర్యం – యాక్షన్ సినిమాలకు పేరుబడిన బోయపాటి శ్రీనుకు కళాత్మక చిత్రాలు తీసిన బిఎన్ అవార్డు యివ్వడం! వీళ్లలో రాజమౌళికి, శ్రీనుకు ఉత్తమ డైరక్టర్లుగా యిదే లిస్టులో ఎలాగూ యిచ్చారు.
ఈ ముగ్గురూ హిట్ సినిమాలు తీస్తూనే ఉన్నారు. వీళ్లకు యిచ్చేబదులు సెంటిమెంటు సినిమాలు తీసిన సీనియర్లకు యిచ్చి ఉండవచ్చు. కీరవాణికి బాహుబలి సంగీతం, గాయకుడుతో బాటు ముచ్చటైన మూడోదిగా నాగిరెడ్డి-చక్రపాణి ఎవార్డు కూడా యిచ్చారు. ఆ అవార్డు నిర్మాతలకు యిస్తారనుకున్నాను. కీరవాణిని ఎలా ఫిట్ చేశారో మరి! పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, డబ్బింగ్ ఆర్టిస్టు సౌమ్యలకు రెండేసి ఎవార్డులు, చిన్మయికి గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మొత్తం మూడు అవార్డులు వచ్చాయి. అయితే యివన్నీ వేర్వేరు సినిమాలకు! సినిమాలపై వచ్చిన పుస్తకాలకు ఏడాదికి ఒకటే ఎవార్డు యిస్తారు. 2014లో చిత్రవిచిత్రంగా రెండు పుస్తకాలకు యిచ్చారు. ఇది నటీనటులకు, సినిమాలకు కూడా వర్తింపచేసి ఉంటే అన్ని సినిమాలనూ ఎకామడేట్ చేయగలిగేవారు.
ఇక సినిమాల విషయానికి వస్తే అనేక చిన్న సినిమాలకు గుర్తింపు యిచ్చాం అంటారు జ్యూరీ సభ్యులు. ప్రతీ ఏడాదీ అలాగే యిస్తారు. కానీ కొన్ని ముఖ్యమైన పెద్దవాటిని వదిలేయడంతో వచ్చింది చిక్కు. ఈ మార్చి నెలలోనే 2012, 2013 ఏడాదులకు కోడి రామకృష్ణ, జయసుధల నేతృత్వంలో ప్రకటించిన అవార్డులపై వివాదాలు రాలేదు. మరి యీ సారి ఎందుకు వచ్చాయి? బాలకృష్ణ జోక్యం వలన అంటున్నారు. సీల్డు కవర్లు తెరిచి కూడా మార్పులు చేయించారనే వదంతులూ వినవస్తున్నాయి.
ఇది నిజమైనా, అబద్ధమైనా అంతిమంగా బాధ్యత వహించవలసినది జ్యూరీలను నియమించిన ప్రభుత్వమే. ప్రభుత్వం కొందరి పట్ల వివక్షత చూపించిందని తీవ్రమైన ఆరోపణలు వస్తే సమర్థించుకోవడానికి తంటాలు పడాల్సింది అధికార పార్టీ నాయకులే కదా! ఇక ''రుద్రమదేవి'' విషయంలో రాయడానికి ముందు ఓ విషయం క్లారిఫై చేయాలి. నేను ఆ సినిమా కథా పరిశోధక బృందంలో సభ్యుణ్ని. అంతమాత్రం చేత నేను దానిపై వలపక్షం చూపిస్తున్నానని అనుకోకూడదు. ఆ సినిమా యంత్రాంగంలో నేను ఓ చిన్‌న్న శీలను. నా పేరు తెరపై మరో నలుగురితో పాటు కనబడుతుంది. నాకు, ఆ సినిమాకు ఏ సంబంధం లేకపోయినా యిది రాసి ఉండేవాణ్ని…
సినిమాలలో తమ అభిరుచి కొద్దీ ప్రజలు కొన్నిటిని ఆదరిస్తారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొన్నిటిని ఆదరించాలి, ప్రమోట్ చేయాలి. మా చిన్నతనంలో మంచి సినిమాలకు క్లాస్ కన్సెషన్ యిచ్చేవారు. 5 అణాల టిక్కెట్టు కొంటే 9 అణాల క్లాసులో కూర్చోవచ్చన్నమాట. వినోదపు పన్ను మినహాయింపు నిర్మాతలకు యివ్వడం కంటె ఆ మేరకు టిక్కెట్టు ధర తగ్గిస్తే కన్స్యూమరుకు ప్రోత్సాహకంగా ఉండి, యింకా ఎక్కువమంది చూస్తారు. అదంతా సంక్లిష్టమైన వ్యవహారం కాబట్టి నిర్మాతకు యిస్తామంటున్నారు. సరే, రుద్రమదేవికి ఎందుకు యివ్వలేదు? తెలంగాణ రాణి అన్నారట.
