కమల్ హాసన్-శంకర్ లాంటి మెగా కాంబినేషన్ తో భారతీయుడు 2 సినిమా చేయాలని డిసైడ్ అయిపోయారు. దిల్ రాజు. దసరా నాడు 11గంటల సమయంలో చెన్నయ్ నుంచి ఈ సంచలన వార్త ప్రకటించాలని ముచ్చటపడ్డారు. అర్జెంట్ గా శుక్రవారం బయల్దేరి చెన్నయ్ వెళ్లారు.
కానీ ఈ వార్త ట్విట్టర్ లో శనివారం ఉదయాన్నే ప్రత్యక్షమైపోయింది. ట్విట్టర్ లో ఈ వార్త లీక్ అయిపోయేసరికి, దాన్ని ట్వీట్ చేసిన వాళ్లకి ఫోన్ లు చేసి, తీయించాలని దిల్ రాజు యూనిట్ కిందా మీదా పడింది. మొత్తానికి తీయించగలిగింది.
కానీ అంతలోనే ఈ వార్త స్ప్రెడ్ అయిపోయింది. ఆ వార్త చకచకా సోషల్ నెట్ వర్క్ లోకి, అక్కడి నుంచి వెబ్ సైట్లలోకి వచ్చేసింది. సంచలనంగా 11గంటల సమయంలో ప్రకటిద్దామనుకున్న వార్త కాస్తా, సాదా సీదాగా బయటకు వచ్చేసింది.
ఇదిలా వుంటే ఉభయ భాషల్లో ఈ సినిమాకు దిల్ రాజే నిర్మాతగా వ్యవహిరిస్తారని తెలుస్తోంది. వర్తమాన రాజకీయాలు, అవినీతి, కుట్రలు తదితర అంశాల నేపథ్యంలో శంకర్ కథను తయారుచేయించినట్లు వినికిడి.
అందుకే భారతీయుడు 2 అని టైటిల్ వినిపిస్తోంది. రజనీ తో రోబో సీక్వెల్ తయారు చేసిన శంకర్, కమల్ తో భారతీయుడు సీక్వెల్ చేయబోతున్నారన్నమాట. అసలే పోలిటికల్ ఎంట్రీ తో బిజీగా వున్న కమల్ కు ఈ సినిమా మాంచి హెల్ఫ్ అవుతుందేమో?