బాలకృష్ణ-కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో సి కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం షూట్ చకచకా సాగిపోతోంది. సంక్రాంతికి విడుదల చేయాలన్నది లక్ష్యం. ఈ సినిమాకు ఇప్పటి దాకా వర్కింగ్ టైటిళ్లు రెండు వినిపిస్తూ వచ్చాయి. ఒకటి జయసింహ. రెండవది లక్ష్మీనరసింహారెడ్డి. కానీ ఇప్పుడు మరో టైటిల్ తెరపైకి వచ్చింది.
దాదాపు ఈ టైటిల్ ఫిక్స్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ మూడో టైటిల్ కాస్త ఆసక్తికరంగానే వుంది కూడా. ఇంతకీ ఆ టైటిల్ మరేంటో కాదు. 'కర్ణ'. నిజానికి ఈ టైటిల్ చాలా పాపులర్ టైటిల్. శివాజీ గణేషన్, ఎన్టీఆర్ లు పౌరాణిక పాత్రల్లో నటించినపుడు వాడిన టైటిల్.
కొన్నాళ్ల క్రితం సీనియర్ అర్జున్ డబ్బింగ్ సినిమా ఒకటి ఇదే టైటిల్ లో వచ్చింది. కానీ ఆ విషయం పెద్దగా జనాలకు గుర్తు లేదు. ఇప్పుడు కర్ణ టైటిల్ ను బాలయ్య 102వ సినిమాకు ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కర్ణ టైటిల్ కచ్చితంగా పవర్ ఫుల్ టైటిల్ నే. అందులో సందేహం లేదు. బాలయ్య కర్ణ సినిమా వస్తోంది అంటే ఆ బజ్ వేరుగా వుంటుంది. బహశా ఆ ఉద్దేశంతోనే దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ టైటిల్ ను కూడా ఓ ఆప్షన్ లా తీసుకున్నారేమో?