కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ కు ఎలాగూ ప్రాధాన్యం ఉండదు. కానీ ఉన్నంతలో గ్లామర్ తోనో, ఓ 2సన్నివేశాలతోనో ఎట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. అవి కూడా లేకపోతే “కూరలో కరివేపాకు” అంటారు. ఈ విషయంలో మరోసారి వేస్ట్ అనిపించుకుంది రకుల్ ప్రీత్ సింగ్.
మొన్నటికిమొన్న స్పైడర్ సినిమాలో పనికిరాని పాత్ర పోషించిన రకుల్.. తాజాగా ఖాకి సినిమాలో కూడా అదే రిపీట్ చేసింది. స్టార్ వాల్యూ చూస్తోంది తప్ప, తన క్యారెక్టర్ వాల్యూను చూడ్డం లేదు. రారండోయ్ వేడుకచూద్దాం సినిమాలో భ్రమరాంబ లాంటి మంచి పాత్ర పోషించిన ఈ హీరోయిన్.. ప్రస్తుతం పాత్రల ఎంపికలో అస్సలు శ్రద్ధ చూపించడం లేదు.
కొన్ని రోజుల కిందట కేరాఫ్ సూర్య సినిమాలో హీరోయిన్ ఎపిసోడ్ మొత్తం లేపేశారు. ఇప్పుడు ఖాకి సినిమా నుంచి కూడా రకుల్ నటించిన కొన్ని సన్నివేశాల్ని అలా తీసేయొచ్చు. దీనివల్ల సినిమాకు ఎలాంటి నష్టం ఉండదు. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో రకుల్ ను నిర్థాక్షిణ్యంగా లేపేయొచ్చు.
అదే కనుక జరిగితే ప్రస్తుతం సౌత్ లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న రకుల్ కు అంతకంటే పరువు తక్కువ విషయం ఇంకోటి ఉండదు. ధృవ, నాన్నకు ప్రేమతో, సరైనోడు లాంటివి ఫక్తు కమర్షియల్ సినిమాలైనప్పటికీ అందులో మంచి రోల్స్ పోషించింది రకుల్. అనుష్కలా కొన్నాళ్లు స్టాండర్డ్ గా నిలబడాలంటే సినిమాల ఎంపికలో ఈ బ్యూటీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది.