ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత నాలుగున్నరేళ్లలో బటన్ నొక్కి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయడం తప్ప, మరే పని చేయలేదని విమర్శిస్తుంటారు. కానీ ఆ విమర్శలో ఎంత మాత్రం వాస్తవం లేదు. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది దిగ్గజ విశ్లేషకుల్ని, అంతర్జాతీయ మేధావుల్ని తయారు చేశారు. అలాగే రాజకీయ పార్టీల కండువాలు కప్పుకునేలా టీవీ చానళ్ల ప్రజెంటర్లని తీర్చిదిద్దిన ఘనత కూడా జగన్‌దే.
ఎల్లో మీడియా యజమానులు దిగంబరంగా నాట్యం చేస్తున్నారంటే… అదంతా వైఎస్ జగన్ గొప్పతనమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడితే చాలు, ఎల్లో మీడియానే ఏదో ఒక పదవి కట్టబెట్టి, వినేవాళ్లు, చూసేవాళ్లు అలసిపోయేలా స్టూడియోల్లో కూచోపెట్టుకోవడం గురించి గత నాలుగేళ్లుగా తెలిసిందే.
వైఎస్ జగన్‌పై నిత్యం అవాకులు చెవాకులు పేలుతూ దిగ్గజ మేధావులుగా జడ శ్రవణ్‌కుమార్, కొలికపూడి శ్రీనివాసరావు గుర్తింపు పొందారు. వీరిలో జడ శ్రవణకుమార్ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడిగా, అలాగే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా కొలికపూడి శ్రీనివాసరావు తమకు తాము సమాజ ఉద్ధారకులమని భావిస్తుంటారు. ఇంత కాలం జగన్‌ను తిట్టిపోసిన ఈ ఇద్దరి నేతల మధ్య ఇప్పుడు వార్‌కు తెరలేచింది.
ఇద్దరూ దళిత నేతలే. ఇద్దరు నాయకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను తమకిష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారనే విమర్శ వుంది. అంబేద్కర్‌ను వాడుకోవడం తమ జన్మహక్కుగా ఈ ఇద్దరు దళిత మేధావులు భావిస్తుంటారనే విమర్శ వుంది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరికీ గొడవెందుకో తెలియదు కానీ, సవాళ్లు విసుకునే వరకూ వెళ్లింది.
జడ శ్రవణ్‌కుమార్ మరికొంత దూకుడు ప్రదర్శించి… కొలికపూడి శ్రీనివాసరావును పేటీఎం కుక్క అని తీవ్రంగా తిట్టే వరకూ వెళ్లింది. అంతటితో ఆగలేదు. అమరావతిపై తనతో చర్చించేందుకు రావాలని కొలికపూడికి పరోక్షంగా జడ సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరిస్తూ… కొలికపూడి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఏముందంటే…
“జడ శ్రావణ్ కుమార్‌కు సవాల్ నవంబర్ 25వ తేదీన హైదరాబాదులో SAVE ANDHRA PRADESH నినాదంతో నేను ఒక సమావేశం నిర్వహించాను. ఆ సమావేశంలో, “అమరావతిని ప్రారంభించిన నాయకుడే పూర్తి చేస్తాడు. ఆ సామర్థ్యం కేవలం చంద్రబాబు నాయుడికే ఉంది…” అని నేను చెప్పాను. జడ శ్రవణ్ కుమార్ ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ…. అమరావతి గురించి, చంద్రబాబు నాయుడు గురించి, నేను మాట్లాడిన మాటలను తప్పుపడుతూ.. “చంద్రబాబు అమరావతిని నాశనం చేశాడని, ఎవరైనా డిబేట్ కి వస్తే నేను నిరూపిస్తా” అని సవాల్ విసిరాడు. ఆ వీడియోలో మేము నిర్వహించిన సభను కూడా విమర్శించాడు.
అయినప్పటికీ నేను మొదటి రోజు స్పందించలేదు. రెండో రోజు కూడా అదే యూట్యూబ్ ఛానల్ లో మరోసారి అమరావతి గురించి తీవ్రమైన విమర్శలు చేశాడు. రెండో వీడియో చూసిన తర్వాత… అతని సవాలును స్వీకరించి, తేదీ, సమయం మరియు వేదిక నిర్ణయించమని… ఫేస్బుక్ ద్వారా నేను స్పందించాను. ఈసారి మరింత తీవ్రమైన విమర్శలతో సవాలు చేస్తూ…. హైదరాబాదులో సభ నిర్వహించిన వాళ్లను “పేటీఎం కుక్కలు” అని సంబోధించాడు.
హైదరాబాదులో సభ నిర్వహించింది నేనే. ఆ సభ నిర్వహణకు సంబంధించిన పూర్తి బాధ్యత నాదే. అతని సవాలు స్వీకరించి ఫేస్బుక్లో స్పందించింది నేనే. జడ అడిగిన విధంగా, డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గం॥లకు, రాజధాని పరిధిలో తుళ్లూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు ఆహ్వానిస్తున్నాను. ఈ మొత్తం కార్యక్రమానికి జడ్జిగా దళిత మేధావి, మాజీ జడ్జి రామకృష్ణ వ్యవహరిస్తారు” అని కొలికపూడి పేర్కొన్నారు.
కొలికపూడి సవాల్‌ను జడ స్వీకరించి, అక్కడికి వెళ్తారా? లేదా? అనేది ఇప్పుడు చర్చ. కేవలం జగన్‌ను తిట్టడం వల్ల ఇద్దరు నేతల్ని నిత్యం ఎల్లో చానళ్లలో చూపడంతో, వాళ్లే ఇప్పుడు తాము పొలిటికల్ సెలబ్రిటీలుగా ఫీల్ అయ్యి రచ్చరచ్చ చేస్తున్నారు. తాజాగా వీళ్లిద్దరి మధ్య గొడవలు టీడీపీకి, ఎల్లో మీడియాకి తలనొప్పిగా తయారైంది. ఈ ఇద్దరు నేతల తీరు సమాజానికి గుణపాఠం అనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.