డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని పలువురు సినీ సెలబ్రిటీలు చెబుతుంటారు. లోకేశ్ పరిస్థితి కూడా అట్లే తయారైంది. పొలిటీషియన్ కాబోయి, ఆయన కమెడియన్ అవుతున్నట్టుగా టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి.
నారా లోకేశ్ అనుకున్నదొకటి, అవుతున్నదొకటి. రాజకీయాల్లో బాగా రాణించాలన్నది ఆయన ఆశయం. చంద్రబాబు వారసుడిగా మొదట నిరూపించుకోవాలని తహతహలాడుతున్నారు. అయితే ఆయన వ్యవహార శైలి చూస్తే. ఆ దిశగా రాజకీయ ప్రయాణం సాగుతున్నట్టుగా లేదు. పొలిటీషియన్ ఏమో కానీ, కమెడియన్‌గా తయారవుతున్నారేమో అనే అనుమానం చాలా మందిలో కలుగుతోంది.
ఇంతకాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఒక్కరే పొలిటికల్ కమెడియన్ ఉన్నారనే టాక్ నడిచింది. ఆ తర్వాత జనసేనాని పవన్‌కల్యాణ్, ఇప్పుడు వాళ్లిద్దరి సరసన లోకేశ్ చేరారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత 79 రోజులకు లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్‌కు తగ్గట్టే లోకేశ్ యువగళాన్ని హాస్యగళంగా మార్చారు.
లోకేశ్‌కు మాటలెక్కువ. పోనీ అవైనా పద్ధతిగా, ఆకట్టుకునేలా మాట్లాడ్తారా అంటే అదీ లేదు. పిల్లలు చదువుకోడానికి ప్రతి ఏడాది రూ.15 వేలు ఇస్తాననడానికి బదులు, ప్రతినెలా ఇస్తానని చెప్పి మొదటి రోజే వైసీపీకి ఆయుధం ఇచ్చారు. లోకేశ్ కామెడీ అంతటితో ఆగితే, టీడీపీ బాధపడేది కాదు. ఇంట్లో ఒక విద్యార్థి వుంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గరుంటే రూ.90 వేలు అని చెప్పి, తాను కమెడియన్ అని లోకేశ్ నిరూపించుకున్నారు.
తొలి రోజు లోకేశ్ ప్రసంగంలో కావాల్సినంత కామెడీ దొరికింది. తనను విచారించిన సీఐడీ అధికారులు రెడ్ బుక్‌లో తమ పేర్లు లేవు కదా? అని భయంతో అడిగారని చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో యుద్ధం మొదలైందని, జగన్‌కు ఎక్స్‌పెయిరీ డేట్ ఫిక్స్ అయ్యిందని లోకేశ్ మాట్లాడ్డం నవ్వు తెప్పించింది. చంద్రబాబును అరెస్ట్ చేయగా, టీడీపీ శ్రేణులకు అండగా నిలవాల్సింది పోయి, పరుగో పరుగంటూ ఢిల్లీకి పారిపోయిన లోకేశ్ కూడా భారీ డైలాగ్‌లు చెప్పడం దేనికి నిదర్శనం? అలాగే జగన్‌తో పాటు వైసీపీ నేతలకు భయాన్ని రుచి చూపించే బాధ్యత వ్యక్తిగతంగా తాను తీసుకుంటానంటూ లోకేశ్ చెప్పిన డైలాగ్స్ విని జనాలు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
మీ అందరికీ క్విజ్ పెడతానంటూ లోకేశ్ కామెడీ చెప్పాల్సిన పనిలేదు. అప్పుడే తామేదో అధికారంలోకి వచ్చినట్టు, జగన్ ఎక్కడికి పారిపోతారని జనాన్ని ప్రశ్నించడం లోకేశ్‌కే చెల్లింది. ఇలా మాటలు కోటలు దాటేలా మాట్లాడుతూ జనంలో లోకేశ్ అభాసుపాలవుతున్నారనే చర్చకు తెరలేచింది. కొంచెం ఆచరణ సాధ్యమయ్యే మాటలు చెబితే లోకేశ్‌కే మంచిది. కేఏ పాల్ కూడా లక్షల కోట్లు విదేశాల నుంచి తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి చేస్తానని అంటుంటారు. లోకేశ్ ఇంకా కేఏ పాల్ స్థాయికి ఎదగలేదు. కానీ బాట మాత్రం అదే.