నాగ్ మనసు తెలిసి కూడా..?

రాజ్ తరుణ్ సినిమాలు రెండు ఒకేసారి రెడీ అవుతున్నాయి. అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మిస్తున్న రంగుల రాట్నం. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్న రాజూగాడు. రెండింటికీ కొత్తవాళ్లయిన మహిళా దర్శకులు పనిచేస్తున్నారు.…

రాజ్ తరుణ్ సినిమాలు రెండు ఒకేసారి రెడీ అవుతున్నాయి. అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మిస్తున్న రంగుల రాట్నం. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్న రాజూగాడు. రెండింటికీ కొత్తవాళ్లయిన మహిళా దర్శకులు పనిచేస్తున్నారు. రెండు సినిమాలు దాదాపు రెడీ అయిపోయినట్లే. అయితే రంగుల రాట్నం టైటిల్, సబ్జెక్ట్ రీత్యా సంక్రాంతికి విడుదల చేస్తే బాగుండును అని నాగార్జున భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సంగతి తెలిసి ఎకె ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ముందుగా రుమాలు వేసేసింది. తమ సినిమా సంక్రాంతికి వస్తోందని. నిజానికి పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్, బాలయ్య-కేఎస్ రవికుమార్ ల సినిమాల వుండగా రాజ్ తరుణ్ సినిమా వేయాలంటే సమ్ థింగ్ స్పెషల్ వుండాలి. ముఖ్యంగా సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించేలా వుండాలి.

కానీ రాజుగాడు సబ్జెక్ట్ అలాంటిది కాదు. తనకు తెలియకుండానే, అలా అలా దొంగతనాలు చేసేయడం అన్న అలవాటు వున్న హీరో క్యారెక్టర్ అది. ఇలాంటి క్యారెక్టర్ లో ఫన్ వుండొచ్చు కానీ, ఫ్యామిలీలకు ఎంత వరకు పడుతుందన్నది చూడాలి. కానీ రంగుల రాట్నం సబ్జెక్ట్ సంక్రాంతికి సరైనది అని టాక్ వినిపిస్తోంది.

మరి నాగ్ మనసు తెలిసి కూడా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ఎందుకు పోటీకి దిగినట్లో? పైగా ఎకె కు సంక్రాంతి లాంటి సీజన్ లో పెద్ద సినిమాలను ఢీకొని థియేటర్లు తెచ్చుకోవడం కాస్త కష్టమే. సీడెడ్, ఈస్ట్ లో మాత్రమే ఆ సంస్థకు కాస్త పట్టుంది. అదే అన్నపూర్ణకు అయితే కాస్త గట్టి నెట్ వర్క్ నే వుంది. పైగా సురేష్ మూవీస్ సపోర్టు దొరుకుతుంది. రాజ్ తరుణ్ ఈ విషయంలో ఎటూ మొగ్గడం లేదని తెలుస్తోంది.