మొన్నటివరకు బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తో కలిసి అమెరికాలో చక్కర్లుకొట్టింది. అతడి పుట్టినరోజును న్యూయార్క్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. అలా విఘ్నేష్ తో సరదాగా గడిపిన నయనతార హ్యాపీ బ్రేక్ తర్వాత తిరిగి చెన్నై చేరుకుంది. మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.
ఈసారి తెలుగు సినిమాలకు కాల్షీట్లు కేటాయించింది నయనతార. ఇప్పటికే ప్రారంభమైన బాలకృష్ణ సినిమాతో పాటు చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డికి కాల్షీట్లు కేటాయించింది. కుంభకోణంలో భారీ షెడ్యూల్ పూర్తిచేసుకున్న బాలయ్య 102వ సినిమాకు సంబంధించి త్వరలోనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఆ షెడ్యూల్ లో నయనతార జాయిన్ అవుతుంది.
ఈ మూవీతో పాటు ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్న సైరా నరసింహారెడ్డి రెగ్యులర్ షూటింగ్ లో కూడా నయనతార పాల్గొంటుంది. ఈ సినిమాకు సంబంధించి ఆర్ట్ డైరక్టర్ రాజీవన్ నేతృత్వంలో హైదరాబాద్ నానక్ రామ్ గూడలో పెద్ద విలేజ్ సెట్ వేశారు. ఈ సెట్ లోనే చిరంజీవి-నయన్ మధ్య సన్నివేశాలు తీయబోతున్నారు.
బాలకృష్ణ సినిమాకు సంబంధించి రామోజీ ఫిలింసిటీలో జరిగిన షెడ్యూల్ ను పూర్తిచేసిన నయనతార.. చిరంజీవి సినిమాకు ఎన్ని కాల్షీట్లు ఇచ్చిందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ రెండు సినిమాలతో పాటు అటు తమిళ్ లో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ లో నటించేందుకు అంగీకరించింది నయన్.