రివ్యూ: రాజుగారి గది 2
రేటింగ్: 2.75/5
బ్యానర్: పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్
తారాగణం: నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్, రావు రమేష్, నరేష్, అభినయ తదితరులు
మాటలు: అబ్బూరి రవి
కూర్పు: మధు
సంగీతం: ఎస్.ఎస్. తమన్
ఛాయాగ్రహణం: ఆర్. దివాకరన్
నిర్మాణం: పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం: ఓంకార్
విడుదల తేదీ: అక్టోబర్ 13, 2017
హారర్ కామెడీలు అంటేనే ఒక వర్గం ప్రేక్షకులని విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఈమధ్య కాలంలో ఇంతటి సక్సెస్ రేషియో వున్న జోనర్ ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇక హారర్ కామెడీ జోనర్‌కి క్రౌడ్ పుల్లింగ్ స్టార్ కాస్ట్ కూడా తోడయితే దానికుండే ఆకర్షణ శక్తే వేరు. నాగార్జున, సమంత లాంటి పెద్ద స్టార్స్ చాలరన్నట్టు ఈ సినిమాకి టైటిల్ కూడా 'రాజుగారి గది 2' అని పెట్టారు.
ఇప్పటికే మాస్లో బాగా క్లిక్ అయిన సినిమా బ్రాండింగ్ వాడినపుడు వున్న ఆకర్షణలకి మరింత అయస్కాంత శక్తి జోడించినట్టే. ఈ సినిమా వరకు మెయిన్ సక్సెస్ ఇదేనని చెప్పవచ్చు. నాగార్జున, సమంతని స్టార్ కాస్ట్లో భాగం చేయడం దీనికి అతి పెద్ద ప్లస్ పాయింట్. వాళ్లిద్దరూ ఈ 'అతి సాధారణ హారర్ కథ'కి తమ ప్రెజెన్స్, పర్ఫార్మెన్స్తో వెయిట్ తెచ్చారు. ఇక రాజుగారి గది 2 అంటూ కథకి సంబంధం లేకుండా టైటిల్ పెట్టినా కానీ మాస్‌ని థియేటర్ల వైపు నడిపించడానికి పేరు బలం కలిసొస్తుంది.
మలయాళంలో హిట్టయిన ప్రేతమ్ కథకి కాస్త మేకప్ వేసి రీమేక్ చేసిన 'రాజుగారి గది 2' నుంచి భయపెట్టే హారర్ లేదా కడుపుబ్బ నవ్వించే హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే డిజప్పాయింట్ అవ్వాల్సిందే. హారర్ బొత్తిగా లేని ఈ చిత్రంలో కామెడీ కూడా పండలేదు. అడపాదడపా వెన్నెల కిషోర్, ప్రవీణ్ నవ్వించినా కానీ ఈ జోనర్ సినిమాల్లో వుండే స్థాయి హాస్యమైతే ఖచ్చితంగా లేదు.
ప్రధానంగా ఇదో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో కూడిన మిస్టరీ డ్రామా. ప్రధాన తారాగణం, సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు, నిర్మాణ విలువలు, డీసెంట్ విజువల్ ఎఫెక్ట్స్‌తో 'అదనపు హంగులు' బాగా కుదిరిన ఈ చిత్రానికి కథ, కథనాలు మాత్రం నాసిరకంగా వున్నాయి. కథాపరంగా ఎలాంటి కొత్తదనం లేకపోగా, కథనం మరీ బలహీనంగా వుంది. సన్నివేశాలని అలా పేర్చుకుంటూ పోయినట్టుంటుందే తప్ప ఒక స్ట్రక్చర్డ్ స్క్రీన్‌ప్లే కనిపించదు.
ఉదాహరణకి నాగార్జున ఇంట్రడక్షన్ సీన్ తీసుకుంటే… తమ రిసార్ట్‌లో దెయ్యం వుందని ముగ్గురు వచ్చి తనకి చెప్పుకుంటారు. వారితో పాటుగా అతను ఆ రిసార్ట్‌కి వెళ్లడం కాకుండా, మధ్యలో ఒక మర్డర్ మిస్టరీ చేధించి వస్తాడు. ఈలోగా ఆ ముగ్గురూ మళ్లీ ఆ రిసార్ట్‌కే వెళ్లి కావాలని దెయ్యం కోసం ఎదురు చూస్తున్నారా అన్నట్టు 'కామెడీ' చేస్తుంటారు. ఆ తర్వాతి సీన్లో కానీ నాగార్జున ఆ రిసార్ట్‌కి రాడు. ఫలానా మెంటలిస్ట్ రుద్ర (నాగార్జున) అని చెప్పగానే, అతని పాత్ర ఇంట్రడక్షన్‌కి ఆ మర్డర్ మిస్టరీ సీన్ వాడుకుని ఉండొచ్చు. వీళ్ల గోడు చెప్పుకోగానే సరాసరి వారితోనే అక్కడికి వచ్చి ఉండొచ్చు. కానీ అలా స్ట్రక్చర్ లేకుండా తోచిన విధంగా సీన్లు పేర్చుకుంటూ పోవడం ప్రథమార్ధం అంతటా కనిపిస్తుంది.
రిసార్ట్‌లో ఒక సీన్, వెంటనే షకలక శంకర్ కామెడీ సీన్, మళ్లీ అటునుంచి రిసార్ట్‌లో సీన్, ఒక హారర్ సీన్, వెంటనే దాని ఇంపాక్ట్ పోగొడుతూ ఇంకో నాసిరకం సీన్… ఇలా కంగాళీగా సాగే కథనం నాగార్జున రిసార్ట్‌లోకి ఎంటరయ్యాక కానీ ఒక దారికి రాదు. అయితే ఇంటర్వెల్ తర్వాత హారర్, కామెడీ పూర్తిగా సైడ్ ట్రాక్ అయి దెయ్యం (సమంత) తాలూకు గతం గురించిన వాకబుతోనే సరిపోతుంది. సమంత కథ పూర్తిగా ఎమోషనల్‌గా వుండేసరికి ఇక హాస్యానికి వీల్లేకుండా పోయింది.
ఆమె ఎందుకు చనిపోయిందనే పాయింట్లో కూడా కొత్తదనం లేదు. చాలా సినిమాల్లో చాలా సందర్భాల్లో చూపించిన పాయింటే. కాకపోతే సమంత ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్, నాగార్జున కన్విన్సింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల పతాక సన్నివేశాలు రక్తికట్టాయి. క్లయిమాక్స్ సీన్లో సమంత, నాగ్ మధ్య జరిగే సంభాషణ రిలేటివ్గా వుంది. ముఖ్యంగా మహిళలని ఆకట్టుకునే సెంటిమెంట్ బాగా కుదిరింది. రచయితగా అబ్బూరి రవి ఈ సీన్స్‌లో తన అనుభవం చూపించాడు. ఓంకార్ కూడా ఈ సీన్స్ చిత్రీకరణలో మెచ్యూరిటీ కనబరిచాడు.
రాజుగారి గది చిత్రంలో మాస్ కామెడీ పండించిన ఓంకార్ ఈసారి అలా నవ్వించే సన్నివేశాలు సృష్టించలేకపోయాడు. సమంత దెయ్యంగా కూడా పాసివ్గానే వుండడంతో ఎఫెక్టివ్ హారర్ సీన్స్‌కి కూడా చోటు లేకపోయింది. తమన్ నేపథ్య సంగీతం వల్ల పలు సన్నివేశాల్లో వున్న కంటెంట్ కంటే ప్రభావవంతంగా కనిపించాయి. నాగార్జున, సమంతల స్టార్ ఎట్రాక్షన్‌కి తోడు 'మామ-కోడలు' ఫ్యాక్టర్ ఈ చిత్రం బలహీనతల్ని కొంతవరకు కప్పిపుచ్చుతుంది.
పతాక సన్నివేశాల్లో 'చిట్టితల్లి' అంటూ సమంతతో నాగార్జున జరిపే సంభాషణ వారి మధ్య వున్న నిజ జీవితంలో వున్న బంధం వల్ల మరింత ఎఫెక్టివ్‌గా వినిపిస్తుంది. హారర్ కామెడీ చూడాలని వెళ్లిన వారికి ఫైనల్‌గా ఒక ఎమోషనల్ డ్రామాతో కూడిన ఘోస్ట్ స్టోరీ మాత్రం సాక్షాత్కరిస్తుంది. సెకండ్ హాఫ్‌ని టైట్‌గా హ్యాండిల్ చేయడం వల్ల ఓవరాల్‌గా పాస్ మార్కులు స్కోర్ చేసే ఈ చిత్రానికి ఇనీషియల్‌గా వచ్చే పుల్తో బాక్సాఫీస్ పరంగా ఇబ్బందులేమీ ఎదురు కాకపోవచ్చు. అయితే అదనపు హంగులు మినహాయిస్తే మాత్రం సినిమాగా 'రాజుగారి గది 2' ప్రేక్షకుల అంచనాలకి మాత్రం తగ్గట్టు లేదు.
బాటమ్ లైన్: అలంకరణే తప్ప అసలు నాస్తి!
– గణేష్ రావూరి