బిచ్చగాడు సినిమాతో తెలుగు బి సి సెంటర్లలో బాగానే పరిచయం అయిపోయాడు విజయ్ ఆంటోనీ. మరీ అధ్భుతంగా ఆడకపోయినా, భేతాళుడు సినిమా కూడా బాగానే చూసారు. తెలుగులో స్మూత్ గా ఫిక్స్ కావాలని అనుకుంటున్న విజయ్ ఆంటోనీ, తన సినిమాల మార్కెటింగ్ కన్నా, పబ్లిసిటీ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు.
అందుకే ఈ నెల 30న విడుదల కాబోయే ఇంద్రసేన సినిమాను జస్ట్ రెండున్నర కోట్లకు తెలుగు థియేటర్ హక్కులు అమ్మేసాడు. కానీ పబ్లిసిటీ బాగా చేయాలని కండిషన్ పెట్టాడట.
సినిమా ఏమాత్రం బాగున్నా, సరైన పబ్లిసిటీ పడాలే కానీ, విజయ్ ఆంటోనీ సినిమా ఆంధ్ర, తెలంగాణ కలిపి రెండున్నర కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమైన ఫీట్ కాదు. గతంలో విక్రమ్ ఇంకొక్కడు, శ్రీనివాస రెడ్డి హీరోగా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా వంటి సినిమాలను అందించిన నిర్మాత నీలం కృష్ణారెడ్డి ఇంద్రసేన హక్కులు సంపాదించారు.
అలనాటి హీరోయిన్ రాధిక ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. సినిమా ట్రయిలర్ చూస్తే, టిపికల్ విజయ్ ఆంటోనీ స్టయిల్ సినిమాలాగే కనిపిస్తోంది.
రెండున్నర కోట్లకు కేవలం థియేటర్ రైట్స్ మాత్రమే విక్రయించారు. శాటిలైట్ హక్కులు మాత్రం తమిళ నిర్మాతల దగ్గరే వున్నాయి.