కాకతీయ సామ్రాజ్యం యిప్పటి ఆరు రాష్ట్రాలకు విస్తరించిన సామ్రాజ్యం. ఎవరి ఖాతాలో వేస్తారు? రేపు బాలకృష్ణ హీరోగా కృష్ణదేవరాయలుపై సినిమా తీస్తే కన్నడాయన అని మినహాయింపు మానేస్తారా? తంజావూరు సామ్రాజ్యంలో విలసిల్లిన రాజుల గురించి తీస్తే తమిళుడనో, మరాఠీ అనో మినహాయింపు యివ్వరా? ఆ మాట కొస్తే శాతవాహనులది తెలంగాణలోని కోటిలింగాల కాదా? మరి గౌతమీ పుత్ర శాతకర్ణి విషయంలో ఆ వాదన ముందుకు రాలేదేం?
కాకతీయులు ఏ కులం అని ఎవరూ నిర్ధారించలేరు. వాళ్లు అన్ని కులాల వారినీ కలుపుకుంటూ ఎదిగారు. రుద్రమదేవి అల్లుడు బ్రాహ్మడు. అయినా కమ్మవారు కాకతీయ సామ్రాజ్యాన్ని ఓన్ చేసుకున్నారు. వారి సంస్థలు అనేక వాటికి 'కాకతీయ' అని పేరు పెట్టుకుంటారు. ఆంధ్ర ప్రభుత్వానికి కమ్మ పక్షపాతమే ఉంటే, బ్రాహ్మడైన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా కంటె, రుద్రమదేవి సినిమాకు ఎక్కువగా సహకారం అందించి ఉండాలి. అందించలేదు కాబట్టి కమ్మ ఫీలింగు లేదనుకోవాలా? లేదా సబ్జక్టు కంటె తీసినవారిని, వేసినవారిని ఎక్కువగా పరిగణించాలనుకోవాలా? తెలంగాణ ప్రభుత్వానికి ఆ కన్సిడరేషన్స్ లేనట్టున్నాయి. రెండిటికీ యిచ్చేసింది. ఆంధ్ర ప్రభుత్వం మినహాయింపు యివ్వలేదు, ఇస్తారేమోనని వేచివేచి చూసిచూసి చివరకు గుణశేఖర్ బహిరంగంగా ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఏమవుతుందో ఆంధ్ర సర్కారు వారు అవార్డుల విషయంలో చేతల్లో చూపించారు.
కేంద్రం చూస్తే బేటీ బచావో, బేటీ పఢావో అంటుంది, ఈ సినిమా బేటీని బచాయించడమే కాదు, గద్దెపై కూర్చోబెట్టినా నిక్షేపంలా పాలిస్తుంది అని చాటి చెప్పింది. బాహుబలిలో శివగామిది పవర్‌ఫుల్ లేడీ పాత్రే కానీ ఎంతైనా అది కాల్పనిక పాత్ర. రుద్రమదేవిది సజీవమైన పాత్ర. చరిత్రలో భాగమైన పాత్ర. 800 ఏళ్ల క్రితమే రాజ్యం చేసిన రాణి పాత్ర. ఆ కథ మన తెలుగు గడ్డపై జరగడం మనకు గర్వకారణం. దాన్ని మనం స్మరించుకుని పులకిస్తూ ఉంటాం కాబట్టే అనేక గేయాల్లో ఆమెను కీర్తిస్తాం. అలాటిది ఆమెపై సినిమా తీస్తే వ్యవహరించాల్సిన తీరు యిదేనా? నిజానికి ఆడశిశువులను పురిట్లోనే యింకా చంపేస్తూ ఉన్నారు. స్త్రీ, పురుష నిష్పత్తి సవ్యంగా ఉండక అనేక సామాజిక సమస్యలు వస్తున్నాయి. స్త్రీల పట్ల లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
మహిళాస్వేచ్ఛ ఉన్న అమెరికాలో సైతం వేధింపులు ఎదుర్కున్నామంటూ బయట పడుతున్న హాలీవుడ్ మహిళల జాబితా నానాటికీ పెరుగుతోంది. సినిమాల్లో ౖస్తీలకు ప్రాధాన్యత ఉండటం లేదు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి ఏ హీరో సిద్ధపడటం లేదు. ఇలాటి వాతావరణంలో మహిళను ప్రధాన పాత్రలో పెట్టి భారీ త్రి-డి సినిమా తీసే సాహసం చేస్తే కనీస గుర్తింపు కూడా ఉండదా? ''లెజెండ్''లో సందేశం ఏముంది అని ఎవరో అడిగితే ఓ జ్యూరీ సభ్యుడు 'భ్రూణహత్యలను నిరసించారు' అని చెప్పారు. దానితో పోలిస్తే మరి రుద్రమదేవిలో ఎంత పెద్ద సందేశం ఉన్నట్లు! ఆడపిల్లలను బతికిస్తే, అవకాశం కల్పిస్తే వాళ్లు మగవాళ్లను తలదన్నేలా పరిపాలించగలరు అని చెప్పారు. అది జ్యూరీ సభ్యులకు వినిపించలేదా?
