రివ్యూ: నేనే రాజు నేనే మంత్రి
రేటింగ్: 2.75/5
బ్యానర్: బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్
తారాగణం: రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, క్యాథరీన్, అశుతోష్ రాణా, నవదీప్, శివాజీ రాజా, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, జయప్రకాష్ రెడ్డి తదితరులు
సంభాషణలు: లక్ష్మీభూపాల్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: వెంకట్ సి. దిలీప్
నిర్మాతలు: డి. సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
కథ, కథనం, దర్శకత్వం: తేజ
విడుదల తేదీ: ఆగస్ట్ 11, 2017
ఒకప్పుడు సంచలనాలతో ట్రెండ్ సెట్టర్‌గా మారిన దర్శకుడు తేజ వరుస పరాజయాలతో కనుమరుగై, రెండు నిమిషాల ట్రెయిలర్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. ఒక్క ట్రెయిలర్‌తో సోషల్ మీడియాలో 'నేనే రాజు నేనే మంత్రి' వైరల్ అయిపోయింది. జోగేంద్రగా రానా దగ్గుబాటి గెటప్, డైలాగ్స్… ట్రెయిలర్ చూసిన చాలా మందికి 'మస్ట్ వాచ్' అనే ఫీల్ కలిగించాయి. విశేషమైన అంచనాలు రేకెత్తించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాగా ఆ ట్రెయిలర్‌ని దాటి మరేమీ చూపించలేకపోయింది.
వర్తమాన రాజకీయాలపై రియలిస్టిక్ టేక్ వుంటుందని అనిపించిన సినిమా కాస్తా అసహజత్వానికి నిలువెత్తు నిదర్శనంలా మారింది. 'జోగేంద్ర'గా రానా దగ్గుబాటిని ఎంచుకోవడం తేజ సక్సెస్. ఈ క్యారెక్టర్లో తనని తాను చూసుకోగలగడం రానా సక్సెస్. కానీ జోగేంద్ర క్యారెక్టరైజేషన్ దాటి ఆలోచించలేకపోవడం తేజ మిస్టేక్ అయితే, రానాని మించి రైజ్ అవలేకపోవడం ఈ సినిమాకి మైనస్.
'జయం' టెంప్లేట్ నుంచి బయటకి రావడానికి చాలా కాలం మొరాయించిన తేజ ఫైనల్‌గా ఒక కొత్త బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకున్నాడు. రాజకీయ నేపథ్యంలో ఒక వ్యక్తి రైజ్ అండ్ ఫాల్‌ని కథాంశంగా ఎంచుకుని తనదైన శైలిలో ఒక యారొగెంట్, రూత్‌లెస్ లీడ్ క్యారెక్టర్ని రాసుకున్నాడు. ఇంతవరకు అంతా భేష్. అయితే ఆ క్యారెక్టర్ని అమితంగా ప్రేమించడం వలనో, దానిని దాటి ఆలోచించలేకపోవడం వలనో జోగేంద్ర తప్ప 'నేనే రాజు నేనే మంత్రి'లో మరేమీ లేకుండా పోయింది. రాజకీయ రంగంలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చి నాయకుడిగా ఎదగడం అనేది ఎంత కష్టమనేది తెలిసిన సంగతే. అదంతా సినిమాటిక్‌గా చూపిస్తూ జోగేంద్రకి పాలిటిక్స్ కేక్ వాక్ అన్నట్టు భావన కలిగించారు.
సర్పంచ్ నుంచి మొదలు పెట్టి మినిస్టర్ వరకు ఎదిగే జోగేంద్ర దొరికిన వాడిని దొరికినట్టు చంపుకుంటూ పోతాడు. రానా క్యారెక్టర్లోకి లీనమైపోయి జోగేంద్రగా పరకాయ ప్రవేశం చేసేయడంతో అతని యాక్ట్ వరకు కన్విన్సింగ్‌గా వుంటుంది. చూపించే డ్రామా అంతా అసహజంగా అనిపిస్తున్నా, తన అభినయంతో, ఆంగీకంతో, 'ఆకారం'తో ఇంట్రెస్ట్ లెవల్స్ డ్రాప్ అవకుండా రానా హోల్డ్ చేసాడు. ఆరున్నర అడుగుల ఆజానుబాహుడైన రానా ఆ పొలిటీషియన్ గెటప్‌లో హైస్పీడ్ షాట్స్‌లో నడిచొస్తూ వుంటే కథ, కథనాల్లో వున్న లొసుగుల్లో చాలా వరకు కనిపించకుండా పోయాయి.
