రాజకీయాల్లోనే కాదు, సినిమా రంగంలో కూడా శాశ్వత శతృత్వాలు వుండవు. ఎక్కడైనా వ్యాపారాలు, అవసరాలు బట్టి అభిమానాలు ఆధారపడి వుంటాయి. అందుకే చిరకాలంగా పెద్దగా బంధాలు లేని నిర్మాతలు కమ్ పంపిణీదారులు సుధాకర రెడ్డి, దిల్ రాజు ఇప్పుడు మళ్లీ ఒక్కతాటి మీదకు వచ్చేసారు. నిజానికి సుధాకర రెడ్డి కొడుకు నితిన్ కు మంచి హిట్ ఇచ్చింది దిల్ రాజే. ఆయన తొలి సినిమా దిల్ లో హీరో నితిన్ నే.
కానీ ఆ తరువాత సుధాకర రెడ్డికి, దిల్ రాజుకు నైజాం పంపిణీ రంగంలో పోటా పోటీ నెలకొంది. ఇద్దరూ నైజాం పంపిణీ రంగంలో కాస్త గట్టిగానే పోటీపడ్డారు. ఇంతలో ఏసియన్ సునీల్ రంగంలోకి వచ్చారు. ఆ తరువాత తరువాత సుధాకర రెడ్డి జోరు తగ్గింది. దిల్ రాజు కాస్త బాగానే ముందుకు వెళ్లిపోయారు. ఇదిలా వుంటే ఆ మధ్య లై సినిమా విడుదలై టైమ్ లో సుధాకర రెడ్డి పాత పోటీని పక్కన పెట్టి దిల్ రాజు ఆఫీసుకు వెళ్లారు.
లై సినిమా ముక్కోణపు పోటీలో విడుదల అయిన టైమ్ లో థియేటర్ల సమస్య పై దిల్ రాజు సాయంకోరారు. దాంతో ఇద్దరి మధ్య మళ్లీ సయోధ్య ప్రారంభమైనట్లు కనిపించింది. ఇటీవల దిల్ రాజు సుధాకర రెడ్డి ఆఫీసుకు వెళ్లి, దర్శకుడు సతీష్ వేగ్నిశతో తను తీయబోయే శ్రీనివాస కళ్యాణం కథను నితిన్ కు వినిపించారు. కథ, నితిన్ కు, సుధాకర రెడ్డికి నచ్చేసింది. వెంటనే ఓకే అనేసారు. అంతేకాదు, నితిన్ కేరీర్ ను మరింత సూపర్ గా మలిచే బాధ్యత దిల్ రాజుదే అని సుధాకర రెడ్డి అప్పగింతలు పెట్టినట్లు తెలుస్తోంది.
దీనికి దిల్ రాజు, శ్రీనివాస కళ్యాణమే కాదు, ఆ తరువాత సినిమా కూడా నితిన్ తో తానే చేస్తానని మాటిచ్చేసి వచ్చినట్లు వినికిడి. మొత్తానికి నైజాంలో కీలకమైన సుధాకర రెడ్డి, దిల్ రాజుల మధ్య మళ్లీ మాంచి సంబంధాలు నెలకొన్నాయన్నమాట. నితిన్ ఇప్పుడు చేస్తున్న సినిమా తరువాత శ్రీనివాస కళ్యాణం ప్రారంభమవుతుంది. ఆ సినిమా తరువాత దిల్ రాజు-అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్న మల్టీ స్టారర్ లో కూడా నితిన్ వుండే అవకాశం వుందని తెలుస్తోంది.