జై లవకుశ సినిమా విడుదల కాకుండానే డైరక్టర్ బాబీ వెళ్లి హీరో బన్నీకి కథ చెప్పేసాడని, ఇంకేం లేదు సినిమా అంటూ వార్తలు వచ్చేసాయి. కానీ తీరా సినిమా విడుదలయిన తరువాత మరి ఆ వార్తలు పక్కకు పోయాయి. ఇప్పుడు తనకు తొలి అవకాశం ఇచ్చిన రవితేజతో సినిమా అంటూ వార్తలు పుట్టాయి. ఓ సినిమా అయిన తరువాత డైరక్టర్లకు ఫలానా సినిమా.. ఫలానా హీరో అంటూ గ్యాసిప్ లు పుట్టడం కామన్ అయిపోయింది.
డిజె సినిమా విడుదల టైమ్ లో డైరక్టర్ హరీష్ శంకర్ విషయంలో ఇలాగే తెగ వార్తలు వినిపించాయి. మహేష్ బాబు , ఎన్టీఆర్ అంటూ. కానీ ఇప్పుడేమయింది. కొత్తవాళ్లతో సినిమా అమెరికాలో లొకేషన్ల వేట అన్నారు. అది కూడా చల్లబడింది. బాబీ వ్యవహారం చూస్తుంటే అర్జెంట్ గా హీరో కోసం వెదుకులాడుతున్నట్లు కనిపిస్తోంది.
కానీ సర్దార్ గబ్బర్ సింగ్ టైమ్ లో పవన్ కళ్యాణ్ జోక్యం వల్ల సరిగ్గా చేయలేదేమో అనుకున్నారు. జైలవకుశ చూసాక, ఆ సబ్జెక్ట్ కు బాబీ స్టామినా సరిపోలేదని, మంచి లైన్ ను మంచి స్క్రిప్ట్ గా మార్చలేకపోయాడని విమర్శలు వినవచ్చాయి. మరి అలాంటపుడు ఏ హీరో అవకాశం ఇస్తాడో చూడాలి.
నిజానికి జైలవకుశ కథ ఎన్టీఆర్ కు చెప్పినపుడు కూడా కథ ఇచ్చేమని ఎంతో అడిగారని, ఇవ్వకపోవడంతో డైరక్షన్ చాన్స్ ఇచ్చారని గుసగుసలు వినిపించాయి. మరి ఇప్పుడు కూడా అలా మాంచి పాయింట్, కథ తయారుచేసుకుంటే, ఏ హీరో అయినా చాన్స్ ఇస్తారేమో?
ప్రస్తుతం రవితేజ సినిమా ఫినిష్ చేసి వున్నాడు. శ్రీను వైట్ల ఒక్క అదే రవితేజతో చాన్స్ కోసం చూస్తున్నాడు. వివి వినాయక్ ఓ సినిమా చేసే అవకాశం వుందని టాక్ వుండనే వుంది. ఇప్పుడు బాబీ పోటీ వస్తున్నాడన్నమాట.