ఏపీలో టీడీపీ ఎంత బలహీనంగా వుందో, ఆ పార్టీ ఆశలే చెబుతున్నాయి. ఏపీలో అధికార పక్షం వైసీపీపై వ్యతిరేకత, ఇదే సందర్భంలో తమపై సానుకూలత అధికారాన్ని తెచ్చి పెడతాయనే నమ్మకం టీడీపీలో ఏ మాత్రం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఏపీలో తమకు తిరుగులేదనే భావనలో టీడీపీ నేతలున్నారు. ఇదేం లాజిక్కో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, ఏపీలో వైసీపీ ఓడిపోతుందని చెప్పడానికి సంబంధం ఏంటి? అనే ప్రశ్నకు టీడీపీ నుంచి సమాధానం లేదు.
కానీ తెలంగాణ, ఏపీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలంతా తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని, ఒకవేళ మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, అది వైసీపీకి సానుకూలంగా మారుతుందని టీడీపీ భయపడుతోంది. గతంలో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రావడంతో, అక్కడి నుంచి టీడీపీకి రావాల్సిన నిధులు ఆగిపోయాయనేది టీడీపీ ఆవేదన.
ఈ దఫా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… అదే రకమైన వ్యూహాన్ని తాము అమలు చేస్తామని టీడీపీ చెబుతోంది. చంద్రబాబు శిష్యుడైన రేవంత్‌రెడ్డి తెలంగాణ సీఎం అయితే, టీడీపీ ప్రయోజనాల కోసం పని చేస్తారని ఆ పార్టీ నేతలు నమ్మకంగా ఉన్నారు. అలాగే తెలంగాణలో ఏపీకి చెందిన చాలా మందికి రియల్ ఎస్టేట్, ఇతరత్రా వ్యాపారాలున్నాయని, వారంతా వైఎస్ జగన్‌కు సాయం చేయకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రబాబుకు ఎన్నికల నిధులు ఇచ్చేలా చేసుకోవచ్చని అంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే .. ఏపీలో పోల్ మేనేజ్‌మెంట్‌కు ఉపయోగపడుతుందనేది టీడీపీ ఆలోచన. ఒకవేళ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం… ఏపీలో టీడీపీ-జనసేన కూటమి విజయాన్ని మరిచిపోవచ్చని కూడా వారే చెబుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌కు అన్ని రకాలుగా సహకరించిన పార్టీగా టీడీపీని బీఆర్ఎస్, బీజేపీ ఒక ఆట ఆడుకుంటాయచే చర్చకు తెరలేచింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తమకొచ్చే ఇబ్బందేమీ లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అంటే రేవంత్‌రెడ్డి మాత్రమే కాదని, కోమటిరెడ్డి బ్రదర్స్, భట్టి విక్రమార్క తదితరులంతా వైఎస్సార్ శిష్యులని, మొదటి నుంచి వారు పార్టీలో కీలకంగా వుంటున్నారని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా రేవంత్‌రెడ్డే సీఎం అవుతారని గ్యారెంటీగా చెప్పలేమని, అయినా చంద్రబాబు కోసం అతను ఓవరాక్షన్ చేసే పరిస్థితి వుండదనే చర్చ జరుగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఇదో కోణం మాత్రమే. ఊహలకు అడ్డుకట్ట వేయలేం కదా!