ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం వుంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఈ నియోజకవర్గంలోనే కొలువుదీరారు. తిరుమలలో శ్రీవారు, ఆయన పాదాల చెంత తిరుపతి వుంటుంది. హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుపతిని స్మరించని హృదయం వుండదు. అలాంటి తిరుపతి నుంచి ప్రజాప్రతినిధి కావాలనే కోరిక ప్రతి ఒక్కరిలో వుంటుంది.
అందుకే తిరుపతి అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు డిమాండ్ ఎక్కువ. ఇక్కడ బలిజ, రెడ్డి సామాజిక వర్గాలు బలంగా వున్నాయి. రెడ్ల కంటే 2 నుంచి 3 వేల ఓట్లు బలిజ సామాజిక వర్గానికి ఎక్కువ వుంటాయి. అందుకే రాజకీయ పార్టీలు వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఇదిలా వుండగా జనసేన, టీడీపీ తరపున బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులే నాయకత్వం వహిస్తున్నారు.
ఈ రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో టికెట్ ఎవరికనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనసేన టికెట్ ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్‌కు పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే వైసీపీని కలవరపెడుతోంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు టికెట్ ఇస్తే, కళ్లు మూసుకుని ఇంట్లో కూచున్నా గెలిచిపోతామనే ధీమాతో వైసీపీ వుండేది.
టీడీపీకి బదులు జనసేన బరిలో వుంటుందంటే వైసీపీ తీవ్రంగా శ్రమటోడ్చాల్సిందే అని చర్చ జరుగుతోంది. టీడీపీకి సీటు కేటాయిస్తే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ బరిలో ఉంటుందనే ప్రచారం జరగుతోంది. అయితే సుగుణమ్మ అల్లుడు సంజయ్ గిల్లుడు వ్యవహారాలు టీడీపీకి నష్టం తెస్తాయని ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వుంది. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సుగుణమ్మ అల్లుడు చేయని గొబ్బు పనులు లేవని, ఆమెకు కాకుండా మరెవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకొస్తామని ఇప్పటికే చంద్రబాబుకు తిరుపతి టీడీపీ నేతలు చెప్పారు.
మరోవైపు క్లీన్ ఇమేజ్ ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ హరిప్రసాద్‌కు టికెట్ ఇస్తే గెలుపు సునాయాసం అవుతుందనే ప్రతిపాదన టీడీపీ ఎదుట జనసేన పెట్టినట్టు సమాచారం. ఏ రకంగా చూసినా జనసేనకు టికెట్ ఇవ్వడమే సముచితమని టీడీపీలోని బలిజ నాయకులు సైతం అంటున్నారు.
డాక్టర్ హరిప్రసాద్‌ను బరిలో దింపితే, ఆయన్ను విమర్శించడానికి అధికార పక్షం వద్ద ఆయుధం కూడా లేదు. ఇది జనసేనకు సానుకూల అంశం. టీడీపీకి ఇస్తే, గతంలో సుగుణమ్మ కుటుంబ తిరుపతిలో భూకబ్జాలు, మహిళలపై లైంగిక వేధింపులు తెరపైకి వస్తాయని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. జనసేనకు టికెట్ ఇస్తే మాత్రం తిరుపతిలో వైసీపీకి దబిడి దబిడే అని చెప్పక తప్పదు.