అదిగో సినిమా అంటే ఇదిగో కాపీ అనో, ఇదిగో ఇన్సిపిరేషన్ అనో వార్తలు రావడం కామన్ టాలీవుడ్ లో. పైగా మన దర్శకులు కూడా హాలీవుడ్ సిడీలు పట్టుకుని, మిక్సీలో రుబ్బి సినిమాలు తీయడం కూడా కామనే. అందువల్లే ఇలాంటివి పుడుతూ వస్తాయి. లేటెస్ట్ గా త్రివిక్రమ్-పవన్ ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న అజ్ఞాతవాసి సినిమాకు 2011లో వచ్చిన ది హెయిర్ అప్పారెంట్ సినిమా ఇన్సిపిరేషన్ అని వినిపిస్తోంది.
అజ్ఞాతవాసి కథ అందరికీ ఇప్పటికే తెలిసిపోయింది. ఓ ధనవంతుడు. ప్రతీదీ రెండు ఆప్షన్లు వుంచుకుంటాడు. అలాగే ఇద్దరు భార్యలు. అతగాడిని మర్డర్ చేస్తే, రెండో భార్య, మొదటి భార్య తాలూకా ఎవరన్నా వున్నారా అని వెదక్కుంటూ వచ్చి, సవతి కొడుకు సాయంతో పగ తీర్చుకుంటుంది.
కాస్త ఫ్యామిలీ వ్యవహారాలతో పాటు, హై ఇన్టెషన్ యాక్షన్ కూడా వుంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో దుబాయ్ లో కనిపించే భారీ ఎత్తయిన భవనంపై వుండే టెర్రస్ సెట్ ను వేసారు. దీన్ని గ్రీన్ మ్యాట్ లోకి మార్చి, విఎఫ్ఎక్స్ వర్క్స్ తో దుబాయ్ లో వున్నట్లు చూపిస్తారు.
ది హెయిర్ అప్పారెంట్ ట్రయిలర్ లో కూడా ఇలాంటి భవంతి పదే పదే కనిపించడం విశేషం. పైగా స్టొరీ లైన్ కూడా కాస్త దగ్గరగా వుంది. అందువల్ల ఈ గ్యాసిప్ వినిపిస్తోందో, లేదా బాగా పోలికలు వున్నాయో, సినిమా వస్తే కానీ తెలియదు.