జనసేనను స్థాపించి పదేళ్లు అయ్యింది. ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఇంత వరకూ కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి. పార్టీ పెట్టిన మొదలు, పక్క పార్టీల పల్లకీలు మోయడానికే పవన్‌కు సమయం సరిపోవడం లేదు. జనసేనను స్థాపించిన వెంటనే 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి రాజకీయ పల్లకీ మోశారు. 2019కి వచ్చే సరికి బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని బరిలో దిగారు. రాజోలు ఒక్కచోటే జనసేన అభ్యర్థి గెలుపొందారు. జనసేనాని రెండు చోట్ల పోటీ చేసి భంగపడ్డారు.
2024 ఎన్నికలకు వచ్చే సరికి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో ఎంతో ముందుగా పొత్తు కుదుర్చుకున్నప్పటికీ , ఎన్నికల సమయానికి పవన్ మనసు చంద్రబాబుపై మళ్లింది. ఏపీలో బీజేపీతో సంబంధం లేకుండా పవన్ ముందుకెళ్లడాన్ని చూడొచ్చు. తెలంగాణ ఎన్నికల్లో మాత్రం బీజేపీతో పొత్తులో భాగంగా 8 చోట్ల పోటీ చేశారు. ఎన్ని చోట్ల డిపాజిట్లు దక్కించుకుంటారో చూడాలి.
అయితే ఏపీలో టీడీపీని సీట్ల డిమాండ్‌పై తెలంగాణ ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేస్తాయనే టాక్ నడుస్తోంది. తెలంగాణలో పోటీ చేసిన 8 స్థానాల్లో సాధించే ఓట్లపై టీడీపీ ఇచ్చే సీట్లు ఆధారపడి వుంటాయనే చర్చకు తెరలేచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ద్వేషంతో పవన్ అడుగడుగునా తప్పులు చేస్తూ వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పరామర్శించడం, అనంతరం పవన్‌కల్యాణ్ టీడీపీతో పొత్తు వుంటుందని ప్రకటించడం ద్వారా తన పార్టీకి తానే నష్టం చేసుకున్నారని ఆయన అభిమానుల్లో కూడా అసంతృప్తి ఉంది.
టీడీపీకి జనసేన అవసరం వుందనేది బహిరంగ రహస్యమే. రాజకీయంగా తెలివైన వాడైతే టీడీపీని తన కాళ్ల దగ్గరికి పవన్ రప్పించుకునేవాళ్లు. అప్పుడు పవన్ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ తప్పనిసరిగా దిగొచ్చేది. అందుకు విరుద్ధంగా తానే చంద్రబాబు కాళ్ల దగ్గరికి పోయినట్టుగా పవన్ వ్యవహరించారు. దీంతో పవన్ అంటే టీడీపీకి చులకనైంది. అనంతరం తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం ద్వారా మరో రాంగ్ స్టెప్ వేసినట్టైంది.
ఇలా రాజకీయంగా వరుస తప్పులు చేస్తూ, జనసేన ఎదుగుదలకు తానే అడ్డంకిగా మారారనే అసంతృప్తి జనసేన శ్రేణుల్లో వుంది. జనసేన వినాశనానికి వేరే శత్రువులు అవసరం లేదని, ఆ పని పవనే విజయవంతంగా చేస్తారనని పార్టీ శ్రేషులు నిష్టూరమాడుతున్నాయి. భస్మాసుర హస్తం గురించి పురాణ కథల్లో విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం.