పెద్ద సినిమాలు విడుదలైతే హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర సందడి కామన్. ఒక్కపక్క ఫ్యాన్స్, మరోపక్క సినిమా సెలబ్రిటీలు, ఇంకో పక్క ఆడియన్స్ ఒపీనియన్ కోసం వంద మంది వరకు మీడియా జనాలు అక్కడకు చేరతారు. అయితే ఎన్టీఆర్ జై లవకుశ సందర్భంగా ఐమాక్స్ దగ్గర దాదాపు రెట్టింపు సందడి నెలకొనడం విశేషం. పైగా మార్నింగ్ 8.45 షో కి పెద్దగా మహిళలు రారు. వస్తే మహా అయితే టీనేజ్ అమ్మాయిలు మాత్రం వస్తారు.
కానీ ఈసారి ఉదయాన్నే వేసే ఈ ఆటకే ఫ్యామిలీలతో చాలా మంది హాజరుకావడం విశేషం. ఇంకా చిత్రమేమిటంటే, బయట మీడియా కెమేరాల ముందు అందరూ ఒపీనియన్ చెప్పరు. ముఖ్యంగా నడివయసు మహిళలు. కానీ అలాంటిది ఈ సినిమాకు పోటీ పడి మరీ ఎన్టీఆర్ నటన గురించి చెప్పడానికి నడివయసు మహిళలు ముందుకు రావడం విశేషం.
మరోపక్క దాదాపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో 'తల్లి, తండ్రి, తారక్' అనే స్లోగన్ లు ఫ్రంట్ సైడ్, వెనక వైపు జై లవకుశ స్టిల్ వున్న వై టీ షర్ట్ లతో హాజరయ్యారు. ఈ అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో వుండడంతో అంతమంది జనాల్లో కూడా ఓ ఆకర్షణగా కనిపించింది. దాదాపు మూడు నాలుగు స్క్రీన్లు ఒకేసారి ప్రారంభించడం, వదలడం చేయడంతో లోపలకు వెళ్లడానికీ, బయటకు రావడానికీ సమస్య కావడంతో ఐమాక్స్ సిబ్బంది కిందా మీదా పడాల్సి వచ్చింది.