భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మాట తీరులో కించిత్తు మార్పు రాలేదు. అదే ధీమా, ఎప్పటిలాగా అదే ఘాటుతనం.. గెలుస్తామనే విశ్వాసం వ్యక్తీకరించడం.. ఇవన్నీ మాటల్లో ఎలాంటి మార్పులేకుండా కనిపిస్తున్నాయి.
కానీ.. పోలింగ్ ముగిసిన తర్వాత.. నిర్వహించిన ప్రెస్ మీట్ లో మళ్లీ గెలవబోతున్నాం, 3వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం.. ఖచ్చితంగా 70 సీట్లు గెలుస్తాం అంటూ ధాటిగా చెప్పడానికి కేటీఆర్ చాలాచాలా కష్టపడి ప్రాక్టీస్ చేశారేమో అని అనిపిస్తుంది. ఆయన ప్రెస్ మీట్ ను గమనిస్తే.. అదే అనిపిస్తుంది.
ప్రెస్ మీట్ లో ఆయన పలువురి ప్రశ్నలకు చాలా ధాటిగా సమాధానాలు ఇచ్చారు. 70కి పైగా సీట్లు గెలవబోతున్నామని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అనేకం తమ పార్టీకి వ్యతిరేకంగా రావడం అనేది తమకు కొత్త సంగతి కాదని ఆయన అంటున్నారు.
గతంలో కూడా పలుమార్లు ఇలా తమకు వ్యతిరేకంగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయంటున్నారు. అయితే ఈ ఫలితాలు తప్పు అని ప్రూవ్ చేయడం తమకు తెలుసునని ఆయన అంటున్నారు. మాటలు బాగానే ఉన్నాయి. కానీ.. ప్రెస్ మీట్ నిర్వహించిన కేటీఆర్ మొహంలో కళాకాంతులు ఏమాత్రం కనిపించడం లేదు.
పాపం.. మొన్నటిదాకా అలుపెరగకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత.. పార్టీ ఆఫీసులో దీక్షాదివస్ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బాగా బిజీగా ఉండడం వల్ల అలసిపోయి ఉన్నారేమో అనుకోవడానికి కూడా వీల్లేదు. ప్రచారంలో అలిసిపోతూ తిరుగుతూ ఉన్నంత వరకు ఉన్న ఉత్సాహం కూడా ఆయన మొహంలో నేడు ప్రెస్ మీట్ లో కనిపించడం లేదు.
చూడబోతే.. ఎగ్జిట్ పోల్స్ ద్వారా మాత్రమే కాదు.. తమ సొంత నిఘా వర్గాల ద్వారా కూడా భారాస ఓటమి కన్ఫర్మ్ కావడం వల్ల మాత్రమే.. కేటీఆర్ మొహంలో కాంతి పోయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ మాత్రమే కాదు. ఆయన చెల్లెలు కవిత కూడా తమ పార్టీ విజయంపై భరోసా వ్యక్తం చేశారు. కానీ ఆమె మొహంలో కూడా కళాకాంతులు లేవు. ఇవన్నీ రాబోయే ఫలితాలకు సంకేతాలు అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.