కొత్త దర్శకులతో బన్నీ సినిమాలు చేస్తాడని ఊహించగలమా..? అప్పుడెప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో సుకుమార్ ను దర్శకుడిగా పరిచయం చేశాడు. మళ్లీ ఇన్నేళ్లకు వక్కంతం వంశీని పరిచయం చేస్తున్నాడు. మధ్యలో ఒక్కరంటే ఒక్క కొత్త డైరక్టర్ కు కూడా అవకాశం ఇవ్వలేదు. కేవలం సీనియర్లు, స్టార్ డైరక్టర్లతో మాత్రమే పనిచేశాడు. కానీ ఇప్పుడు బన్నీ కూడా రూటు మార్చినట్టు కనిపిస్తోంది.
కదిలించే కథ దొరికితే కొత్త కుర్రాడికి కూడా ఛాన్స్ ఇస్తానంటున్నాడు అల్లు అర్జున్. ఓవైపు 'నా పేరు సూర్య' షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు ఈ స్టోరీలు వినే పని పెట్టుకున్నాడు. అలా ముగ్గురు కొత్త కుర్రాళ్లు చెప్పిన కథలు విన్నాడు. వీళ్లలో ఓ వ్యక్తి చెప్పిన స్టోరీ లైన్ కు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
యూవీ క్రియేషన్స్ నిర్మాతల రిఫరెన్స్ తో ఈ కుర్రాడు, బన్నీని కలిసి ఓ మంచి కథతో అతడ్ని ఒప్పించినట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేసేందుకు బన్నీ ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నాడు. ఈ అసిస్టెంట్ డైరక్టర్ నే దర్సకుడిగా పరిచయం చేస్తూ యూవీ బ్యానర్ లో సినిమా చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే, వరుసగా 2సినిమాలతో కొత్త దర్శకులకు బన్నీ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.