నిర్మాణం ఎందుకు ఆలస్యమైంది, సినిమాలో గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి, ఎంత బిజినెస్ అయింది, 40 కోట్ల బజెట్ అంటేనే వర్కవుట్ కాదని అన్న హీరోయిన్ ఓరియెండెట్ సినిమా దాదాపు 90 కోట్ల బిజినెస్ ఎలా చేసింది, ఓపెనింగ్స్ బాగా వచ్చినా వారం తర్వాత యింకో సినిమా కోసం ఎలా షిఫ్ట్ చేశారు.. యిలాటివన్నీ ప్రభుత్వానికి అక్కరలేని విషయాలు. ఇది ఒక మంచి ప్రయత్నం, మేం హర్షిస్తున్నాం, అభినందిస్తున్నాం అని భుజం తట్టవలసిన అవసరం ఉంది. బాధ్యత ఉంది. ఆట్టే మాట్లాడితే అలాటి జెండర్ ఈక్వాలిటీ సినిమాలను కొనుగోలు చేసి, స్కూళ్లల్లో ప్రదర్శిస్తే ఆడపిల్లల్లో ధైర్యం పెరిగి, యాసిడ్ పోతలు, లైంగిక వేధింపులు తగ్గుతాయి. ఒకే అవార్డు కోసం అర్హత కలిగిన ఎంట్రీలు ఎక్కువగా పోటీ పడినపుడు జ్యూరీ తన పేరున ఎవార్డులు యిచ్చి బాలన్స్ చేస్తుంది.
అలా ఏటా మూడు అవార్డులు యిచ్చే వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటును కూడా యీ మూడేళ్ల జ్యూరీలు ఉపయోగించుకోలేదు. ఒక్కోటి మాత్రమే యిచ్చి ఊరుకున్నాయి. ''రేసు గుర్రం'', ''రుద్రమదేవి'' వంటి సినిమాలకు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి నటులకు అలాటి ఎవార్డులు యిచ్చి ఉండవచ్చు. ''రుద్రమదేవి''ని జాతీయ సమైక్యతా చిత్రంగా కూడా కన్సిడర్ చేసి ఉండవచ్చు. కృష్ణా జలాల గురించి రెండు తెలుగు రాష్ట్రాలు జుట్టూజుట్టూ పట్టుకుంటున్న యీ తరుణంలో ''ఒక నదీమతల్లి నీరు తాగి పెరుగుతున్న మనం ఒక తల్లి పిల్లల వంటి వాళ్లం కాదా?'' అన్న ఒక్క సందేశం చాలు, సమైక్యత బోధించిందనడానికి.
ఈ అవార్డుల రూపంగా ఆంధ్ర ప్రభుత్వం తమకు పక్షపాతం ఉందనీ, తాము కొంతమందిపై కక్ష కట్టామనీ చాటి చెప్పుకున్నట్లయింది. అంతేకాదు, తమ చర్యలను ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లను దండించక మానమని కూడా చెప్పింది. అనేక విషయాల్లో వివక్షత కనబడుతోందని అందరూ వాపోతూనే ఉన్నారు. కానీ యిప్పుడు, స్వతహాగా నోరు విప్పని సినిమా వాళ్లే బాహాటంగా బయటకి వచ్చి ప్రశ్నిస్తున్నారు కాబట్టి యికనైనా జాగ్రత్త పడడం మంచిది.
-ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]