ఇంత మంచి క్యారెక్టర్ సృష్టించిన తేజ, రాజకీయ నేపథ్యంలో చిక్కని డ్రామా పండించినట్టయితే ఈ చిత్రం వేరే లెవల్లో వుండేది. ముఖ్యంగా ప్రతినాయక పాత్రలు సృష్టించడంలో సిద్ధ హస్తుడైన తేజ ఈ నాయకుడి బలాన్ని మరింతగా చూపించే ప్రత్యర్ధి పాత్రని తీర్చి దిద్దలేకపోవడం ఈ చిత్రానికి అతి పెద్ద బలహీనతగా మారింది. జయం, నిజం చిత్రాల్లోని ప్రతినాయక పాత్రలని అంత రాక్షసంగా తీర్చిదిద్దిన తేజ ఇందులో తన నాయకుడికి సమవుజ్జీ అయిన విలన్ వుండాలని అనుకోకపోవడం విచిత్రమే. విలన్ లేకపోయే సరికి జోగేంద్ర పాత్రని ఇంకా గ్లోరిఫై చేసే వీల్లేకపోయింది. ఫస్ట్ హాఫ్ వరకు రానా నిలబెట్టగలిగినా కానీ ఆ తర్వాత ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడానికి అవసరమైన డ్రామా మిస్ అయింది. జోగేంద్ర కాకుండా వేరే పాత్రలు సృష్టించలేదని కాదు కానీ వాటిని సరిగ్గా వాడుకోలేదు.
జోగేంద్ర భార్య రాధకి (కాజల్) బలమైన ఒక్క సన్నివేశమూ లేదు. కేవలం జోగేంద్రకి ఆమె అంటే పిచ్చి ప్రేమ అన్నది తప్పిస్తే ఆ పాత్రని కథలో కీలకంగా మార్చడంలో విఫలమయ్యారు. అలాగే జోగేంద్ర నమ్మినబంటు శివ (నవదీప్) క్యారెక్టర్ చుట్టూ బోలెడంత డ్రామాకి, ఎమోషనల్ ఇంపాక్ట్‌కి స్కోప్ వుంది. ఆ పాత్ర మరణం కూడా ఎమోషనల్‌గా ఏమాత్రం కదిలించలేనంత వీక్‌గా దానిని తీర్చిదిద్దడంతో అత్యంత కీలకమైన ఒక ఎపిసోడ్ ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా మిగిలిపోయింది. ఇక మరో పాత్ర జర్నలిస్ట్ దేవికా రాణి (క్యాథరీన్).
ఆమెకి అసలు జోగేంద్ర అంటే ఎందుకంత పిచ్చి అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. డ్రామా పండించడానికి అవకాశమున్న పాత్రలు వున్నప్పటికీ ఆ దిశగా కథనం చిక్కబడలేదు. విలన్స్ వీక్ అయిపోవడంతో జోగేంద్ర పతనం కూడా రక్తి కట్టలేదు. జోగేంద్ర ఎదుగుదల ఎంత నల్లేరు మీద నడకలా వుంటుందో, అతని పతనం కూడా అంతే వేగంగా, ప్రభావం లేకుండా జరిగిపోతుంది.
ద్వితీయార్ధంలో డ్రామా లేకపోవడంతో నిస్సారంగా సాగిపోతున్న చిత్రాన్ని మరింత పేలవంగా మార్చేస్తూ జోగేంద్ర తన క్యాండిడేట్స్‌ని నిలబెట్టే దృశ్యాలు హాస్యాస్పదంగా తెరకెక్కాయి. పతాక సన్నివేశాలని మలిచిన విధానం వల్ల జోగేంద్ర తీసుకునే అతి పెద్ద నిర్ణయం కూడా పాయింట్‌లెస్‌గా మిగిలిపోయింది. తేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసాడని నమ్మకం కలిగేంతలోనే పేలవమైన పొలిటికల్ గేమ్‌గా షేప్ తీసుకోవడంతో ఒక మంచి ఆపర్చునిటీ వృధా పోయింది.
బాటమ్ లైన్: ఆకట్టుకోని కుర్చీలాట!
– గణేష్ రావూరి