డైరక్టర్ తేజ ఇప్పడు బాలయ్య తో చర్చలు సాగిస్తున్నారు. ఇది ఇప్పటికే బయటకు వచ్చిన వార్త. అయితే ఈ చర్చలు దేని కోసం? ప్రస్తుతం కేఎస్ రవికుమార్ తో చేస్తున్న జయసింహ (వర్కింగ్ టైటిల్ అనుకోవాలి) సినిమా తరువాత ప్రాజెక్టు కోసమేనా? వినవస్తున్న వార్తల ప్రకారం సంక్రాంతి లోగానే మరో సినిమాకు క్లాప్ కొట్టేయాలని బాలకృష్ణ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు చేస్తున్న సినిమా 102వ ప్రాజెక్టు. ఇది సంక్రాంతి విడుదలకు రెడీ చేస్తున్నారు. మహా అయితే అక్టోబర్ నెలాఖరుకు ప్రొడక్షన్ వర్క్ అయిపోతుందని తెలుస్తోంది. నవంబర్, డిసెంబర్ నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కు వుండనే వుంటాయి. సరైన ప్రాజెక్ట్ సెట్ అయితే డిసెంబర్ లో 103వ సినిమా స్టార్ట్ చేయాలని బాలకృష్ణ చూస్తున్నారు. 103వ సినిమా కనుక ఇప్పడు స్టార్ట్ చేస్తే, 2018లో మూడు సినిమాలు విడుదల చేసుకునే అవకాశం వుంటుంది.
అయితే కీలక విషయం ఏమిటంటే, తేజతో బాలకృష్ణ డిస్కషన్లు రెగ్యులర్ సినిమా కోసమా? తను తలపెట్టిన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ కోసమా అన్నది అనుమానం. ఎన్టీఆర్ బయోపిక్ ను తేజ చేతిలో పెట్టే ఆలోచనలో బాలయ్య వున్నారని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. అందుకే డిస్కషన్లు సాగిస్తున్నారని, ఈ సంగతి తెలిసే, రామ్ గోపాల్ వర్మ, హడావుడిగా తన స్టయిల్ ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పోస్టర్ వదిలేసారని టాక్ వినిపిస్తోంది.
స్క్రిప్ట్ సరైనది వుంటే డీల్ చేయడంలో తేజకు సమస్యలు ఏమీ లేవు. ఇప్పటికే బాలయ్య పర్యవేక్షణలో ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ కు ఓ రూపం అంటూ వచ్చి వుంది. అందువల్ల తేజను ఆప్షన్ గా బాలయ్య అనుకుంటున్నారేమో? కొన్నాళ్లు వేచి వుంటే అసలు సంగతి బయటకు వస్తుంది.