చంద్రబాబునాయుడు నిజస్వరూపాన్ని ఇప్పట్లో మరచిపోయే స్థితిలో భారతీయ జనతా పార్టీ లేదా? తన అవసరం కోసం పొత్తులు పెట్టుకుని, అవసరం తీరిన తర్వాత టిష్యూ పేపర్ లాగా విసిరిపారేసే ఆయన దుర్మార్గపు లక్షణం పట్ల భారతీయ జనతా పార్టీ అప్రమత్తంగా ఉంటున్నదా? అందుకే వీలైనంత వరకు చంద్రబాబును దూరం పెట్టడానికే వారు ప్రయత్నిస్తున్నారా? అనే అభిప్రాయాలు పలువురిలో కలుగుతున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో 2.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం సందర్భంగా ఇలాంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఈ భాగస్వాముల సమావేశానికి భారతీయ జనతా పార్టీ చాలా ప్రాధాన్యం ఇస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలు భేటీలు నిర్వహిస్తుండగా.. తమకు సానుకూలంగా ఉండగల అన్ని పార్టీలను తిరిగి ఎన్డీయే గొడుగు కిందకు తెచ్చుకుని బలంగా తయారుకావాలనే సంకల్పంతో మోడీ దళం పనిచేస్తోంది.
గతంలో ఎన్డీయేలో ఉండి మధ్యలో విభేదించి వెళ్లిపోయిన పార్టీలను కూడా బిజెపి ఆహ్వానిస్తోంది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎన్డీయేను వదలి వెళ్లిపోయిన వారినందరినీ పిలుస్తున్నారు. గతంలో ఎన్డీయేలో లేకపోయినప్పటికీ.. భావసారూప్యత ఉన్న అయితే ఒక్క చంద్రబాబునాయుడుకు మాత్రం పిలుపు రాలేదు. చంద్రబాబును బిజెపి దూరం పెట్టదలచుకున్నట్టుగా ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోంది.
ఒకవైపు కర్ణాటకలో బిజెపితో గతంలో విభేదించి బయటకు వెళ్లడమే గాకుండా, ఇటీవలి ఎన్నికల్లో భాజపా పరాజయానికి పరోక్షంగా కారణమైన జేడీఎస్ ను కూడా తిరిగి బుజ్జగించి తమలో కలుపుకోవడానికి ఎన్డీయే సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి గానీ.. చంద్రబాబు మీద మాత్రం వారికి సానుభూతి పుడుతున్నట్టు లేదు.
ఇటీవల మీడియా వారితో చిట్ చాట్ లో చంద్రబాబు వ్యాఖ్యలు కూడా బిజెపి నుంచి సానుకూలత లేదన్నట్టుగానే ధ్వనిస్తున్నాయి. బిజెపి- తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీచేస్తుందని కేంద్రమంత్రి ప్రకటించిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘‘ఎవరెవరో మాట్లాడిన మాటలపై స్పందించి చులకన కాదల్చుకోలేదు’’ అని చంద్రబాబు అన్నారు.
ఆ పొత్తుల పట్ల ఆశను వ్యక్తం చేస్తే అవి కుదరకపోయినట్టయితే పరువు పోతుందని ఆయన భయపడుతున్నట్లుంది. ఎన్డీయే భేటీకి హాజరవుతున్న చంద్రబాబునాయుడు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్.. పొత్తుల గురించి చంద్రబాబు మనోగతాన్ని బిజెపి పెద్దలకు నివేదించే అవకాశం ఉంది. అయితే ఇంతగా బాబును దూరం పెడుతున్న ఆ పార్టీ.. మళ్లీ ఆయనతో చెట్టపట్టాలు వేసుకుని నడవడానికి సుముఖంగా ఉంటుందా? అనేది సందేహమే.