సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. హీరోయిన్ ఎవరనే విషయాన్ని కూడా పక్కా చేయలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా తెలీదు. కానీ మార్కెట్లో సాహో సినిమా ఇప్పుడో హాట్ కేక్. ఈ మూవీ రైట్స్ దక్కించుకునేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ అనే సంస్థ ఏకంగా 50కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
ఆన్ లైన్ లో సాహో సినిమా ప్రసార హక్కులకు సంబంధించి ఇంత భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చింది నెట్ ఫ్లిక్స్. బాహుబలి-2తో నేషన్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఇందులో హీరోగా నటిస్తుండడం ఒక కారణం అయితే.. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తుండడం మరో కారణం. ఈ 3 భాషల ఆన్ లైన్ ప్రసార హక్కులకు కలిపి 50కోట్లు ఆఫర్ చేసిందట సదరు సంస్థ.
అయితే ప్రస్తుతానికి డీల్ ఇంకా సెట్ అవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు అమెజాన్ కూడా బరిలో దిగడంతో, రేటు ఇంకాస్త పెరిగే అవకాశముంది. అందుకే యూవీ క్రియేషన్స్ సంస్థ వేచిచూసే ధోరణి అవలంబిస్తోంది. సాహో కోసం 150కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది ఈ బ్యానర్.
ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ 25కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఇప్పుడు సాహో కోసం ఏకంగా 50కోట్లు ఆఫర్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.