అయినా.. రేవంత్ తీరు మారలేదు

పార్టీలు మారవచ్చు కానీ, నాయకుల తీరు తెన్నులు మారవు. ఎత్తులు, ఎత్తుగడలు వారి వారి స్వభావ స్వరూపాలకు అనుగుణంగానే వుంటాయి. వుంటూనే వుంటాయి. కాంగ్రెస్ నేత రేవంత్ తీరు ఇలాగే వుందని ప్రత్యర్ధులు తీవ్రంగా…

పార్టీలు మారవచ్చు కానీ, నాయకుల తీరు తెన్నులు మారవు. ఎత్తులు, ఎత్తుగడలు వారి వారి స్వభావ స్వరూపాలకు అనుగుణంగానే వుంటాయి. వుంటూనే వుంటాయి. కాంగ్రెస్ నేత రేవంత్ తీరు ఇలాగే వుందని ప్రత్యర్ధులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తన మీద ఉన్న ఓటుకు నోటు కేసును తెలివిగా అటు కాంగ్రెస్ మెడకు చంద్రబాబు పార్టీకి చుట్టేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పరువు నగుబాటు పాలయింది. పట్టపగలే 50 లక్షలతో బేరం ఆడి అడ్డంగా దొరికిన రేవంత్ తనను పంపించిన చంద్రబాబుతో ఫోన్ చేయించి ఆయనను కూడా బుక్ చేసేసారు. 

“ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్” అని ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. రేవంత్ రెడ్డి తీరు అలాగే ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే అసలు రేవంత్ పనిచేస్తుంది కాంగ్రెస్ కోసమా లేక తెలుగుదేశం కోసమా లేదా అన్నది తెలియాలి అంటే రేవంత్ అజెండాని పరిశీలించాలి.అప్పుడు అర్థం అవుతుంది. తెలుగుదేశం కోసమే రేవంత్ పని చేస్తున్నారని క్లారిటీ వస్తుంది.

మొదటగా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా వుందనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. దాంతో పార్టీ పగ్గాలు చేతిలోకి వచ్చేలా చేసుకున్నారు. దాని వెనుక ఎవరు లాబీయింగ్ చేసారన్నది రాజకీయ వర్గాలకు తెలిసిన సంగతే. ఎన్నికల వేళ పార్టీ టికెట్లను వివిధ పార్టీల నుండి వలస వచ్చిన వారికీ పంచి కాంగ్రెస్ కి క్యాండిడేట్లు లేరనే అభిప్రాయాన్ని తెలంగాణ మొత్తం అర్ధమైయ్యేలా చేసాడు. 

ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కాంగ్రెస్ నాయకులు.. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని తీవ్రంగా ఆరోపణలు చేశారు. నిజానికి వివిధ పార్టీల్లో పని చేసి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకుల సంఖ్య 118కి గాను 43 మంది ఉన్నారు. రేవంత్ టికెట్లు ఇచ్చిన 22 మంది వలస అభ్యర్థుల్లో డజను మంది అప్పట్లో టీడీపీలో పని చేసిన వారే. ఈ 12 మందిని కాంగ్రెస్ సీనియర్లు! డర్టీ డజన్! గా తిట్టించుకుంటున్నారు. 

అటు టికెట్లు రాని వాళ్లు తమ కోపాన్ని జిల్లాల కాంగ్రెస్ కార్యాలయాల ముందు, గాంధీ భవన్ లోను కుర్చీలు విరగొట్టి, బేనర్లు తగలబెట్టి రేవంత్ రెడ్డి ని బూతులు తిట్టి తమ ఆవేశాన్ని వెళ్లగక్కారు. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. రేవంత్ ని నమ్మి పార్టీ అప్పజెపితే నమ్మించి గొంతు కోసాడని కాంగ్రెస్ అధిష్టానానికి అర్థమయింది. అంతా అయ్యాక ఇప్పుడు చేయడానికి కాంగ్రెస్ చేతిలో ఏమిలేకుండా పోయింది. గత్యంతరం లేక చంద్రబాబుకు అనుకూలంగా రాజకీయాలు చేయాల్సి వస్తోంది. 

ఇక తనకు పోటీ ఎవరు ఉండకూడదని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారి నియోజకవర్గాల్లో ఓడిపోయే పన్నాగం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడని కాంగ్రెస్ వర్గాలు గుసగుస లాడుకుంటున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తరుపున ప్రచారం చెయ్యడానికి వెళితే సభ చివరిదాకా ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం ఈ స్కీములో భాగమే. సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా కొంత మంది నాయకులకు వారి వారి నియోజకవర్గాల్లో మంట పెట్టేందుకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కథ నడుపుతున్నాడు. 

ఇలా రేవంత్ రెడ్డి తన గురువు దగ్గర నేర్చుకున్న వెన్నుపోటు విద్యతో కాంగ్రెస్ లో తన ఆధిపత్యం కోసం ఆ పార్టీకే వెన్నుపోటు పొడుస్తున్నాడు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఊపుమీదున్నదని ప్రచారం చేస్తుండటం చూస్తుంటే మేడిపండు మాదిరే ఉంది. ఇక ఈ నేపథ్యంలో హస్తం ఊపున్నదంటూ చేసుకుంటున్న ప్రచారం ఎంత వరకు వాస్తవం అన్నది ఎవరికి వారు లెక్కలు వేసుకోవాల్సిందే.