క్షమాపణలు ఎవరెవరు చెబుతారో?

తెలంగాణలో గులాబీ నాయకులు ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సర్వేలు అన్నీ తప్పు అని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము గెలవబోతున్నామని జనాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. లోలోపల దోబూచులాడుతున్న ఓటమి భయాన్ని దాచిపెట్లడానికి నానా కష్టాలు…

తెలంగాణలో గులాబీ నాయకులు ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సర్వేలు అన్నీ తప్పు అని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము గెలవబోతున్నామని జనాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. లోలోపల దోబూచులాడుతున్న ఓటమి భయాన్ని దాచిపెట్లడానికి నానా కష్టాలు పడుతున్నారు. 

మేకపోతు గాంభీర్యంతో మాట్లాడుతున్నారు. ఆ ప్రయత్నంలో కొన్ని ప్రగల్భాలు కోటలు దాటుతున్నాయి. కాంగ్రెస్ గెలవబోతున్నదని చెబుతున్న సర్వే సంస్థలన్నీ కూడా రేపు 3వ తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత.. క్షమాపణలు చెబుతాయా? అనే ప్రశ్న కేటీఆర్ నుంచి రావడం కూడా చర్చనీయాంశం అవుతోంది.

సాధారణంగా సర్వేల్లో ప్రీపోల్ సర్వేలకు, ఎగ్జిట్ పోల్స్ కు కాస్త తేడా ఉంటుంది. పోలింగ్ ముందు రోజు వరకు ఉన్న ప్రజల నాడిని పరిశీలించి చేసేవి ప్రీపోల్ సర్వేలు అయితే, సరిగ్గా పోలింగ్ రోజున ఓటు వేసిన వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటూ.. గెలుపు గురించి అంచనాలు రూపొందించడం ఎగ్జిట్ పోల్ సర్వేలు. 

కాకపోతే.. పోలింగ్ కు ముందుగా ఎలాంటి సర్వే ఫలితాలను వెల్లడించరాదనే నిబంధన ఉంది కాబట్టి.. ప్రీపోల్ సర్వేలు చేసిన వాళ్లు కూడా.. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఒకేసారి ప్రెస్ మీట్లు పెట్టి వివరాలు వెల్లడిస్తుంటారు. కానీ.. పోలింగ్ తర్వాత చెబుతున్నారు కాబట్టి.. మనం ఏకరీతిగా వీటిని ఎగ్జిట్ పోల్ సర్వేలుగా పరిగణిస్తుంటాం.

తెలంగాణలో ఆత్మసాక్షి అనే ఒక సంస్థ తప్ప దాదాపుగా సర్వేలు నిర్వహించిన ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ విజయాన్నే సూచించారు.  ఇది సహజంగానే గులాబీ నాయకులకు చిరాకు పుట్టించిన వ్యవహారం అని చెప్పుకోవాలి. అందుకే ‘‘ఈ సర్వేలన్నీ  రబ్బిష్’’ అని నిందిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించిన కేటీఆర్.. 3వ తేదీ తాము గెలిచిన తర్వాత ఈ సంస్థలన్నీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతాయా? అని సవాలు విసిరారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో ఈ మాత్రం తెగువ ఉండాల్సిందే. ఆయన సవాలు సబబుగానే ఉంది.

కానీ ఇక్కడ ఇంకో సంగతి గమనించాలి. సర్వేలు నిజమై.. తెలంగాణలో కాంగ్రెసుకే అధికారం దక్కినా, లేదా, కాంగ్రెస్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా కూడా.. భారాస నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజల ఆకాంక్షల మేరకు తమ ప్రభుత్వం పనిచేయలేకపోయినందుకు మన్నించాల్సిందిగా అడగాలి. అలాగే.. కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ కూడా ఓడిపోతారని అంచనాలు చెబుతున్నాయి. 

ఒకవేళ ఓడిపోతే.. కేసీఆర్ కూడా కామారెడ్డి ప్రజలకు ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పాలి. తాను గజ్వేల్ కు మాత్రమే ప్రాతినిధ్యం వహించబోతున్నట్టుగా ముందుగానే ప్రకటించినప్పటికీ.. కామారెడ్డి ప్రజలతో ఆడుకున్నందుకు ఆయన క్షమాపణచెప్పాలి. ఈ రకంగా ఓటమి అనివార్యమైతే తండ్రీ కొడుకులు ఇద్దరూ కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారా? అనే ప్రశ్నలు ప్రజల వైపు నుంచి వస్తున్నాయి.