నిన్నంతా టాలీవుడ్ లో ప్రభాస్ బర్త్ డే హంగామా నడిచింది. ట్విట్టర్ లో లేకపోయినా దాదాపు 20లక్షల మంది ప్రభాస్ కోసం ట్వీట్ చేశారు. అటు ఫేస్ బుక్ లో కూడా అంతే సందడి కనిపించింది. కానీ బాలీవుడ్ నుంచి ప్రభాస్ పుట్టినరోజుకు అంతగా రెస్పాన్స్ రాలేదు. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు బాహుబలిని పట్టించుకోలేదు.
బాహుబలి-2తో జాతీయస్థాయిలో ప్రభాస్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. కానీ బాలీవుడ్ లో ప్రభాస్ సర్కిల్ చాలా చిన్నది. కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే ఫ్రెండ్స్ ఉన్నారు. అదే రానా పుట్టినరోజైతే ఈపాటికి బాలీవుడ్ నుంచి ట్వీట్ల వెల్లువ వచ్చి ఉండేది. సరే.. ఈ విషయం పక్కనపెడితే.. ఓ వ్యక్తి నుంచి మాత్రం రియాక్షన్ ఆశించారు చాలామంది. కానీ చివరికి ఆ వ్యక్తి కూడా ప్రభాస్ ను మరిచిపోయాడు. అతడే కరణ్ జోహార్.
బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల్ని బాలీవుడ్ లో ప్రజెంట్ చేసింది ఇతడే. ఈ రెండు సినిమాలతో బాగానే సొమ్ముచేసుకున్న కరణ్.. అప్పట్లో ప్రభాస్ ను ఆకాశానికెత్తేశాడు. ముంబయికి ప్రత్యేకంగా రప్పించుకొని మరీ తన క్లోజ్ సర్కిల్ మధ్య పెద్ద పార్టీ ఇచ్చాడు. అతడితో ఓ బాలీవుడ్ సినిమా చేస్తానని కూడా ప్రకటించాడు.
బాహుబలి-2 విడుదల టైమ్ లో ఇంత హంగామా చేసిన కరణ్.. ప్రభాస్ పుట్టినరోజు నాడు అతడితో హిందీ సినిమాను ఎనౌన్స్ చేస్తాడని అంతా ఎదురుచూశారు. కానీ అలా జరగకపోగా, కనీసం ప్రభాస్ కు బర్త్ డే శుభాకాంక్షలు కూడా చెప్పలేదు కరణ్ జోహార్. బహుశా ప్రభాస్ బర్త్ డే మేటర్ కరణ్ వరకు చేరి ఉండకపోవచ్చు.