గత ఏడాది స్థానిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టంలో ఒకే నామినేషన్ దాఖలు అయిన స్థానాల్లో ఏకగ్రీవ ఎన్నిక ప్రకటనకు సంబంధించి.. ఇప్పుడు ఫిర్యాదులు తీసుకోవడం వివాదాస్పదంగా మారేలా ఉంది. ఆల్రెడీ ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించి డిక్లరేషన్ పత్రాలను జారీ చేశారు రిటర్నింగ్ అధికారులు.
అయితే ఏకగ్రీవాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే తీసుకోవాలంటూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తర్వులు ఆల్రెడీ ఇచ్చారు. గతంలో ఏకగ్రీవాల పత్రాలు జారీ అయినప్పుడు ఎస్ఈసీ ఈయనే! ఇప్పుడు వాటిపై పునఃసమీక్ష కోరుతున్నదీ ఈయనే! ఇందుమూలంగా అర్థం అయ్యేది.. ఆయన తీరును ఆయనే అనుమానిస్తున్నారనేది.
ఒకవేళ ఏకగ్రీవాలు అక్రమం అనుకుంటున్నారంటే.. అప్పుడేం చేశారు? అప్పుడు ఎన్నికల తీరును సమీక్షించింది ఈయనే కదా! అప్పుడు ఈయనకే లేని అభ్యంతరాలు.. ఆయనకే ఇప్పుడు ఎందుకు అనిపిస్తున్నాయనేది సామాన్యుల సందేహం! తర్కానికి అందదు నిమ్మగడ్డ తీరు.
ఆ సంగతలా ఉంటే.. కంప్లైంట్లు ఇవ్వమనగానే.. తెలుగుదేశం పార్టీ వాళ్లు పొలోమంటూ కలెక్టర్ల ఆఫీసుల దగ్గర క్యూలు కట్టినట్టుగా తెలుస్తోంది. అప్పుడు తమను నామినేషన్ వేయనివ్వలేదని.. వీరు చెప్పుకుంటున్నారట! తమను అడ్డుకున్నారని, తమను కొట్టారని, గిల్లారని, మొత్తారని.. ఒక్కోరు ఒక్కోలా చెబుతున్నారట!
అయినా.. ఈ రోజుల్లో ఏపీలో ఒక రాజకీయ పార్టీ తరఫున నామినేషన్ వేయాలని ఎవరైనా అనుకుంటే, అడ్డుకునేంత శక్తి ఎవ్వరికీ ఉండదు. తెలుగుదేశం అధికారంలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. మరీ నామినేషన్లను అడ్డుకునేంత సీన్ ఎవ్వరికీ ఉండదు. ఏపీ అంటే.. ఎంతో రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రం. అధికారంలో ఉన్నంత మాత్రానా ఎవ్వరూ బలవంతపు ఏకగ్రీవాలు చేసుకోలేరు, ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రానా.. నామినేషన్లు దాఖలు చేయడానికి ఆటంకాలు ఉండవు.
తమను నామినేషన్ వేయనివ్వలేదు అని ఎవరైనా వాదిస్తే.. అది కేవలం అసంబద్ధపు వాదనే తప్ప మరోటి కాదు. ఏపీలో ఉన్నది రెండే పార్టీలు కాదు. అందులోనూ తెలుగుదేశం పార్టీ మరీ క్యాడర్ లేని పార్టీ కాదు. దశాబ్దాల పాటు అధికారాన్ని అనుభవించిన ఆ పార్టీకి పటిష్టమైన క్యాడర్ ఉంది. ప్రత్యామ్నాయంగా ఆ పార్టీకి చోటు ఉండనే ఉంది. అలాంటప్పుడు.. ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు కాలేదంటే అది కేవలం బలవంతం వల్ల ఆగే పనే కాదు. ఈ మాత్రం రాజకీయ అవగాహన ఎవ్వరికైనా ఉంది.
పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు స్వల్ప శాతమే. అలాంటిది ఎంపీటీసీలు, జడ్పీటీసీలంటే.. ఏకంగా మండలాలకు మండలలనే ప్రభావితం చేయాలి! అలాంటి వాటిల్లో బలవంతపు ఏకగ్రీవం అనేది కేవలం కలలో మాట. ఎవ్వరికీ అంత సీన్ ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఎక్కడైనా నెగ్గిందంటే అది తెలుగుదేశం పార్టీ చేతగాని తనమే తప్ప, బలవంతంగా నామినేషన్లను అడ్డుకోవడం అనేది కేవలం అసంబద్ధపు వాదన మాత్రమే.
ఇక ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చే వాళ్ల సంగతి పరిశీలిస్తే.. అదేమీ ఖర్చయ్యే వ్యవహారం కాదు! అప్పుడు కళ్లు మూసుకుని, ఇప్పుడు ఎన్నికలను వివాదాస్పదం చేసే అవకాశం ఉంది కాబట్టి.. ఎంచక్కా ఫిర్యాదులు చేస్తుండవచ్చు. ఈ ఫిర్యాదులను తెలుగుదేశం పార్టీ ఒక ఉద్యమంగా వాడుకోవచ్చు.
ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని టీడీపీ అడ్డదారి రాజకీయానికి వాడుకుంటున్న వైనం స్పష్టం అవుతోంది. కంప్లైంట్లు అంటూ మొదలు పెడితే.. ఆల్రెడీ ఓటింగ్ అయిపోయి గెలిచిన వాటి విషయంలో కూడా లేచొస్తారు చాలా మంది. మరీ కంప్లైంట్లు చేసే వాళ్ల దగ్గర ఆధారాలు ఏమున్నాయి? వాటిని కలెక్టర్లు ఏ ధోరణితో పరిశీలిస్తారు?
ఎన్నికల్లో అక్రమాలను విచారించడానికి కోర్టులకే సమయం చాలదు. అలాంటిది కలెక్టర్లు ఎవరి దగ్గర ఆధారాలున్నాయని, మరెవరి దగ్గర ఆధారాలు లేవని నివేదికలు ఇవ్వగలరు? అది కూడా రోజుల వ్యవధిలో! కలెక్టర్ల ఆఫీసులకు వెళ్లే ఈ ఫిర్యాది దారులు.. ఏడుపులూ పెడబొబ్బలు అక్కడే పెట్టగలరు. ఆ మాత్రం ప్రిపరేషన్ లేకుండా వెళ్లరు కదా! మరి రేపు కలెక్టర్లు అక్రమాలు జరగలేదని నివేదికలు ఇస్తే వాటిని టీడీపీ ఏమో యథాతథంగా మోసం అంటుంది. వాటిని ఎస్ఈసీ ఏం చేస్తుంది?