దర్శకుడు రాజమౌళి ఓ ఫామ్ హవుస్ కట్టుకుంటున్నారు. నల్గొండ సమీపంలోని పల్లెటూరి దగ్గర ఆయనకు 80ఎకరాల భూమి వుంది. దానికి కలుపుకునే నిర్మాత సాయి కొర్రపాటికి పది ఎకరాలు, సంగీత దర్శకుడు కీరవాణికి మరో పది ఎకరాలు వున్నాయి. ఇప్పుడు ఈ భూమిలోనే రాజమౌళి చిన్న నాచురల్ హవుస్ ను నిర్మించుకుంటున్నారు.
పక్కా ఇల్లే కానీ, పెంకిటిల్లులా కనిపిస్తుంది. సహజమైన గాలి, వెలుతురు వచ్చే విధంగా డిజైన్ చేసుకున్నారు. మొత్తం ఫ్లోర్ ఏరియా నాలుగువేల చదరపు అడుగులు వుంటుంది. నాలుగు డబుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ల పెట్టు అన్నమాట. స్విమ్మింగ్ పూల్ లాంటి విలాసాలు ఏమీ వుండవు. కనీస సదుపాయాలు అన్నీ వుంటాయి. సమయం దొరికినపుడల్లా వెళ్లి వుండడానికి వీలుగా నిర్మించుకుంటున్నారు. అయితే రాజమౌళి అత్తగారు మాత్రం అక్కడే వుండడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
80ఎకరాల పొలంలో నాలుగువేల స్క్వేర్ ఫీట్ ఇల్లు అంటే ఎంతో ప్లేస్ పట్టేయడదు. మహా అయితే 10సెంట్ల స్థలం పడుతుంది. ఎప్పుడో చాలా కాలం క్రితం రాజమౌళి తన మిత్రుడు సాయి కొర్రపాటి, బ్రదర్ కీరవాణిలతో కలిపి ఇది కొన్నారు. అక్కడ తుప్ప డొంక కొట్టించి, కాస్త రూపు తెచ్చి మొక్కలు నాటారు. ఆ విధంగా ఓ తోట తయారైంది. ఇప్పుడు అక్కడే ఇల్లు నిర్మిస్తున్నారు.
మరో రెండు మూడు నెలల్లో ఈ ఇంటి నిర్మాణం ఓ కొలిక్కి వస్తుందని వినికిడి. ప్రస్తుతం బాహుబలి 2 తరువాత దేశాలు తిరగడం అన్నది రాజమౌళికి విశ్రాంతి వ్యవహారంగా మారింది. ఫ్రస్తుతం శ్రీలంక ట్రిప్ ముగిసింది. ఇక ఇక్కడే వుంటి ఇంటి నిర్మాణం, తరువాతి ప్రాజెక్టు వంటి వ్యవహారాలపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది.