స్పైడర్ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి తిరస్కారమే ఎదురవుతోంది. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా వసూళ్లు మొదటి రోజు మ్యాట్నీ నుంచే తిరోగమనం దిశగా సాగుతున్నాయి. ప్రీ ఫెస్టివల్ పీరియడ్ ప్రభావమని బయ్యర్లు ఇంకా ఆశలు వదులుకోలేదు కానీ రికవరీ చాలా ఎక్కువ వున్న నేపథ్యంలో ఇలాంటి డల్ స్టార్ట్ కరక్ట్ కాదు.
తమిళంలో మాత్రం ఈ చిత్రానికి మంచి వసూళ్లతో పాటు ఎక్కువ మంది ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. మహేష్‌కి అక్కడ స్టార్‌డమ్ లేకపోవడమే 'స్పైడర్'ని కేవలం ఒక సగటు సినిమాలా ట్రీట్ చేయడానికి కారణమవుతోందని, మహేష్ ఇందులో తన స్టార్ స్టేటస్‌కి తగ్గ పాత్ర చేయకపోవడం వల్లే తెలుగులో ఇంతటి తిరస్కారం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆదినుంచీ తమిళ వెర్షన్ ప్రమోషన్ మీదే మహేష్, మురుగదాస్ ఫోకస్ పెట్టారు. మహేష్ స్టార్‌డమ్ తెలుగు వెర్షన్‌కి కొమ్ము కాస్తుందని భావించారు. అయితే ఈ చిత్రంలో మహేష్ ఒక స్టార్‌లా కాకుండా ఒక కామన్ మ్యాన్‌లా కనిపించబోతున్నాడని మాత్రం రిజిష్టర్ చేయలేదు. ఫాన్స్‌ని అయితే అస్సలు ప్రిపేర్ చేయలేదు. మురుగదాస్ డైరెక్షన్‌లో హీరో స్పై అంటే ఏవో వింతలు, విశేషాలు వుంటాయని భావించారు.
తీరా ఇది విలన్ ఎస్‌జె సూర్య సినిమా అయిపోవడం, మహేష్‌కి స్ట్రాంగ్ క్యారెక్టర్ లేకపోవడంతో ఫాన్స్‌తో సహా ఎక్కువమంది నుంచి పెదవి విరుపులు వస్తున్నాయి. దీనికి తోడు సినిమాపై ఆసక్తి రేపడానికి విడుదల చేసిన ఆర్టిఫిషియల్ స్పైడర్ టీజర్ కూడా రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేసింది. ఖలేజా, 1 నేనొక్కడినే తర్వాత మరోసారి మహేష్ సినిమా ప్యాకేజింగ్ లోపంతో మిస్‌ఫైర్ అయింది.