ప్రేమ కథా చిత్రమ్, కొత్త జంట, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం అన్ని సినిమాలు నిర్మాతలను హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసినవే. కొన్ని నాలుగు డబ్బులు కళ్ల చూసేలా చేస్తే, మరి కొన్ని మంచి లాభాలు పండించాయి. అయినా యంగ్ టాప్ హీరోలకు డైరక్టర్ మారుతి ఆనలేదనే చెప్పాలి.
దీనికి రెండు కారణాలు. ఒకటి మారుతి తన సినిమాలను మీడియం బడ్జెట్ లోనే చేస్తాడు. చాలా తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వడంలో ఆయన ఘనాపాఠి. సినిమా చూస్తే రిచ్ లుక్ వుంటుంది. ఖర్చు చూస్తే మీడియంగా వుంటుంది. ప్రొడక్షన్ సైడ్ కూడా బాగా అనుభవం వుండడం అన్నది మారుతికి కలిసివచ్చింది.
మహానుభావుడు సినిమా చూసిన వాళ్లు ఆ క్వాలిటీ చూసి, 11కోట్లలో తయారైందని వింటే చాలా హ్యాపీగా ఫీలవుతారు. కానీ యంగ్ టాప్ హీరొలకు మాత్రం ఈ మీడియం బడ్జెట్ సినిమాలు ఆనడం లేదేమో అన్నది ఒక కారణం.
ఇక మారుతి అంటే ఇంకా, ఈరోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ లాంటి చిన్న సినిమాల డైరక్టర్ గానే యంగ్ టాప్ హీరోలకు కనిపిస్తున్నాడేమో అన్నది మరో అనుమానం. అయితే ఇప్పుడు మహానుభావుడు హిట్ తో కచ్చితంగా సీన్ మారుతుందని ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే భలే భలే సినిమా టైమ్ కు నానికి ఇప్పుడు వున్నంత కేక్ వాక్ లేదు. అలాగే మహానుభావుడు టైమ్ లో కూడా శర్వానంద్ సరైన హిట్ కోసం చూస్తున్నాడు. ఈ రెండు సినిమాల హీరో క్యారెక్టర్లు ఇప్పటి దాకా తెలుగు తెరపై రానివే.
అసలే తెలుగు యంగ్ టాప్ హీరోలు సరైన కథల కోసం దుర్భిణీ వేసి వెదుకుతున్నారు. నాగ చైతన్యతో మారుతి సినిమా చేసే సన్నాహాల్లో వున్నారు. ఇప్పుడు మహానుభావుడు హిట్ యంగ్ టాప్ హీరోల కళ్లు మారుతిపైకి మళ్లేలా చేసింది.
మహానుభావుడు విడుదల కన్నా ముందు నుంచే బన్నీ మారుతితో సినిమా చేయాలని ఆసక్తితో వున్నాడు. ఈ మేరకు డిస్కషన్లు నడుస్తున్నాయి. రామ్ చరణ్ తో యువి క్రియేషన్స్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటోంది. ఆ సినిమా కూడా మారుతితో వుండే అవకాశం వుందని వినికిడి. అఖిల్ తో సినిమా చేసే అవకాశం వుందని మారుతినే చెప్పారు.
అసలే తెలుగులో సక్సెస్ ఫుల్ డైరక్టర్ల కొరత ఎక్కువగా వుంది. సో ఇక సక్సెస్ ఫౌండేషన్ పడిపోయింది. అందువల్ల మారుతి టైమ్ స్టార్స్ నౌ అనుకోవాలి.